IND vs AFG 2nd T20: కోహ్లీ రిటర్న్స్.. సిరీస్‍పై భారత్ కన్ను.. రెండో టీ20 టైమ్, లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలివే-ind vs afg india eyes series win against afghanistan virat kohli set to returns in t20 action ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Afg 2nd T20: కోహ్లీ రిటర్న్స్.. సిరీస్‍పై భారత్ కన్ను.. రెండో టీ20 టైమ్, లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలివే

IND vs AFG 2nd T20: కోహ్లీ రిటర్న్స్.. సిరీస్‍పై భారత్ కన్ను.. రెండో టీ20 టైమ్, లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 13, 2024 07:30 PM IST

IND vs AFG 2nd T20: అఫ్గానిస్థాన్‍తో రెండో టీ20కి భారత్ రెడీ అయింది. సిరీస్‍పై కన్నేసింది. ఈ మ్యాచ్‍తోనే చాలా గ్యాప్ తర్వాత టీమిండియా తరఫున టీ20ల్లో బరిలోకి దిగనున్నాడు విరాట్ కోహ్లీ.

అఫ్గానిస్థాన్‍తో రెండో టీ20 కోసం విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం
అఫ్గానిస్థాన్‍తో రెండో టీ20 కోసం విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం (PTI)

IND vs AFG 2nd T20: స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు కోహ్లీ. ఇప్పుడు మళ్లీ పొట్టి క్రికెట్‍లోకి అడుగుపెట్టనున్నాడు. భారత్ తరఫున సుమారు 14 నెలల తర్వాత టీ20 ఆడనున్నాడు విరాట్. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 ఆదివారం (జనవరి 14) ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‍లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ మూడు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచింది భారత్. రెండో టీ20లోనూ సత్తాచాటి ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.

అఫ్గానిస్థాన్‍తో మూడు టీ20ల సిరీస్‍కు ఎంపికైనా వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‍కు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‍తోనే 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పుడు, ఈ రెండో మ్యాచ్‍తో సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 ఆడనున్నాడు విరాట్.

ఈ ఏడాది జూన్‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్‍కు ముందు టీమిండియా ఆడే ఆఖరి అంతర్జాతీయ టీ20 సిరీస్ ఇదే. దీంతో అఫ్గానిస్థాన్‍తో ఈ సిరీస్‍ను భారత్ కీలకంగా భావిస్తోంది. తొలి మ్యాచ్‍లో యంగ్ ఆల్ రౌండర్ శివమ్ దాబే అజేయ అర్ధ శతకంతో అదరగొట్టడంతో భారత్ గెలిచింది. రెండో మ్యాచ్‍లోనూ విజయం సాధించి సిరీస్ పక్కా చేసుకోవాలని భావిస్తోంది. ఇలా అయితే, చివరి టీ20లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.

భారత్, అఫ్గానిస్థాన్ రెండో టీ20 టైమ్

టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 ఆదివారం (జనవరి 14) సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. అరగంట ముందు అంటే 6.30 గంటలకు టాస్ పడుతుంది. ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

లైవ్ వివరాలు

IND vs AFG 2nd T20 Live: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఈ రెండో టీ20 మ్యాచ్ స్పోర్ట్స్ 18 టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

భారత్ ఈ మార్పులు చేసే ఛాన్స్

విరాట్ కోహ్లీ వచ్చేయటంతో తిలక్ వర్మను రెండో టీ20కి టీమిండియా మేనేజ్‍మెంట్ పక్కన పెట్టే అవకాశం అధికం. యశస్వి జైస్వాల్ ఫిట్‍నెస్ సాధిస్తే.. గిల్ స్థానంలో అడతాడు. రవి బిష్ణోయ్ ప్లేస్‍లో కుల్‍దీప్ యాదవ్‍ను తీసుకోవచ్చు.

రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ / శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/ రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్ / అవేశ్ ఖాన్

అఫ్గానిస్థాన్ తుది జట్టు (అంచనా): రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్/ రహ్మత్ షా, ఇబ్రహీం జర్దాన్ (కెప్టెన్), అజ్మతల్లా ఒమర్‌జాయ్, మహమ్మద్ నబీ, నజ్మతుల్లా జర్దాన్, కరీమ్ జన్నత్, గుల్బాదిన్ నైబ్, ముజుబీర్ రహమాన్, నవీనుల్ హక్, ఫజల్‍హక్ ఫారూకీ

Whats_app_banner