Pakistan Team: హోటల్‍లో డిన్నర్ కాదని.. ఆన్‍లైన్‍లో బిర్యానీ ఆర్డర్ చేసుకున్న పాక్ క్రికెటర్లు: వివరాలివే
Pakistan Team: హోటల్‍లో డిన్నర్ చేయకుండా పాకిస్థాన్ ఆటగాళ్లు ఆన్‍లైన్ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నారట. కోల్‍కతా వంటకాలను రుచి చూసేందుకు ఇలా ఇలా చేశారు. వివరాలివే..
Pakistan Team: వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి ఆరు మ్యాచ్‍ల్లో రెండు మాత్రమే గెలిచి సెమీస్ అవకాశాలను కష్టతరం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం (అక్టోబర్ 31)న బంగ్లాదేశ్‍తో పాకిస్థాన్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‍కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు కోల్‍కతా ఫేమస్ వంటకాలను రుచిచేశారని సమాచారం బయటికి వచ్చింది. తాము బస చేస్తున్న హోటల్‍లో టీమ్ డిన్నర్‌ను వద్దనుకొని ఓ ఆన్‍లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‍ఫామ్ ద్వారా ఆర్డర్ చేసుకున్నారట.
ఆన్‍లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‍ఫామ్ ద్వారా ఓ రెస్టారెంట్లో బిర్యానీ, కబాబ్స్, చాప్‍లను పాక్ ఆటగాళ్లు ఆర్డర్ చేసుకున్నారట. ఎంతో ఫేమస్ అయిన కోల్‍కతా బిర్యానీని ప్లేయర్లు టేస్ట్ చేశారు. జామ్ జామ్ రెస్టారెంట్ డైరెక్టర్ షద్మాన్ ఫైజ్ ద్వారా ఈ విషయం బయటికి వచ్చింది.
పాకిస్థాన్ క్రికెటర్ల నుంచి ఆ ఆర్డర్ వచ్చిందని తమకు ముందుగా తెలియదని, ఆ తర్వాత తెలిసిందని షద్మాన్ చెప్పారు. ఆదివారం సాయంత్రం తమకు ఆర్డర్ వచ్చిందని వెల్లడించారు.
“ఓ ఆన్‍లైన్ డెలివరీ ప్లాట్‍ఫామ్ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది. బిర్యానీ, కబాబ్స్, చాప్ వంటకాలను వారు ఆర్డర్ చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆర్డర్ వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ నుంచి ఆ ఆర్డర్ వచ్చినట్టు మొదట్లో మాకు తెలియదు. ఆ తర్వాత మాకు తెలిసింది. వాళ్లకు ఫుడ్ నచ్చిందని అనుకుంటున్నా. అన్ని దేశాల వారు ఇక్కడికి వచ్చి కోల్‍కతా ఫుడ్ టేస్ట్ చేయాలి. కోల్‍కతా బిర్యానీకి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఫేమ్” అని షద్మాన్ చెప్పారు.
హైదరాబాద్‍లో ఉన్న సమయంలో కూడా బిర్యానీలను పాకిస్థాన్ ప్లేయర్లు తెగ తిన్నారని సమాచారం. అయితే, పాక్ ఆటగాళ్ల ఆహార అలవాట్లు, ఫిట్‍నెస్‍పై ఇటీవల కొందరు విమర్శలు చేశారు. పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్.. పాక్ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ ప్లేయర్లపై అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్ టీమ్ రోజుకు కిలోల కొద్ది మాంసం తింటోందని అన్నారు. అందుకే ఫిట్‍నెస్ సరిగా లేదని అభిప్రాయపడ్డారు.
“మా ప్లేయర్ల ఫిట్‍నెస్ లెవెల్స్ చూడండి. రెండేళ్లుగా వారికి ఫిట్‍నెస్ టెస్టులు నిర్వహించడం లేదని మేం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు నేను పేర్లతో అంటే.. వారికి ముఖాలు వాడిపోతాయి. వాళ్లు రోజుకు 8 కిలోల మాంసం తింటున్నట్టు ఉన్నారు. దేశం కోసం ఆడేందుకు మీరు వేతనాలు తీసుకుంటున్నారు. ఫిట్‍నెస్ టెస్టులు ఉండాల్సిందే” అని అక్రమ్ అన్నారు. పాకిస్థాన్ ప్లేయర్లు ఫీల్డింగ్‍లో నెమ్మదిగా కదలడం, చాలా తప్పిదాలు చేస్తుండటంతో ఆ దేశ కొందరు మాజీ ఆటగాళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.