PAK vs ENG: ముల్తాన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లకి పాకిస్థాన్ బ్యాటర్లు చుక్కలు.. భారీ స్కోరు నమోదు-pakistan 556 all out vs england in 1st test at multan cricket stadium ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pak Vs Eng: ముల్తాన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లకి పాకిస్థాన్ బ్యాటర్లు చుక్కలు.. భారీ స్కోరు నమోదు

PAK vs ENG: ముల్తాన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లకి పాకిస్థాన్ బ్యాటర్లు చుక్కలు.. భారీ స్కోరు నమోదు

Galeti Rajendra HT Telugu
Oct 08, 2024 05:44 PM IST

Pakistan vs England 1st Test: బంగ్లాదేశ్ చేతిలో ఇటీవల చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. ఎట్టకేలకి మళ్లీ పుంజుకుంది. ఇంగ్లాండ్‌పై ముల్తాన్ స్టేడియంలో పరుగుల మోత మోగించేసింది.

ఇంగ్లాండ్‌పై సెంచరీ బాదిన సల్మాన్
ఇంగ్లాండ్‌పై సెంచరీ బాదిన సల్మాన్ (AFP)

పాకిస్థాన్ టీమ్ సొంతగడ్డపై చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌లో జూలు విదిల్చింది. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీల మోత మోగించేసిన పాకిస్థాన్ టీమ్.. తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోరుని నమోదు చేసింది. పాకిస్థాన్ జట్టులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు శతకాలు నమోదు చేశారు.

సోమవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టులు ఆడుతున్న ఇంగ్లాండ్ టీమ్‌కి ఆరంభంలోనే ఓపెనర్ సయిద్ ఆయుబ్ (4) రూపంలో ఆరంభంలోనే వికెట్ దక్కింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది.

రెండో వికెట్‌కి 253 పరుగుల భాగస్వామ్యం

పాకిస్థాన్ మరో ఓపెనర్ షఫిక్ (102: 184 బంతుల్లో 10x4, 2x6), కెప్టెన్ మసూద్ (151: 177 బంతుల్లో 13x4, 2x6) పోటీపడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. పదే పదే క్రీజు వెలుపలికి వెళ్లి మరీ భారీ షాట్లు ఆడిన ఈ జోడి.. రెండో వికెట్‌కి 253 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ బ్యాక్‌ స్టెప్ వేసింది. ఆ తర్వాత వచ్చిన బాబర్ అజామ్ (30) పేలవ ఫామ్‌తో నిరాశపరిచినా.. సయ్యద్ షకీల్ (82: 177 బంతుల్లో 8x4) స్కోరుబోర్డుని నడిపించాడు.

ఈరోజు కూడా ఒక సెంచరీ

మ్యాచ్‌లో రెండో రోజైన మంగళవారం స్పిన్ ఆల్‌రౌండర్ సల్మాన్ (104: 109 బంతుల్లో 10x4, 3x6) కూడా సెంచరీ బాదడంతో పాకిస్థాన్ తిరుగులేని స్కోరుని నమోదు చేయగలిగింది. బాబర్ అజామ్ తక్కువ స్కోరుకి ఔటైపోవడం మినహా పాకిస్థాన్‌కి తొలి ఇన్నింగ్స్‌లో ఎదురైన ఇబ్బందులు ఏమీ లేవు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 149 ఓవర్లు ఆడిన పాకిస్థాన్ 556 పరుగులు చేసింది.

మంగళవారం చివరి సెషన్‌లో పాకిస్థాన్ ఆలౌటవగా.. అలసిపోయిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కానీ.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ ఓలీ పోప్ (0) రూపంలో వికెట్ చేజార్చుకుంది.

బంగ్లాదేశ్ చేతిలో ఇటీవల రెండు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కి గురైన పాకిస్థాన్ టీమ్.. ఈ తరహాలో ఇంగ్లాండ్‌పై చెలరేగిపోతుందని ఎవరూ ఊహించలేదు.

Whats_app_banner