India Beat Afghanistan: శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా-india beat afghanistan in first t20i shivam dube jitesh sharma rinku singh guided india to winning start in the series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Beat Afghanistan: శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

India Beat Afghanistan: శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

Hari Prasad S HT Telugu
Jan 11, 2024 10:13 PM IST

India Beat Afghanistan: శివమ్ దూబె హాఫ్ సెంచరీ.. జితేశ్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో తొలి టీ20లో ఆఫ్ఘనిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసింది.

హాఫ్ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబె
హాఫ్ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబె (AP)

India Beat Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తొలి టీ20లో ఇండియన్ టీమ్ సునాయాసంగా విజయం సాధించింది. శివమ్ దూబె టీ20ల్లో రెండో హాఫ్ సెంచరీ చేయడంతో 6 వికెట్లతో ఆప్ఘన్‌ను చిత్తు చేసింది. దూబెకు తోడు జితేశ్ శర్మ (31), తిలక్ వర్మ (26), శుభ్‌మన్ గిల్ (23) రాణించడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

శివమ్ దూబె కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. మరోవైపు రింకు సింగ్ కూడా 9 బంతుల్లో 16 రన్స్ చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యం సాధించింది. అంతకుముందు బౌలింగ్ లోనూ దూబె 2 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లో షాక్ తగిలింది. 14 నెలల తర్వాత తొలిసారి టీ20 జట్టులోకి తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో బంతికే రనౌటయ్యాడు. కవర్స్ దిశగా మంచి షాట్ ఆడిన రోహిత్ పరుగు కోసం వెళ్లాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్ డైవ్ చేసి బౌండరీ ఆపాడు. బంతినే చూస్తుండిపోయిన గిల్ స్పందించలేదు. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ చేరుకున్న రోహిత్ రనౌట్ కావడంతో గిల్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియన్ కు వెళ్లాడు.

రోహిత్ ఔటైన తర్వాత గిల్ జోరు పెంచాడు. వరుస బౌండరీలు బాదుతూ తన వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. 5 ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. ఈ క్రమంలో మరో భారీ షాట్ ఆడబోయి ముజీబుర్ బౌలింగ్ స్టంపౌటయ్యాడు. అతడు 12 బంతుల్లో 23 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా మంచి టచ్ లో కనిపించాడు. అతడు 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు. యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ 20 బంతుల్లోనే 31 రన్స్ చేసి ఔటయ్యాడు.

మహ్మద్ నబీ మెరుపులు

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 రన్స్ చేసింది. మొదట్లో ఆఫ్ఘన్ టీమ్ ను బాగానే కట్టడి చేసిన ఇండియన్ బౌలర్లు.. మిడిల్, డెత్ ఓవర్లలో కాస్త ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు.

తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 57 రన్స్ చేసిన ఆఫ్ఘనిస్థాన్.. చివరి 10 ఓవర్లలో ఏకంగా 101 రన్స్ రాబట్టడం విశేషం. మహ్మద్ నబీ 27 బంతుల్లో 42 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చివర్లో నజీబుల్ల జద్రాన్ 11 బంతుల్లో 19, కరీమ్ జనత్ 5 బంతుల్లో 9 రన్స్ చేయడంతో ఆఫ్ఘన్ టీమ్ ఓ మోస్తరు స్కోరు సాధించగలిగింది.

టాస్ గెలిచిన టీమిండియా.. మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొహాలీలో రాత్రిపూట మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉండటంతో రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఆఫ్ఘన్ ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ మంచి ఆరంభం ఇచ్చారు. 8 ఓవర్లలో 50 పరుగులు జోడించారు. ఈ సమయంలో గుర్బాజ్(23) ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.

ఆ వెంటనే శివమ్ దూబె కూడా ఇబ్రహీం జద్రాన్ (25)ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో 50 రన్స్ దగ్గరే రెండు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే రెహ్మత్ షా (3) కూడా ఔటవడంతో 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఒమర్జాయ్ తో జత కలిసిన మహ్మద్ నబీ ఆఫ్ఘన్ టీమ్ కు మంచి భాగస్వామ్యం అందించాడు.

ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 68 రన్స్ జోడించారు. భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న సమయంలో ఒమర్జాయ్ 22 బంతుల్లో 29 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే టాప్ ఫామ్ లో ఉన్న మహ్మద్ నబీ (27 బంతుల్లో 42) కూడా ఔటవడంతో ఆఫ్ఘన్ టీమ్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Whats_app_banner