India vs South Africa World Cup 2023 Highlights: భారత్ ఘన విజయం.. 243 పరుగుల తేడాతో.. దక్షిణాఫ్రికా చిత్తు
India vs South Africa World Cup 2023 Highlights: దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్‍లో వరుసగా ఎనిమిదో మ్యాచ్‍లో గెలిచింది. 83 పరుగులకే సఫారీ జట్టు ఆలౌటైంది.
India vs South Africa World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్‍లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 243 పరుగుల భారీ తేడాతో సఫారీ జట్టును భారత్ చిత్తు చేసింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజున 49వ వన్డే సెంచరీతో సచిన్ అత్యధిక వన్డే శతకాల రికార్డును సమం చేసి సత్తాచాటాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభించటంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్‍లో అజేయంగా వరుసగా ఎనిమిదో విజయం సాధించింది భారత్. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను పక్కా చేసుకుంది.
India vs South Africa World Cup 2023 match Live Score updates
8.35 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికాను 27.1 ఓవర్లలోనే 83 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సఫారీ బ్యాటింగ్ లైనప్‍ను కూల్చాడు. మహమ్మద్ షమీ, కుల్దీప్ చెరో రెండు, మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశారు. భారత బౌలింగ్ ధాటిగా దక్షిణాఫ్రికా విలవిల్లాడింది. విరాట్ కోహ్లీ శతకం చేయటంతో ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
8.27 PM: Ind vs SA Live Score: టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‍లో వరుసగా ఎనిమిదో మ్యాచ్ గెలిచింది.
8.27 PM: Ind vs SA Live Score: భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. 27వ ఓవర్లో కగిసో రబాడా (6)ను జడేజా ఔట్ చేశాడు. దీంతో 79 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. గెలుపునకు ఒక వికెట్ దూరంలో ఉంది భారత్.
8.23 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికా 8వ వికెట్ కోల్పోయి ఓటమికి చేరువైంది. సపారీ ఆటగాడు మార్కో జాన్సెన్ (14)ను భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దీంతో 25.4 ఓవర్లలో 79 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా.
8.14 PM: Ind vs SA Live Score: 23 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 70 పరుగులు చేసింది. కగిసో రబాడా (3 నాటౌట్), మార్కో జాన్సెన్ (8 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. మరో మూడు వికెట్లు తీస్తే టీమిండియా విజయం సాధిస్తుంది.
8.03 PM: Ind vs SA Live Score: భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‍లో తన నాలుగో వికెట్ తీసుకున్నాడు. 19 ఓవర్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ కేశవ్ మహారాజ్‍ను జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో 67 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. భారత్ విజయానికి 3 వికెట్ల దూరంలో ఉంది.
7.55 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (11)ను టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో 16.3 ఓవర్లలో 59 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. భారీ లక్ష్యఛేదనలో సఫారీ జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలుతోంది.
7.50 PM: Ind vs SA Live Score: 16 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (11 నాటౌట్), మార్కో జాన్సెన్ (7 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ సఫారీ టీమ్‍ను కట్టడి చేస్తున్నారు.
7.35 PM: Ind vs SA Live Score: 40 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా. 14వ ఓవర్లో రాసీ వాండర్ డుసెన్ (13)ను భారత పేసర్ మహమ్మద్ షమీ ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.
7.28 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (1)ను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‍లో తన రెండో వికెట్ తీసుకున్నాడు. దీంతో 12.5 ఓవర్లలో 40 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది సపారీ జట్టు. తీవ్రమైన కష్టాల్లో పడింది.
7.17 PM: Ind vs SA Live Score: భారీ లక్ష్యఛేదనలో సఫారీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్ రమ్ (9)ను భారత పేసర్ మహమ్మద్ షమీ ఔట్ చేశాడు. తన తొలి ఓవర్లోనే షమీ వికెట్ తీశాడు. దీంతో 9.5 ఓవర్లలో 35 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా.
7.08 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా (11)ను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. దీంతో 8.3 ఓవర్లలో 22 పరుగుల వద్ద రెండో వికెట్ చేజార్చుకుంది దక్షిణాఫ్రికా.
7.00 PM: Ind vs SA Live Score: భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 7 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. బవూమా (11 నాటౌట్), డుసెన్ (4 నాటౌట్) నెమ్మదిగా ఆడుతున్నారు.
6.48 PM: Ind vs SA Live Score: నాలుగు ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. బవూమా (4 నాటౌట్), వాండెర్ డుసెన్ (2 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
6.37 PM: Ind vs SA Live Score: దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (5)ను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 1.4 ఓవర్లలో 6 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.
6.32 PM: Ind vs SA Live Score: తొలి ఓవర్లో దక్షిణాఫ్రికా 2 పరుగులు చేసింది.
6.28 PM: Ind vs SA Live Score: టీమిండియా ఇచ్చిన 327 పరుగుల లక్ష్యఛేదనను దక్షిణాఫ్రికా మొదలుపెట్టింది. క్వింటన్ డికాక్, తెంబా బవూమా ఓపెనింగ్‍కు వచ్చారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తున్నాడు.
6.05 PM: Ind vs SA Live Score: సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్ లో 49 సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 277 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
6.00 PM: Ind vs SA Live Score: పుట్టిన రోజు ఈ సెంచరీ ప్రత్యేకం: కోహ్లి
పుట్టిన రోజునాడే సెంచరీ చేయడం చాలా ప్రత్యేకమని, సంతోషంగా ఉందని విరాట్ కోహ్లి అన్నాడు. బాల్ పాతబడిన తర్వాత బ్యాట్ పైకి సరిగా రాలేదని, అందుకే ఆచితూచి ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడాడని, అతనితో నెలకొల్పిన భాగస్వామ్యం కీలకమైనదని అన్నాడు.
5.56PM: Ind vs SA Live Score: ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి వన్డేల్లో 49వ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. శ్రేయస్ 77, రోహిత్ 40, జడేజా 29, సూర్యకుమార్ 22 రన్స్ చేశారు.
చాలా స్లోగా ఉన్న ఈడెన్ పిచ్ పై 326 రన్స్ భారీ స్కోరు అనే చెప్పాలి. ఇండియా బ్యాటర్ల ధాటికి సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సన్ 9.4 ఓవర్లలోనే 94 రన్స్ సమర్పించుకున్నాడు.
5.47PM: Ind vs SA Live Score: విరాట్ కోహ్లి 120 బంతుల్లో సెంచరీ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి. స్లో పిచ్ పై ఎంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. తన బర్త్ డే నాడు తనకు తానే సెంచరీ గిఫ్ట్ ఇచ్చుకున్నాడు.
5.43PM: Ind vs SA Live Score: విరాట్ కోహ్లి వన్డేల్లో 49వ సెంచరీ చేశాడు. తన 35వ పుట్టిన రోజు నాడు సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డు సమం చేశాడు.
5.31PM: Ind vs SA Live Score: ఇండియా 45 ఓవర్లలో 4 వికెట్లకు 278 రన్స్ చేసింది. కోహ్లి సెంచరీకి 11 పరుగుల దూరంలో ఉన్నాడు.
5.20 PM: Ind vs SA Live Score: ఇండియా 44 ఓవర్లలో 4 వికెట్లకు 262 రన్స్ చేసింది.కోహ్లి 82 రన్స్ తో ఆడుతున్నాడు.
5.12 PM: Ind vs SA Live Score: ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 43వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. అతడు 17 బంతుల్లో 8 రన్స్ మాత్రమే చేశాడు.
5.01 PM: Ind vs SA Live Score: ఇండియా 40 ఓవర్లలో 3 వికెట్లకు 239 రన్స్ చేసింది. కోహ్లి 75, రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి 10 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియా స్కోరు 300 దాటుతుందేమో చూడాలి.
4.42 PM: Ind vs SA Live Score: శ్రేయస్ అయ్యర్ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇండియా మూడో వికెట్ కోల్పోయింది. అయ్యర్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 77 రన్స్ చేశాడు. కోహ్లితో కలిసి అతడు మూడో వికెట్ కు ఏకంగా 134 రన్స్ జోడించాడు. శ్రీలంకతో మ్యాచ్ లో 82 రన్స్ చేసిన అయ్యర్.. ఈ మ్యాచ్ లోనూ సెంచరీ చేయకుండానే ఔటయ్యాడు.
4.34 PM: Ind vs SA Live Score: ఇండియా బ్యాటర్లు కోహ్లి, శ్రేయస్ సౌతాఫ్రికా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటున్నారు. ఇండియా 35 ఓవర్ల తర్వాత 2 వికెట్లకు 219 రన్స్ చేసింది. ఈ లెక్కన భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.
4.29 PM: Ind vs SA Live Score: ఇండియా 34 ఓవర్ల తర్వాత 2 వికెట్లకు 213 రన్స్ చేసింది. మార్‌క్రమ్ వేసిన 34వ ఓవర్లో కోహ్లి ఒక ఫోర్, శ్రేయస్ ఒక సిక్స్ కొట్టారు.
4.25 PM: Ind vs SA Live Score: ఇండియా 33 ఓవర్లలో 2 వికెట్లకు 199 రన్స్ చేసింది.
4.14 PM: Ind vs SA Live Score: ఇండియా 31 ఓవర్లలో 2 వికెట్లకు 193 రన్స్ చేసింది. అయ్యర్ 31వ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. కోహ్లితో కలిసి ఇప్పటికే మూడో వికెట్ కు సెంచరీకిపైగా పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశాడు.
4.10 PM: Ind vs SA Live Score: శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో అయ్యర్ 65 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు.
4.08 PM: Ind vs SA Live Score: ఇండియా 30 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 179 రన్స్ చేసింది. కోహ్లి 54, శ్రేయస్ అయ్యర్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు.
4.00 PM: Ind vs SA Live Score: బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. సౌతాఫ్రికాపై 67 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. వన్డేల్లో అతనికిది 71వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. కేశవ్ మహరాజ్ తన 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకున్నాడు.
3.48 PM: Ind vs SA Live Score: ఇండియా ఇన్నింగ్స్ సగం ఓవర్లు ముగిశాయి. 25 ఓవర్లలో ఇండియా 2 వికెట్లకు 143 రన్స్ చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్లు ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేశారు.
3.42 PM: Ind vs SA Live Score: ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్. అతడు తన 7 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
3.35 PM: Ind vs SA Live Score: ఇండియా గత 12 ఓవర్లలో కేవలం ఒకే ఫోర్ కొట్టింది. ఇక 11 నుంచి 20 ఓవర్ల మధ్య వికెట్ నష్టపోయి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.
3.31 PM: Ind vs SA Live Score: ఇండియా 20 ఓవర్ల తర్వాత 2 వికెట్లకు 124 రన్స్ చేసింది. శ్రేయస్ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు.
3.23 PM: Ind vs SA Live Score: ఇండియా 18 ఓవర్లలో 2 వికెట్లకు 118 రన్స్ చేసింది. గిల్ ఔటైన తర్వాత కోహ్లి, శ్రేయస్ ఆచితూచి ఆడుతున్నారు.
3.07 PM: Ind vs SA Live Score: ఇండియా 15 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 105 రన్స్ చేసింది. కోహ్లి, శ్రేయస్ అయ్యర్ మెల్లగా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
2.52 PM: Ind vs SA Live Score: ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ (23) బౌల్డ్ అయ్యాడు. దీంతో 93 పరుగుల దగ్గర ఇండియా రెండో వికెట్ పడింది.
2.50 PM: Ind vs SA Live Score: ఇండియన్ బ్యాటర్లు బౌండరీల మోత మోగిస్తున్నారు. తొలి పవర్ ప్లే 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 91 రన్స్ చేసింది. కోహ్లి 18, గిల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో రోహిత్, కోహ్లి, గిల్ కలిసి ఏకంగా 14 ఫోర్లు, 3 సిక్స్ లు బాదడం విశేషం.
2.30 PM: Ind vs SA Live Score: ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 24 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఆరు ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు.
2.26 PM: Ind vs SA Live Score: ఐదో ఓవర్లో రోహిత్ శర్మ మరింత చెలరేగాడు. అతడు రెండు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టడంతో ఇండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది.
2.20 PM: Ind vs SA Live Score: నాలుగో ఓవర్లో ఇండియా మరో 10 పరుగులు జోడించింది. రోహిత్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో 4 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టపోకుండా 45 రన్స్ చేసింది.
2.15 PM: Ind vs SA Live Score: మూడో ఓవర్లో ఇండియా మరో 13 పరుగులు చేసింది. రోహిత్ రెండు, గిల్ ఒక ఫోర్ కొట్టారు. దీంతో వికెట్ నష్టపోకుండా 35 రన్స్ చేసింది.
2.10 PM: Ind vs SA Live Score: రెండో ఓవర్లో 17 పరుగులు
ఇండియా రెండో ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాబట్టింది. మార్కో జాన్సన్ 8 వైడ్లు వేయడం గమనార్హం.
2.02 PM: Ind vs SA Live Score: తొలి ఓవర్ ముగిసిన తర్వాత ఇండియా వికెట్ నష్టపోకుండా 5 రన్స్ చేసింది. రోహిత్ ఒక ఫోర్ కొట్టాడు.
1.52 PM: Ind vs SA Live Score: సౌతాఫ్రికాతో ఆడే ఇండియన్ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్
సౌతాఫ్రికా తుది జట్టు ఇదే
క్వింటన్ డికాక్, టెంబా బవుమా, రాసీ వాండెర్ డుసెస్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షంసి, కగిసో రబాడా, లుంగి ఎంగిడి
1.30 PM: Ind vs SA Live Score: ఇండియాదే టాస్.. బ్యాటింగ్ ఫస్ట్
సౌతాఫ్రికాతో మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి కండిషన్స్ అయినా.. తమను తాము ఛాలెంజ్ చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ చెప్పాడు. శ్రీలంకతో ఆడిన టీమ్ తోనే ఈ మ్యాచ్ బరిలోనూ టీమిండియా దిగుతోంది.
1.22 PM: Ind vs SA Live Score: ఈడెన్ పిచ్ ఎలా ఉందంటే?
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని మ్యాచ్ కు ముందు మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఇర్ఫాన్ పఠాన్ చెప్పారు. సౌతాఫ్రికా పేసర్లకు అంతగా పేస్ లభించదని అన్నారు. సౌతాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
1.20 PM: Ind vs SA Live Score: ఈడెన్ గార్డెన్స్ లో కోహ్లి ఫీవర్
35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లి ఫీవర్ తో ఈడెన్ గార్డెన్స్ ఊగిపోతోంది. సౌతాఫ్రికాతో తన బర్త్ డే రోజే జరుగుతున్న మ్యాచ్ లో అతడు సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డు అందుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
1.10 PM: Ind vs SA Live Score: బ్రదర్ కోహ్లికి డివిలియర్స్ బర్త్ డే విషెస్
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇండియాతో మ్యాచ్ కు ముందు కింగ్ కోహ్లికి బర్త్ డే విషెస్ చెప్పాడు. నా తమ్ముడి బర్త్ డే.. ఐ లవ్ యూ ఎ లాట్ మ్యాన్ అంటూ కోహ్లికి ఏబీ విషెస్ చెప్పడం విశేషం.
11.55 AM: Ind vs SA Live Score: ఇండియా వెర్సెస్ సౌతాఫ్రికా.. రికార్డులివీ
సౌతాఫ్రికా 1991లో 20 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ క్రికెట్ లో అడుగుపెట్టిన తర్వాత తొలి మ్యాచ్ ఇండియాతోనే ఆడింది. అది కూడా ఇప్పుడు మ్యాచ్ జరగబోయే కోల్‌కతాలోనే కావడం విశేషం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ 90 వన్డేల్లో తలపడగా.. 50 మ్యాచ్ లలో సౌతాఫ్రికా, 37 మ్యాచ్ లలో ఇండియా గెలిచింది.
11.35 AM: Ind vs SA Live Score: సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేస్తే డేంజరే..
వరల్డ్ కప్ 2023లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ప్రతిసారీ.. భారీ స్కోర్లు చేసింది. 428, 311, 399, 382, 357 స్కోర్లతో చెలరేగింది. దీంతో ఇండియాతో మ్యాచ్ లోనూ ఆ టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తే ప్రమాదమే అని చెప్పాలి.
11.05 AM: Ind vs SA Live Score: డికాక్‌తో డేంజరే
వరల్డ్ కప్ లో ఇండియన్ బౌలర్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నారో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటర్ డికాక్ కూడా అంతే ప్రమాదకరంగా ఆడుతున్నాడు. దీంతో అతని నుంచి ఇండియన్ బౌలర్లకు సవాలు ఎదురు కానుంది. అందులోనూ ఇండియా అంటే అతడు చెలరేగుతాడు. ఇండియాతో 19 మ్యాచ్ లలో డికాక్ 6 సెంచరీలు చేయడం విశేషం. మొత్తంగా అతడు 56.42 సగటుతో 1072 రన్స్ చేశాడు.
10.40 AM: Ind vs SA Live Score: హార్దిక్ పాండ్యా లేకపోవడం లోటేనా?
ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తున్నా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ మొత్తానికీ దూరం కావడం మాత్రం పెద్ద లోటే అని చెప్పాలి. అతని గాయం తీవ్రత మరింత ఎక్కువైందని, కనీసం నడిచే పరిస్థితి కూడా లేదని బీసీసీఐ అధికారి చెప్పడం షాక్ కు గురి చేస్తోంది. అయితే షమి, సిరాజ్, బుమ్రాలాంటి వాళ్లు టాప్ ఫామ్ లో ఉండటం మాత్రం టీమిండియాకు ఊరట కలిగించేదే.
10.17 AM: Ind vs SA Live Score: ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా రికార్డు ఇదీ
సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇండియా 22 వన్డేలు ఆడింది. అందులో 13 గెలిచింది. 2017 నుంచి ఇక్కడ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంకలతో ఆడిన ఇండియా రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది.
09.45 AM: Ind vs SA Live Score: 35వ బర్త్ డేనాడు కోహ్లి 49 సాధిస్తాడా?
విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు అయిన ఆదివారం (నవంబర్ 5) ఇండియా, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లోనే సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లి అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
09.38 AM: Ind vs SA Live Score: 2011లో ఏం జరిగిందంటే..
సౌతాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా ఇండియాతో భారత గడ్డపై 2011లో తలపడింది. ఈ మ్యాచ్ లో ఆ టీమ్ 3 వికెట్లతో గెలిచింది. 297 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి, మరో రెండు బంతులు మిగిలి ఉండగా చేజ్ చేయడం విశేషం. ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ (111) సెంచరీ చేశాడు.
09.35 AM: Ind vs SA Live Score: ఇండియా, సౌతాఫ్రికాలలో ఎవరి ఫామ్ ఎలా ఉందంటే..
ఇండియా చివరి ఐదు మ్యాచ్ లలోనూ గెలిచి ఊపు మీద ఉంది. వరల్డ్ కప్ 2023లో ఇప్పటి వరకూ ఓటమెరగిన టీమ్ ఇండియానే.
అటు సౌతాఫ్రికా చివరి ఐదు మ్యాచ్ లలో నాలుగు గెలిచి, ఒకటి ఓడిపోయింది. సఫారీలు కూడా వరుసగా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి టీమిండియాకు సవాలు విసురుతున్నారు.
09.28 AM: Ind vs SA Live Score: ఇండియా, సౌతాఫ్రికా చివరి ఐదు మ్యాచ్ లలో రికార్డులు చూసుకుంటే.. ఇందులోనూ మూడు గెలిచి సౌతాఫ్రికా పైచేయి సాధించింది. గతేడాది ఇండియాలో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఇండియా 2-1తో గెలిచింది. అయితే అంతకుముందు స్వదేశంలో సౌతాఫ్రికా టీమ్ 3-0తో ఇండియాను చిత్తు చేసింది.
09.25 AM: Ind vs SA Live Score: ఇండియా సౌతాఫ్రికా ఇప్పటి వరకూ వన్డేల్లో 90 మ్యాచ్ లలో తలపడ్డాయి. అందులో సౌతాఫ్రికా 50 గెలవగా.. ఇండియా 37 గెలిచింది. మిగతా మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇక వరల్డ్ కప్ లలో ఇండియా, సౌతాఫ్రికా టీమ్స్ ఐదుసార్లు తలపడగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికా, రెండు ఇండియా గెలిచింది.