IND vs NED: మళ్లీ దెబ్బేసిన వాన.. ఇండియా, నెదర్లాండ్స్ వామప్ మ్యాచ్ రద్దు-india vs netherlands world cup warmup match abandoned ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ned: మళ్లీ దెబ్బేసిన వాన.. ఇండియా, నెదర్లాండ్స్ వామప్ మ్యాచ్ రద్దు

IND vs NED: మళ్లీ దెబ్బేసిన వాన.. ఇండియా, నెదర్లాండ్స్ వామప్ మ్యాచ్ రద్దు

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 03, 2023 04:50 PM IST

IND vs NED: ఇండియా, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. వర్షం దంచికొట్టడంతో మ్యాచ్ క్యాన్సిల్ అయింది.

IND vs NED: మళ్లీ దెబ్బేసిన వాన.. ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు
IND vs NED: మళ్లీ దెబ్బేసిన వాన.. ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ రద్దు (AP)

IND vs NED: టీమిండియాను వరుణుడు వదలడం లేదు. భారత్ ఆడాల్సిన రెండో వామప్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య తిరువనంతపురంలో నేడు (అక్టోబర్ 3) జరగాల్సిన వన్డే ప్రపంచకప్ వామప్ మ్యాచ్ రద్దయింది. పలుమార్లు వర్షం తీవ్రంగా పడటంతో టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఓ దశలో వాన తగ్గి మ్యాచ్ జరుగుతుందని అనుకోగానే.. మళ్లీ దంచికొట్టింది. దీంతో టీమిండియా, నెదర్లాండ్స్ మధ్య వామప్ మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

కాగా, భారత్, ఇంగ్లండ్ మధ్య సెప్టెంబర్ 30న గువహటి వేదికగా జరగాల్సిన వామప్ మ్యాచ్ కూడా వాన కారణంగానే రద్దయింది. అప్పుడు టాస్ పడిన తర్వాత వర్షం హోరుగా పడింది. నేడు టీమిండియా రెండో వామప్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో వామప్ మ్యాచ్‍లు ఆడకుండానే నేరుగా వన్డే ప్రపంచకప్‍లోకి అడుగుపెట్టనుంది టీమిండియా.

ప్రపంచకప్ కోసం టీమ్ కాంబినేషన్‍ను సెట్ చేసుకునేందుకు వామప్ మ్యాచ్‍లు ఉపయోగపడతాయని టీమిండియా ఆశించింది. అలాగే, మ్యాచ్ ప్రాక్టీస్‍గానూ ఉంటాయని అనుకుంది. ప్లేయర్ల మ్యాచ్ ఫిట్‍నెస్‍ తెలుకునేందుకు కూడా వామప్ పోటీలు ఉపయోగపడేవి. అయితే, భారత్ ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్‍లు వాన కారణంగానే రద్దయ్యాయి.

మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఇండియాలోనే వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‍తో వరల్డ్ కప్ వేటను టీమిండియా మొదలుపెట్టనుంది.

నేడు (అక్టోబర్ 3) పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా వామప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. అలాగే, గువహటిలో శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య మరో వామప్ పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో అఫ్గాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది.

వన్డే ప్రపంచకప్‍ తొలి మ్యాచ్‍లో అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈసారి ప్రపంచకప్‍కు ఓపెనింగ్ సెర్మనీ జరగడం లేదు.

Whats_app_banner