MI vs GT IPL 2024: టాస్ సమయంలో హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి షాక్
MI vs GT - Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. ఈ సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ముంబై నేడు తన తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది ముంబై ఇండియన్స్ జట్టు.
MI vs GT - IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు వేట షురూ చేశాయి. ఈ సీజన్ కోసం రెండు జట్లు కొత్త కెప్టెన్‍లను నియమించాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ. హార్దిక్ ముంబైకి వెళ్లిపోవటంతో గుజరాత్ జట్టుకు శుభ్‍మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. ఈ ఇరు జట్ల మధ్య నేడు (మార్చి 24) అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అయితే, టాస్ సమయంలో ముంబై కెప్టెక్ హార్దిక్‍కు ప్రేక్షకుల నుంచి షాక్ ఎదురైంది.
టాస్ సమయంలో కామెంటేటర్ రవిశాస్త్రి.. హార్దిక్ పాండ్యా పేరు చెప్పగానే స్టేడియంలోని చాలా మంది ప్రేక్షకులు ‘బూ’ అని అరిచారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించడం.. హార్దిక్ గుజరాత్ నుంచి మళ్లీ ముంబైకి వెళ్లడం నచ్చని కొందరు ప్రేక్షకులు అసంతృప్తితో అలా 'బూ' అంటూ అరిచారు. దీంతో హార్దిక్ కూడా కాస్త నిరాశ చెందినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ నుంచి నుంచి వెళ్లి 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‍గా టైటిల్ అందించాడు హార్దిక్. 2023లో టీమ్‍ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, అప్పుడు హార్దిక్‍ను హీరోగా చూసిన అహ్మదాబాద్ ప్రేక్షకులు.. ఇప్పుడు ముంబై జట్టుకు తిరిగివెళ్లిపోవటంతో అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది.
తమ కెప్టెన్ ఎప్పటికీ రోహిత్ శర్మనే అంటూ కొందరు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.. స్డేడియంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఇక మ్యాచ్‍లో హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆటగాడిగా బరిలోకి దిగాడు. చాలా ఏళ్ల తర్వాత ముంబై తరఫున నాన్-కెప్టెన్‍గా ఆడుతున్నాడు.
టాస్ గెలిచిన హార్దిక్
ఈ మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి.. ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.
గుజరాత్‍లో తనకు చాలా సక్సెస్ దక్కిందని, అక్కడి ప్రేక్షకులకు హార్దిక్ పాండ్యా కృతజ్ఞతలు చెప్పాడు. ముంబైలో తాను క్రికెటర్‌గా ఎదిగానని, మళ్లీ ఆ జట్టులోకి వెళ్లడం సంతోషంగా ఉందని చెప్పాడు.
తనకు చాలా జ్ఞాపకాలు ఉన్న స్టేడియంలో కెప్టెన్‍గా ఆడుతుండడం చాలా సంతోషంగా ఉందని శుభ్‍మన్ గిల్ చెప్పాడు. రెండు సీజన్ల నుంచి ప్రేక్షకుల మద్దతు చాలా ఉందని, అది కూడా తమకు చాలా బలంగా ఉందని అన్నాడు.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, సామ్స్ ములానీ, గెరాల్డ్ కోట్జీ, పియూష్ చావ్లా, జస్‍ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్
ముంబై ఇంపాక్ట్ సబ్‍స్టిట్యూట్ ఆప్షన్లు: డేవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెఫార్డ్, విష్ణు వినోద్, నెహాల్ వాదేరా, మహ్మద్ నబీ
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు: వృద్దిమాన్ సాహా, శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్
గుజరాత్ ఇంపాక్ట్ సబ్‍స్టిట్యూట్ ఆప్షన్లు: బీఆర్ శరత్, మోహిత్ శర్మ, మానవ్ సూతర్, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్