ICC ODI Rankings: మళ్లీ నంబర్ వన్ ర్యాంక్‌పై కన్నేసిన విరాట్ కోహ్లి.. గిల్, బాబర్‌లకు దగ్గరగా..-icc odi rankings virat kohli moves closer to gill and babar eyes on number 1 again ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Odi Rankings: మళ్లీ నంబర్ వన్ ర్యాంక్‌పై కన్నేసిన విరాట్ కోహ్లి.. గిల్, బాబర్‌లకు దగ్గరగా..

ICC ODI Rankings: మళ్లీ నంబర్ వన్ ర్యాంక్‌పై కన్నేసిన విరాట్ కోహ్లి.. గిల్, బాబర్‌లకు దగ్గరగా..

Hari Prasad S HT Telugu

ICC ODI Rankings: వన్డేల్లో మరోసారి నంబర్ వన్ ర్యాంకుపై కన్నేశాడు విరాట్ కోహ్లి. ఐసీసీ తాజాగా బుధవారం (నవంబర్ 22) రిలీజ్ చేసిన ర్యాంకుల్లో గిల్, బాబర్ ఆజంలకు మరింత చేరువయ్యాడు.

విరాట్ కోహ్లి (Chennai Super Kings Twitter)

ICC ODI Rankings: విరాట్ కోహ్లి తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో మరోసారి నంబర్ వన్ అందుకోవడానికి చేరువవుతున్నాడు. వరల్డ్ కప్ 2023లో 765 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన కోహ్లి.. తాజాగా బుధవారం (నవంబర్ 22) ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో తన మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

అంతేకాదు ర్యాంకుల్లో ప్రస్తుతం తన కంటే పైన ఉన్న శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజంలకు చేరువయ్యాడు. విరాట్ కోహ్లి మూడో ర్యాంక్ లోనే కొనసాగుతున్నా.. అతని రేటింగ్ పాయింట్స్ పెరిగాయి. పైగా టాప్ 2లో ఉన్న గిల్, బాబర్ ఈ మెగా టోర్నీలో పెద్దగా రాణించలేకపోయారు. గిల్ ఫర్వాలేదనిపించినా.. బాబర్ పూర్తిగా విఫలమయ్యాడు.

వన్డే ర్యాంకింగ్స్.. టాప్ 5 వీళ్లే..

తాజా ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. వరల్డ్ కప్ లో రాణించిన సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్.. ఐదో ర్యాంక్ తో తన వన్డే కెరీర్ ముగించాడు. తాజా ర్యాంకుల్లో 826 పాయింట్లతో శుభ్‌మన్ గిల్ తొలి ర్యాంకులో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ సందర్భంగానే గిల్ తొలిసారి టాప్ లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఇక రెండో స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 824 పాయింట్లతో ఉన్నాడు. విరాట్ కోహ్లి 791 పాయింట్లతో మూడో స్థానంలోకి, రోహిత్ 769 పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకొచ్చారు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 760 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓడిపోగానే అతడు ఈ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

2017 నుంచి 2021 మధ్య విరాట్ కోహ్లి ఏకంగా 1258 రోజుల పాటు వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగడం విశేషం. తర్వాత ఫామ్ కోల్పోవడంతో కోహ్లి స్థానంలోకి బాబర్ వచ్చాడు. ఇక ఈ మధ్యే అతడు తన స్థానాన్ని గిల్ కు కోల్పోయాడు.

బౌలర్ల ర్యాంకుల్లో ఆ ఇద్దరూ..

ఇక బౌలర్ల వన్డే ర్యాంకుల్లో మన టీమిండియా పేస్ ద్వయం మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి ఒక్కో ర్యాంకు కోల్పోయారు. తాజా ర్యాంకుల్లో మహ్మద్ సిరాజ్ ఒక స్థానం కోల్పోయి మూడో ర్యాంకులో ఉన్నాడు. సిరాజ్ 699 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉండగా.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 741 పాయింట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు.

వరల్డ్ కప్ లో అదరగొట్టిన మరో పేస్ బౌలర్ మహ్మద్ షమి ఒక ర్యాంకు దిగజారి 10వ స్థానంలో ఉన్నాడు. షమి 7 వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఏకంగా 24 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అందులో మూడుసార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.