IND vs BAN T20 Records: 15 ఏళ్ల నుంచి టీ20ల్లో భారత్‌ను ఢీకొంటున్న బంగ్లాదేశ్.. ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిచిందో తెలుసా?-india v bangladesh head to head record in t20is ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban T20 Records: 15 ఏళ్ల నుంచి టీ20ల్లో భారత్‌ను ఢీకొంటున్న బంగ్లాదేశ్.. ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిచిందో తెలుసా?

IND vs BAN T20 Records: 15 ఏళ్ల నుంచి టీ20ల్లో భారత్‌ను ఢీకొంటున్న బంగ్లాదేశ్.. ఎన్ని మ్యాచ్‌ల్లో గెలిచిందో తెలుసా?

Galeti Rajendra HT Telugu
Oct 06, 2024 05:49 AM IST

India vs Bangladesh 1st T20: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గత 15 ఏళ్లుగా టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కానీ ఈ దశాబ్దన్నర కాలంలో కొన్ని మ్యాచ్‌ల్లో భారత్‌కి గట్టి పోటీనిచ్చిన బంగ్లాదేశ్.. చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ?

బంగ్లాదేశ్‌తో తొలి టీ20 ముంగిట భారత్ ప్లేయర్లు కసరత్తు
బంగ్లాదేశ్‌తో తొలి టీ20 ముంగిట భారత్ ప్లేయర్లు కసరత్తు (PTI)

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం (అక్టోబరు 6) నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. మంచి జోరుమీదుంది. మరోవైపు ఊహించనిరీతిలో చెపాక్, కాన్పూర్ టెస్టులో ఓడిపోయిన బంగ్లాదేశ్.. కనీసం ఈ టీ20 సిరీస్‌లోనైనా సత్తాచాటి మళ్లీ సొంతగడ్డపైకి వెళ్లాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది.

మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఈరోజు తొలి మ్యాచ్‌కి గ్వాలియర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ నెల 9న ఢిల్లీ వేదికగా, 12న హైదరాబాద్ వేదికగా రెండు టీ20లు జరగనున్నాయి. ఈ టీ20 సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకి ప్రారంభమవుతాయి. టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబర్చినంత మాత్రాన బంగ్లాదేశ్ టీమ్‌ను తక్కవ అంచనా వేయడానికి వీల్లేదు.గతంలో కొన్ని సందర్భాల్లో భారత్ జట్టుకి చెమటలు పట్టించిన జట్టు ఇది.

బంగ్లాపై లాస్ట్ టీ20లో హీరోగా హార్దిక

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు 14 టీ20 మ్యాచ్‌‌లు జరిగాయి. ఇందులో భారత్ జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. చివరిగా ఈ రెండు జట్లు ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్-2024లో తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ టీమ్ ఛేదనలో 146/8కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో హార్దిక్ పాండ్య, 3 వికెట్లతో కుల్దీప్ యాదవ్ భారత్ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ.. ఈ టీ20 సిరీస్‌లో హార్దిక్ ఉన్నా.. కుల్దీప్ యాదవ్ లేడు.

ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్‌పై గెలుపు

బంగ్లాదేశ్ చేతిలో భారత్ జట్టు ఒకే ఒక మ్యాచ్‌లో అది కూడా 2019లో ఓడింది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ ఛేదించింది. ఆ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ అజేయంగా 60 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఈ సిరీస్‌లోనూ అతను టీమ్‌లో ఉన్నాడు.

ఓవరాల్‌గా 2009 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతుండగా.. టీమిండియాదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. కానీ.. పసికూన ముద్రని చెరిపేసుకుంటూ వస్తున్న బంగ్లాదేశ్ టీమ్.. తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలదు.

Whats_app_banner