IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్‌లో కోహ్లియే టాప్.. పర్పుల్ క్యాప్‌లో బుమ్రాను సమం చేసిన పంజాబ్ బౌలర్
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో ఆదివారం (ఏప్రిల్ 21) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోహ్లి, బుమ్రా టాప్ లో కొనసాగుతున్నారు.
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఆర్సీబీ చివరి స్థానంలో కొనసాగుతున్నా.. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మాత్రం ఆ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్ లోనే ఉన్నాడు. ఆదివారం (ఏప్రిల్ 21) కేకేఆర్ తో మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోహ్లి 7 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు.
ఆరెంజ్ క్యాప్.. కోహ్లియే టాప్
ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ లిస్టులో విరాట్ కోహ్లి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆర్సీబీ వరుస ఓటములతో లీగ్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితి ఉన్నా.. కోహ్లి మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. కేకేఆర్ తో మ్యాచ్ లోనూ మంచి ఊపు మీద కనిపించినా.. 18 పరుగులే చేశాడు. అయినా ప్రస్తుతం అతడు 379 పరుగులతో టాప్ లో కొనసాగుతున్నాడు.
8 మ్యాచ్ లలో కోహ్లి ఏకంగా 63.17 సగటుతో 379 రన్స్ చేయడంతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది. రెండో స్థానంలో సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. అతడు 6 మ్యాచ్ లలోనే 324 రన్స్ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ 318 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ లిస్టులో రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు.
ప్రస్తుతం గిల్.. 8 మ్యాచ్ లలో 298 రన్స్ చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు రోహిత్ 7 మ్యాచ్ లలో 297 రన్స్ చేసి ఐదోస్థానంలో కొనసాగుతున్నాడు. సునీల్ నరైన్ 286 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.
పర్పుల్ క్యాప్.. బుమ్రానే టాప్ కానీ..
ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రానే ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే అతన్ని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ సమం చేశాడు. బుమ్రా 7 మ్యాచ్ లలో 13 వికెట్లతో ఉన్నాడు. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 5.98గా ఉంది. మరోవైపు హర్షల్ పటేల్ కూడా 13 వికెట్లే తీసినా.. అతని ఎకానమీ రేటు మాత్రం 9.58గా ఉండటంతో రెండోస్థానానికే పరిమితమయ్యాడు.
పర్పుల్ క్యాప్ జాబితాలో యుజువేంద్ర చహల్, గెరాల్డ్ కొట్జియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. సామ్ కరన్ 11 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆదివారం (ఏప్రిల్ 21) గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడినా.. ఆ టీమ్ బౌలర్ హర్షల్ పటేల్ మాత్రం పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలో ఉంది.
సోమవారం (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ జాబితాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.