ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో పాకిస్థాన్ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ముల్తాన్ వేదికగానే జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్ టీమ్.. సొంతగడ్డపైనే నవ్వులపాలైన విషయం తెలిసిందే. అయితే.. ముల్తాన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా సత్తాచాటుతున్నారు. దాంతో ఇంగ్లాండ్‌కి ఇబ్బందులు తప్పడం లేదు.
మ్యాచ్ రెండో రోజైన బుధవారం (అక్టోబరు 16) పాక్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ అద్భుత బౌలింగ్ చేశాడు. సెంచరీ బాదిన ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ (114)తో పాటు ఓలీ పోప్ (29), హ్యారీ బ్రూక్ (9), వెటరన్ బ్యాటర్ జో రూట్ (34) వికెట్లనీ సాజిద్ ఖాన్ పడగొట్టాడు.
31 ఏళ్ల ఈ స్పిన్నర్ దెబ్బకి ఇంగ్లాండ్ 14 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సాజిద్ ఔట్ చేసిన జో రూట్, హారీ బ్రూక్ ఇటీవల తొలి టెస్టులో పాకిస్థాన్‌పై డబుల్, ట్రిపుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
వాస్తవానికి జో రూట్ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడే అతని దగ్గరికి వెళ్లిన సాజిద్ ఖాన్.. ‘‘నేను ఇంగ్లాండ్‌లో నీ తమ్ముడితో కలిసి ఆడాను. నిన్ను ఔట్ చేయడం నా డ్రీమ్. ఈ మ్యాచ్‌లో ఔట్ చేస్తాను’’ అని చెప్పాడట. కానీ అతడ్ని మాటల్ని పట్టించుకోని జో రూట్ నవ్వేసి ఊరుకున్నాడట. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత సాజిద్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 366 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 239/6తో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్ జట్టు పాక్ కంటే ఇంకా 127 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. క్రీజులో ప్రస్తుతం జేమీ స్మిత్ (12 బ్యాటింగ్), బ్రైడన్ కార్స్ (2 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉండగా పిచ్ స్పిన్నర్లకి కలిసొస్తోంది.