Zaheer Khan LSG: గౌతమ్ గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్.. లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు
Zaheer Khan LSG: గౌతమ్ గంభీర్ స్థానంలో జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంటార్ గా నియమితుడయ్యాడు. గత సీజన్ వరకు ఈ పదవిలో ఉన్న గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ కావడంతో అతని స్థానంలో ఇండియన్ టీమ్ మాజీ పేస్ బౌలర్ ను నియమిస్తున్నట్లు ఆ ఫ్రాంఛైజీ వెల్లడించింది.
Zaheer Khan LSG: జహీర్ ఖాన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కొత్త మెంటార్ గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ టీమ్ బుధవారం (ఆగస్ట్ 28) సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. గౌతమ్ గంభీర్ స్థానంలో అతన్ని నియమిస్తున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
రివర్స్ స్వింగ్ కింగ్ జహీర్
జహీర్ ఖాన్ తమ కొత్త మెంటార్ అనే విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు కోల్‌కతాలోని ఆర్పీఎస్‌జీ హెడ్‌క్వార్టర్స్ లో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో జహీర్ జెర్సీని కూడా లాంచ్ చేసింది. గత సీజన్ వరకూ ఈ పదవిలో ఉన్న గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ కావడంతో జహీర్ కు ఈ అవకాశం దక్కింది.
"మన ఎదురుచూపులు ఇక ముగిశాయి. కింగ్ ఆఫ్ రివర్స్ స్వింగ్, ఇండియన్ లెజెండ్ జహీర్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గా బాధ్యతలు తీసుకున్నాడు" అనే క్యాప్షన్ తో ఆ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని వెల్లడించింది. దానికి జోడించిన ఓ షార్ట్ వీడియోలో నేనొచ్చేశా అని జహీర్ చెప్పడం విశేషం.
అదే జెర్సీ నంబర్‌తో..
జహీర్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ అతని జెర్సీ నంబర్ తోనే గౌరవించింది. తన అంతర్జాతీయ కెరీర్, ఐపీఎల్ కెరీర్ మొత్తం జహీర్ 34వ నంబర్ జెర్సీతోనే ఆడాడు. దీంతో అతనికి మెంటార్ గానూ అదే నంబర్ కేటాయించడం విశేషం. గతంలో ఐదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న 45 ఏళ్ల జహీర్ రెండేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ కు తిరిగి వచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్ల పాటు గౌతమ్ గంభీర్ ఆ టీమ్ మెంటార్ గా ఉన్నాడు. ఈ ఏడాది అతడు కేకేఆర్ టీమ్ కు వెళ్లిపోగా.. అతని స్థానం ఖాళీగా ఉండిపోయింది. ఇప్పుడా స్థానాన్ని జహీర్ ఖాన్ భర్తీ చేయనున్నాడు. నిజానికి వాళ్ల బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా టీమిండియాకు వెళ్లిపోవడంతో ఆ స్థానం కూడా ఖాళీగానే ఉంది.
ఐపీఎల్లో జహీర్ ఇలా..
లక్నో సూపర్ జెయింట్స్ కంటే ముందు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ తరఫున డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్ పదవుల్లో పని చేశాడు. అంతకుముందు ప్లేయర్ గా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ఆడాడు. మొత్తం 10 సీజన్ల పాటు 100 మ్యాచ్ లు ఆడిన అతడు.. 102 వికెట్లు తీశాడు.
2017లో చివరిసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ లో జహీర్ మెంటార్ గా ఉండగా.. హెడ్ కోచ్ గా జస్టిన్ లాంగర్, అతని సహాయకులుగా లాన్స్ క్లూజ్‌నర్, ఆడమ్ వోజెస్ ఉన్నారు.