Virat Kohli: ఒక్క బాల్.. 14 రన్స్.. విరాట్ కోహ్లి అరుదైన ఫీట్
Virat Kohli: ఒక్క బాల్.. 14 రన్స్.. విరాట్ కోహ్లి ఈ అరుదైన ఫీట్ సాధించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కోహ్లి క్రీజులోకి రాగానే రెండు నోబాల్స్ పడటంతో అత్యంత అరుదుగా జరిగే ఈ ఫీట్ సాధ్యమైంది.
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించాడు. ఒక్క బంతికే 14 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. హసన్ మహమూద్ వేసిన 13వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు. క్రీజులోకి రాగానే తొలి బంతికే అతడు రెండు పరుగులు చేశాడు. అయితే అది నోబాల్ గా తేలింది.
దీంతో విరాట్ కోహ్లికి ఓ ఫ్రీహిట్ దొరికింది. హసన్ వేసిన ఆ ఫ్రీ హిట్ ను కోహ్లి ఫోర్ కొట్టాడు. అంటే విరాట్ ఒక్క లీగల్ బాల్ ఆడకుండానే 6 రన్స్ చేశాడు. అయితే అది కూడా నోబాల్ అని తేలింది. తర్వాత మరో ఫ్రీ హిట్ లభించడంతో ఆ బాల్ ను కోహ్లి సిక్స్ గా మలిచాడు. దీంతో కోహ్లి తొలి బంతికే 12 పరుగులు చేసినట్లయింది. మరోవైపు టీమ్ కు మాత్రం ఒక బంతికే 14 పరుగులు వచ్చాయి.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్లకు 256 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ లిటన్ దాస్ 66 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలవగా.. తాంజిద్ హసన్ 51, మహ్మదుల్లా 46 రన్స్ చేశారు. ఇండియా బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఓపెనర్లు బాగా ఆడటంతో ఓ దశలో బంగ్లా భారీ స్కోరు చేసేలా కనిపించినా.. మిడిల్ ఓవర్లలో ఇండియా స్పిన్నర్లు బంగ్లాను కట్టడి చేశారు.
తర్వాత చేజింగ్ లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటమే ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. అతడు మూడు బంతులు వేసిన తర్వాత గాయపడటంతో మళ్లీ ఫీల్డింగ్ చేయలేదు. అతని గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.