IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్ 146కే ఆలౌట్.. కాన్పూర్‌లో టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Bangladesh AllOut: కాన్పూర్ టెస్టులోనూ బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా ముందు కేవలం 95 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే బంగ్లాదేశ్ నిలపగలిగింది.
India Target In Kanpur Test: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు ముందు కేవలం 95 పరుగుల లక్ష్యం నిలిచింది. మ్యాచ్‌లో ఆఖరి రోజైన మంగళవారం 26/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్ బౌలర్ల దెబ్బకి 146 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఆ జట్టులో ఓపెనర్ షదామన్ ఇస్లాం (50: 101 బంతుల్లో 10x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్‌కి ఒక వికెట్ దక్కింది.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 285/9తో డిక్లేర్ చేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దాంతో భారత్ జట్టుకి 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించి ఉండటంతో.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్ 146 పరుగులు చేసినా.. భారత్ ముందు కేవలం 95 పరుగులే నిలిచింది.
మ్యాచ్ ఇంకా ఒకటిన్నర సెషన్ ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా టాప్ ఆర్డర్ ఎంత త్వరగా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో చూడాలి. ఇప్పటికే తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులోనూ గెలిస్తే సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ నెం.1 స్థానాన్ని భారత్ జట్టు మరింత పదిలం చేసుకోనుంది.