IND vs BAN: హెడ్ కోచ్ గంభీర్ ఉంటే డల్స్ మూమెంట్స్ ఉండవ్, అతను ఎవరి మాట వినడన్న జడేజా-former indian cricketer ajay jadeja praises gautam gambhirs approach ahead of bangladesh tests ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban: హెడ్ కోచ్ గంభీర్ ఉంటే డల్స్ మూమెంట్స్ ఉండవ్, అతను ఎవరి మాట వినడన్న జడేజా

IND vs BAN: హెడ్ కోచ్ గంభీర్ ఉంటే డల్స్ మూమెంట్స్ ఉండవ్, అతను ఎవరి మాట వినడన్న జడేజా

Galeti Rajendra HT Telugu
Sep 15, 2024 12:23 PM IST

India vs Bangladesh Tests: భారత్, బంగ్లాదేశ్ మధ్య రానున్న గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్‌కి ఎదురవుతున్న మొదటి కఠిన పరీక్ష ఇది.

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (PTI)

IND vs BAN 1st Test: భారత్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ రూపంలో గౌతమ్ గంభీర్‌కి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే భారత క్రికెటర్లు చెన్నైకి చేరుకుని గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గౌతమ్ గంభీర్ వ్యూహాలు దూకుడుగా ఉంటాయని, ప్రత్యర్థికి ఆధిపత్యం చెలాయించే అవకాశం అస్సలు ఇవ్వడని భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా జోస్యం చెప్పాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ నెల 19న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

డల్ మూమెంట్స్ ఉండవ్

గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత్ జట్టు ఆటతీరు గురించి అడిగిన ప్రశ్నకు అజయ్ జడేజా సమాధానమిస్తూ ‘‘గంభీర్ స్టయిల్ చాలా దూకుడుగా ఉంటుంది. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. అతని డైరెక్షన్‌లో డల్ మూమెంట్స్ ఉండవు. మ్యాచ్‌లో అతను ఎల్లప్పుడూ ఏదో ఒక మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరుపున 196 వన్డేలాడిన గంభీర్ 5,359 పరుగులు చేశాడు.

‘‘గంభీర్ ప్రశాంతంగా ఉండి పరిస్థితులను చక్కదిద్దే వ్యక్తి కాదు. అందర్నీ ఆశ్చర్యపరిచే పని చేయడానికి నిత్యం ప్రయత్నిస్తాడు. సూర్యకుమార్ యాదవ్ అకస్మాత్తుగా టీ20 కెప్టెన్ కావడం చూశాం కదా? బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అతను చేయబోయే సాహసం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు.

గంభీర్ సలహాలు తీసుకోడు

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముంగిట గంభీర్‌కు ఏదైనా సలహా ఇవ్వాలని అనుకుంటున్నారా? అని అజయ్ జడేజాని ప్రశ్నించగా అతను నవ్వుతూ.. ‘‘గంభీర్ ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నాడు. అతనికంటూ ఓ విజన్ ఉంది. కాబట్టే ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నాడు. వాస్తవానికి గౌతమ్ గంభీర్ సాధారణంగా ఎవరి సలహాలు తీసుకోడు. ఒకరి మాటల ఆధారంగా తన దృక్పథాన్ని అతను మార్చుకోడు. అతను ఏం నమ్ముతాడో దానికే కట్టుబడి ఉంటాడు’’ అని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు.

బంగ్లాదేశ్‌ టీమ్ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. ఇటీవల పాకిస్థాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. పాక్‌తో పోలిస్తే భారత్ జట్టు చాలా మెరుగైందని అజయ్ జడేజా చెప్పుకొచ్చాడు.

‘‘పాకిస్థాన్, భారత్ క్రికెట్ జట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టీమిండియా చాలా మెరుగైన జట్టు. బంగ్లాదేశ్ టీమ్ కోణం నుంచి చూస్తే పాకిస్థాన్‌ను ఓడించాం.. కాబట్టి భారత్‌ను కూడా ఓడించగలమని వాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ పాకిస్తాన్ కంటే భారత జట్టు చాలా మెరుగైందనే విషయం ఆ జట్టు మర్చిపోకూడదు’’ అని బంగ్లాదేశ్ టీమ్‌ను అజయ్ జడేజా హెచ్చరించాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ఎంపికైన భారత్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్‌), గిల్, యశస్వి జైస్వాల్, కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌).

Whats_app_banner