Team India: షమీ, సూర్యకుమార్ మళ్లీ జట్టులోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే?
Team India: గాయాలతో జట్టుకు దూరమైన భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితిపై తాజాగా అప్‍డేట్లు వెల్లడయ్యాయి. వారు మళ్లీ ఎప్పుడు మైదానంలో బరిలోకి దిగే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
Team India: స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడడం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరూ అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా దూరమయ్యారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతి నుంచి గాయంతో షమీ బాధపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లలేకపోయాడు. టెస్టు జట్టుకు ఎంపికైనా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడు సౌతాఫ్రికాకు వెళ్లలేదు. ప్రస్తుతం మహమ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న మహమ్మద్ షమీ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఇంకా బౌలింగ్ మొదలుపెట్టలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇంగ్లండ్‍తో సొంతగడ్డపై భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్‍లో మొదటి రెండు మ్యాచ్‍లకు షమీ దూరమవుతాడని సమాచారం. మూడో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
“బౌలింగ్ వేయడం షమీ ఇంకా ప్రారంభించలేదు. అతడు ఎన్‍సీఏకు వెళ్లి ఫిట్‍నెస్‍ను నిరూపించుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్‍తో జరిగే తొలి రెండు టెస్టుల్లో మహమ్మద్ షమీ ఆడడం అనుమానమే” అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25వ తేదీన మొదలుకానుంది. హైదరాబాద్‍లో తొలి టెస్టు జరుగుతుంది.
సూర్యకుమార్‌కు సర్జరీ
దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి చీలమండకు గాయమైంది. అయితే, సూర్యకుమార్‌కు హెర్నియా శస్త్రచికిత్స కూడా చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ మళ్లీ జట్టులోకి వచ్చేందుకు రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
“అంచనా వేసిన దాని కంటే సూర్యకుమార్ విషయంలో ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అతడి హెర్నియా ఆపరేషన్ తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది వారాలు పట్టొచ్చు. ఐపీఎల్ నాటికి అతడు ఫిట్ అవుతాడని ఆశిస్తున్నాం” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
అయితే, శస్త్రచికిత్స కోసం సూర్యకుమార్ యాదవ్.. జర్మనీకి వెళతాడని సమాచారం బయటికి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‍లో తొలుత కొన్ని మ్యాచ్‍లకు సూర్య దూరమవుతాడని ఓ రిపోర్ట్ పేర్కొంది.
“హెర్నియాకు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. మరో రెండు మూడు రోజుల్లో జర్మనీలోని మునిచ్‍లో అతడికి శస్త్రచికిత్స జరుగుతుంది. అందుకే ఈ రంజీ సీజన్‍లో అతడు ముంబై తరఫున ఆడలేడు. అలాగే, ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున తొలుత కొన్ని మ్యాచ్‍లకు అతడు మిస్ కావొచ్చు” అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.
ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకంగా ఉండనున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో ఐసీసీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు బ్యాటర్‌గా ఉన్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం పూర్తిగా సిద్ధమయ్యేందుకు సూర్యకు కావాల్సిన సమయాన్ని బీసీసీఐ ఇస్తుందని ఆ రిపోర్ట్ పేర్కొంది.
సంబంధిత కథనం