Shahid Afridi on Shaheen: తన అల్లుడిని పాకిస్థాన్ టీమ్‌లో నుంచి తీసేయడంపై షాహిద్ అఫ్రిది రియాక్షన్ వైరల్
Shahid Afridi on Shaheen: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ నుంచి షహీన్ షా అఫ్రిది, బాబర్ ఆజంలాంటి ప్లేయర్స్ ను తొలగించడంపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది రియాక్షన్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ తో తొలి టెస్టు ఓటమి తర్వాత.. మిగిలిన రెండు టెస్టులకు వాళ్లను పక్కన పెట్టడం షాక్ కు గురి చేసింది.
Shahid Afridi on Shaheen: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఇంగ్లండ్ తో ముల్తాన్ లో జరిగిన తొలి టెస్టులో ఆ టీమ్ ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం అక్కడి అభిమానులకు మింగుడు పడటం లేదు. ఈ ఓటమి తర్వాత బాబర్ ఆజం, షహీన్ అఫ్రిది, నసీమ్ షాలాంటి సీనియర్ ప్లేయర్స్ ను సెలెక్టర్లు పక్కన పెట్టడంపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.
ఈ నిర్ణయం మంచిదే: అఫ్రిది
పాకిస్థాన్ టీమ్ లో చోటు కోల్పోయిన వాళ్లలో షాహిద్ అఫ్రిది అల్లుడు షహీన్ షా అఫ్రిది కూడా ఉన్నాడు. వాళ్లను తీసేయలేదని, విశ్రాంతి ఇచ్చామని మాత్రమే పాక్ టీమ్ చెబుతూ వస్తోంది. దీనిపై అఫ్రిది సోమవారం (అక్టోబర్ 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు.
"అంతర్జాతీయ క్రికెట్ నుంచి బాబర్, షహీన్, నసీమ్ లకు బ్రేక్ ఇవ్వాలన్న సెలక్టర్ల నిర్ణయానికి మద్దతిస్తున్నాను. ఈ నిర్ణయం ఈ ఛాంపియన్ ప్లేయర్స్ కెరీర్ మరింత సుదీర్ఘంగా కొనసాగడానికి సాయం చేస్తుంది. అదే సమయంలో యువ ప్లేయర్స్ ను పరీక్షించడానికి, బెంచ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది" అని అఫ్రిది ట్వీట్ చేశాడు.
పాకిస్థాన్ దారుణ ఓటమి
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరిస్థితి కొన్నేళ్లుగా దారుణంగా మారుతోంది. స్వదేశంలోనూ ఆ టీమ్ వరుసగా ఓటముల పాలవుతోంది. తాజాగా ఇంగ్లండ్ తో ముల్తాన్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులు చేసినా.. ఇన్నింగ్స్ ఓటమి ఎదురవడం మింగుడు పడనిదే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
అంతకుముందే బంగ్లాదేశ్ చేతుల్లోనూ స్వదేశంలో 0-2తో వైట్ వాష్ కు గురైంది పాకిస్థాన్ టీమ్. దీంతో ఆ జట్టు ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్ ఆజంలాంటి సీనియర్ ప్లేయర్స్ వైఫల్యం కూడా ఆ టీమ్ ను వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలక్షన్ కమిటీ సీనియర్ ప్లేయర్స్ ను విశ్రాంతి పేరుతో పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం రాబోయే రెండు టెస్టుల్లో పాక్ టీమ్ పై ఎంతమేర ఉంటుందో చూడాలి.