England Bazball: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను పక్కన పెడుతుందా.. కోచ్ మెకల్లమ్ ఏమన్నాడంటే?-england bazball coach brendon mccullum responds to whether team put aside bazball after series loss to team india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  England Bazball: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను పక్కన పెడుతుందా.. కోచ్ మెకల్లమ్ ఏమన్నాడంటే?

England Bazball: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను పక్కన పెడుతుందా.. కోచ్ మెకల్లమ్ ఏమన్నాడంటే?

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 08:30 AM IST

England Bazball: ఇంగ్లండ్ టీమ్ ఇక తమ బజ్‌బాల్ ను పక్కన పెడుతుందా? టీమిండియా చేతుల్లో వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి తర్వాత అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. దీనిపై తాజాగా ఆ టీమ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు.

ఇంగ్లండ్ బజ్‌బాల్ పక్కన పెడుతుందా అన్న ప్రశ్నపై స్పందించిన కోచ్ మెకల్లమ్
ఇంగ్లండ్ బజ్‌బాల్ పక్కన పెడుతుందా అన్న ప్రశ్నపై స్పందించిన కోచ్ మెకల్లమ్ (REUTERS)

England Bazball: బజ్‌బాల్ అంటూ ఇండియాలో అడుగుపెట్టి దారుణంగా దెబ్బ తిన్న ఇంగ్లండ్ టీమ్ ఇప్పుడు ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇండియాలాంటి దేశాల్లో బజ్‌బాల్ కుదరదు అని ముందు నుంచీ హెచ్చరిస్తున్నా.. ఆ టీమ్ వినలేదు. దీంతో కెప్టెన్ గా బెన్ స్టోక్స్, కోచ్ గా మెకల్లమ్ తమ తొలి సిరీస్ ఓటమి చవిచూశారు. దీనిపై తాజాగా మెకల్లమ్ స్పందించాడు.

బజ్‌బాల్ పక్కన పెడతారా?

ఇంగ్లండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్, కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ వచ్చిన తర్వాత ఆ టీమ్ టెస్ట్ క్రికెట్ కు పరిచయం చేసిన సరికొత్త పేరు బజ్‌బాల్. సాంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ ను కూడా ధాటిగా ఆడటమే ఈ స్టైల్. మొదట్లో మంచి ఫలితాలనే ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ గతేడాది యాషెస్ సిరీస్ గెలవలేకపోవడం, ఇప్పుడు ఇండియాతో సిరీస్ ఓడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో ఇప్పటికైనా ఈ బజ్‌బాల్ ను ఇంగ్లండ్ ను పక్కన పెడుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై తాజాగా కోచ్ మెకల్లమ్ స్పందించాడు. ఇంగ్లిష్ మీడియాతో అతడు మాట్లాడాడు. "మ్యాచ్ లలో మా పద్ధతిని కొన్ని సందర్భాల్లో పూర్తిగా అమలు చేయలేకపోయాం. ఇక్కడ ఓడిపోయాం. యాషెస్ గెలవలేకపోయాం. కానీ 18 నెలల కిందటితో పోలిస్తే మేము మెరుగైన జట్టే. వచ్చే 18 నెలల్లోనూ మాకు అవకాశాలు వస్తాయి. ఈ కఠిన సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇంగ్లండ్ జట్టుకు కోచ్ గా ఉండటానికి ఇది మరీ అంత బ్యాడ్ టైమ్ ఏమీ కాదు" అని మెకల్లమ్ అన్నాడు.

బజ్‌బాల్‌కు టీమిండియా చెక్

2022లో మెకల్లమ్ కోచ్ గా వచ్చాడు. అప్పటి నుంచి ఇంగ్లండ్ ఆటతీరు మారిపోయింది. అదే సమయంలో బెన్ స్టోక్స్ కూడా కెప్టెన్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో టీమ్ లో దూకుడు పెరిగింది. అప్పుడే బజ్‌బాల్ మొదలైంది. 18 మ్యాచ్ లలో ఇంగ్లండ్ 13 గెలిచి, 4 ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ స్టైల్ రాకముందు ఇంగ్లండ్ 17 టెస్టుల్లో 11 ఓడిపోయి, ఒక్కటే గెలిచి, ఐదు డ్రా చేసుకుంది. దీంతో ఓవరాల్ గా చూస్తే ఇవి చాలా మంచి ఫలితాలే.

కానీ ఈ బజ్‌బాల్ మోజులో పడి ఆ టీమ్ రెండు సిరీస్ లను చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ను 2-2తో డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఇండియా చేతుల్లో హ్యాట్రిక్ ఓటములతో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. దీంతో బజ్‌బాల్ పై మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. ఇండియాలోని స్పిన్ పిచ్ లపై బజ్‌బాల్ నడవదని అశ్విన్, సిరాజ్ లాంటి టీమిండియా ప్లేయర్స్ తోపాటు ఇంగ్లండ్ మాజీలు కూడా హెచ్చరించారు.

కానీ ఇంగ్లండ్ వినలేదు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే ఈ స్టైల్ ను కాస్త పక్కన పెట్టినట్లు కనిపించినా.. రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ కుప్పకూలింది. తొలి టెస్టులోనే గెలిచి ఊపు మీద కనిపించినా.. తర్వాత వాళ్ల ఆధిపత్యం ఎంతోకాలం నిలవలేదు. ఇప్పటికీ కోచ్ మెకల్లమ్ తగ్గేదే లేదు అంటున్నాడు. మరి బజ్‌బాల్ నుంచి ఇంగ్లండ్ ఎప్పటికి పాఠాలు నేర్చుకుంటుందో చూడాలి.