India vs Bangladesh Scorecard: దంచికొట్టిన విరాట్ కోహ్లి.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
India vs Bangladesh Scorecard: విరాట్ కోహ్లి దంచికొట్టాడు. వన్డేల్లో 48వ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. వరల్డ్ కప్ 2023లో వరుసగా నాలుగో విజయం సాధించింది.
India vs Bangladesh Scorecard: విరాట్ కోహ్లి వన్డేల్లో 48వ సెంచరీ చేయడంతో వరల్డ్ కప్ 2023లో ఇండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ను ఇండియా చిత్తు చేసింది. 257 పరుగుల లక్ష్యాన్ని మరో 51 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. కోహ్లి సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. వరల్డ్ కప్ లలో చేజింగ్ లో కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
విరాట్ కోహ్లి చివరికి 97 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లి సెంచరీ కోసం చివర్లో సింగిల్స్ తీసుకోవడానికి కూడా కేఎల్ రాహుల్ నిరాకరించడం అభిమానుల మనసులు గెలుచుకుంది. విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో కోహ్లి సెంచరీకి 20 పరుగుల దూరంలో ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి స్ట్రైక్ మొత్తం కోహ్లికే ఇచ్చాడు రాహుల్.
విజయానికి 2 పరుగులు అవసరమైన వేళ 41వ ఓవర్ మూడో బంతికి సిక్స్ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు మ్యాచ్ కూడా ముగించాడు విరాట్ కోహ్లి. వన్డేల్లో అతనికిది 48వ సెంచరీ. సచిన్ 49 సెంచరీలకు అడుగు దూరంలో ఉన్నాడు. రాహుల్ 34 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ 53, రోహిత్ శర్మ 48 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం 19 పరుగులే చేసి నిరాశ పరిచాడు.
వరుసగా నాలుగో విజయం సాధించిన ఇండియా ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో నాలుగోస్థానంలో ఉంది. న్యూజిలాండ్ కంటే నెట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉండటంతో ఇండియా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.923 నెట్ రన్ రేట్ తో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఇండియా కూడా 4 మ్యాచ్ లలో 8 పాయింట్లు, 1.659 నెట్ రన్ రేట్ తో రెండోస్థానంలో ఉంది.
అంతకుముందు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 రన్స్ చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ 66, మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 51 రన్స్ చేశారు. చివర్లో మహ్మదుల్లా 36 బాల్స్ లో 46 రన్స్ చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది.