ODI World Cup 2023: ఉత్కంఠ వీడింది! ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ క్రికెటర్లకు లైన్ క్లియర్
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు లైన్ క్లియర్ అయింది. దీంతో కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
ODI World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. 10 జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొననున్నాయి. అయితే, మిగిలిన అన్ని జట్లకు వీసాలు లభించినా.. పాకిస్థాన్‍కు ఆలస్యమవుతుండటంతో ఉత్కంఠ రేగింది. దీంతో పాక్ జట్టు ప్రపంచకప్ కోసం భారత్‍కు వచ్చే విషయంపై సస్పెన్స్ నెలకొంది. వీసాల ఆలస్యంపై ఐసీసీకి కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. మొత్తంగా కొన్ని రోజులుగా హైడ్రామా నడిచింది. అయితే, తాజాగా పాకిస్థాన్ టీమ్‍కు లైన్ క్లియర్ అయింది. పాక్ ప్లేయర్లకు వీసాలు మంజూరయ్యాయి. ఆ వివరాలివే..
వన్డే ప్రపంచకప్ కోసం ఇండియాకు వచ్చేందుకు పాకిస్థాన్ టీమ్‍కు వీసాలను భారత ప్రభుత్వం నేడు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ కూడా ధ్రువీకరించింది. వీసాలు మంజూరు కావటంతో వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ టీమ్ భారత్‍కు ప్రయాణించేందుకు లైన్ క్లియర్ అయింది. ఉత్కంఠ వీడింది. మరో 24 గంటల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల చేతుల్లో వీసాలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన పాక్ జట్టు.. భారత్‍కు బయలుదేరనుందని తెలుస్తోంది.
ముందుగా దుబాయ్‍కు వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు రావాలని తొలుత పాకిస్థాన్ జట్టు భావించింది. అయితే, భారత వీసాలు ఆలస్యం కావటంతో ఆ ప్లాన్‍ను మార్చుకుంది. నేరుగా భారత్‍కే రావాలని నిర్ణయించుకుంది. ప్రపంచకప్ సన్నాహక (వామప్) మ్యాచ్‍లో హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‍తో పాకిస్థాన్ తలపడనుంది. వీసాలు మంజూరు కావటంతో సెప్టెంబర్ 27న ఇండియాకు బయలుదేరాలని పాక్ జట్టు భావిస్తోంది. ప్రపంచకప్‍లో అక్టోబర్ 6న నెదర్లాండ్స్ జట్టుతో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది.
మరోవైపు, భారత్ వీసాలు ఆలస్యం చేస్తుండటంతో ప్రపంచకప్ కోసం తమ సంసిద్ధతకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు పాక్ జట్టుకు వీసాలు ఇచ్చింది ఇండియా.
అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. అయితే, టోర్నీకి ముందు సన్నాహకంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వామప్ మ్యాచ్‍లు జరగనున్నాయి.