India vs England Semifinal: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇండియాను గెలిపించేది ఈ మూడు అంశాలే..-india vs england semifinal these 3 things will decide the winner of t20 world cup 2024 second semifinal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Semifinal: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇండియాను గెలిపించేది ఈ మూడు అంశాలే..

India vs England Semifinal: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇండియాను గెలిపించేది ఈ మూడు అంశాలే..

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 02:58 PM IST

India vs England Semifinal: ఇంగ్లండ్ తో టీ20 వరల్డ్ కప్ 2024 రెండో సెమీఫైనల్ కోసం టీమిండియా సిద్ధమైంది. 2022 వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న టీమిండియాకు ఈ మూడు అంశాలు కీలకం కానున్నాయి.

ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇండియాను గెలిపించేది ఈ మూడు అంశాలే..
ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో ఇండియాను గెలిపించేది ఈ మూడు అంశాలే..

India vs England Semifinal: టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్ చేరింది. ఇక రెండో బెర్త్ కోసం ఇండియా, ఇంగ్లండ్ తలపడబోతున్నాయి. రెండేళ్ల కిందట ఇదే ఇంగ్లండ్ చేతుల్లో సెమీఫైనల్లో పది వికెట్లతో ఓడిన ఇండియన్ టీమ్.. ఈసారి ప్రతీకారం కోసం తహతహలాడుతోంది. అయితే అది జరగాలంటే ఈ మూడు అంశాలు కీలకం కానున్నాయి.

ఓపెనర్లు ఏం చేస్తారో?

టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనింగ్ జోడీ అద్బుతాలు చేస్తుందనుకుంటే తుస్సుమనిపించింది. రెండు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలతో రోహిత్ ఫర్వాలేదనిపించినా.. కోహ్లి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఈ ఇద్దరూ కీలకమైన ఈ మ్యాచ్ లో ఏం చేస్తారో చూడాలి. 2022 వరల్డ్ కప్ లోనూ ఓపెనర్లు విఫలమవడంతో తర్వాత ఇండియన్ టీమ్ కోలుకోలేకపోయింది.

అదే సమయంలో ఇంగ్లండ్ తరఫున మాత్రం ఈ వరల్డ్ కప్ లో జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ జోడీ మంచి ఆరంభాలను ఇస్తోంది. ఇద్దరూ మెరుపు వేగంతో పరుగులు సాధించే బ్యాటర్లే. వీళ్లు సెమీఫైనల్లోనూ చెలరేగితే మాత్రం ఇండియన్ టీమ్ కు కష్టమే. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బౌలర్లపై ఉంది.

రషీద్‌కు చెక్ పెడతారా?

ఇంగ్లండ్ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి ముఖ్యమైన కారణం స్పిన్నర్ ఆదిల్ రషీద్. అతడు ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకూ 113 మ్యాచ్ లలో 119 వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ తో కలిసి 9 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో మన బ్యాటర్లు అతన్ని ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్నదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

పవర్ ప్లేలో ఇండియాకు మంచి ఆరంభం లభిస్తే.. మిడిల్ ఓవర్లలో రషీద్ పని పట్టడానికి మూడో స్థానంలో వచ్చే రిషబ్ పంత్ ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో వాళ్ల లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను అలాగే డామినేట్ చేశారు. ఇప్పుడు రషీద్ ను కూడా అలాగే ఆడగలిగితే.. ఇండియాకు విజయావకాశాలు ఉంటాయి.

బుమ్రా వర్సెస్ బట్లర్

ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ టీ20 బౌలర్, బ్యాటర్ మధ్య సమరంగా దీనిని చెప్పవచ్చు. బుమ్రా, బట్లర్ మధ్య జరగబోయే వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి నెలకొంది. బట్లర్ ను తన ఎత్తుగడలతో బోల్తా కొట్టించే సామర్థ్యం బుమ్రాకు ఉంది. ఈ వరల్డ్ కప్ లో ఇండియా తరఫున అతడు అదే పని చేస్తున్నాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు తీస్తూ గెలిపిస్తున్నాడు.

చివరిసారి వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆడినప్పుడు బుమ్రా జట్టులో లేడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లలోనే చేజ్ చేసేశారు. కానీ ఈసారి టాప్ ఫామ్ లో ఉన్న బుమ్రా రూపంలో ఆ జట్టుకు సవాలు తప్పదు. టోర్నీ అంతా నిలకడగా రాణించిన బుమ్రా.. ఈ కీలకమైన మ్యాచ్ లోనూ గెలిపించి ఫైనల్ చేరుస్తాడేమో చూడాలి.

WhatsApp channel