Asian Games cricket: ఇండియా, అఫ్గానిస్థాన్ మధ్య ‘గోల్డ్’ ఫైనల్.. సెమీస్‍లో అఫ్గాన్ చేతిలో ఓడిన పాక్-cricket news afghanistan beat pakistan in asian games mens cricket final will clash india in final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asian Games Cricket: ఇండియా, అఫ్గానిస్థాన్ మధ్య ‘గోల్డ్’ ఫైనల్.. సెమీస్‍లో అఫ్గాన్ చేతిలో ఓడిన పాక్

Asian Games cricket: ఇండియా, అఫ్గానిస్థాన్ మధ్య ‘గోల్డ్’ ఫైనల్.. సెమీస్‍లో అఫ్గాన్ చేతిలో ఓడిన పాక్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 06, 2023 03:36 PM IST

Asian Games cricket: ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్‍లో పాకిస్థాన్‍పై అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. దీంతో స్వర్ణ పతకం కోసం ఫైనల్‍‍లో ఇండియా, అఫ్గాన్ తలపడనున్నాయి.

Asian Games cricket: సెమీస్‍లో అఫ్గాన్ చేతిలో ఓడిన పాక్
Asian Games cricket: సెమీస్‍లో అఫ్గాన్ చేతిలో ఓడిన పాక్ (AFP)

Asian Games Cricket: ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‍లో పాకిస్థాన్‍కు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. సెమీ ఫైనల్‍లో పాక్‍పై అఫ్గాన్ ఘన విజయం సాధించి.. ఫైనల్‍లో అడుగుపెట్టింది. నేడు (అక్టోబర్ 6) చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ సెమీస్‍లో అఫ్గాన్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‍పై విజయం సాధించింది. దీంతో ఫైనల్‍లో గోల్డ్ మెడల్ కోసం భారత్‍తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ఈ సెమీస్ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఓమైర్ యూసఫ్ (24), చివర్లో అమీర్ జమాల్ (14) మినహా మిగిలిన పాక్ బ్యాటర్లందరూ విఫమలయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు, ఖాయిస్ అహ్మద్, జహీర్ ఖాన్ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది అఫ్గానిస్థాన్. 17.5 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి అప్గాన్ విజయం సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లు నూర్ అలీ జర్దాన్ (39), గుల్బాదిన్ నైబ్ (26 నాటౌట్) రాణించారు. నేడే జరిగిన మరో సెమీస్‍లో బంగ్లాదేశ్‍పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‍లో స్వర్ణ పతకం కోసం భారత్, అఫ్గానిస్థాన్‍ శనివారం (అక్టోబర్ 7) ఫైనల్‍లో తలపడనున్నాయి. అప్గాన్, పాక్ సెమీస్ ఎలా జరిగిందంటే..

పాక్ టపటపా..

అఫ్గానిస్థాన్‍తో ఏషియన్ గేమ్స్ సెమీస్‍లో టాస్ ఓడిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‍కు దిగింది. అయితే, అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం పాక్ బ్యాటర్లు ఏ దశలోనూ దూకుడుగా ఆడలేకపోయారు. ఓపెనర్ ఓమైర్ యూసుఫ్ (24) ఒక్కడే కాస్త దీటుగా ఆడాడు. ఆ తర్వాత మీర్జా బేగ్ (4), రొహాలీ నజీర్ (10), హైదర్ అలీ (2), ఖాసిమ్ అక్రమ్ (9) సహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పట్టుమని 20 రన్స్ కూడా చేయలేకపోయారు. చివర్లో అరాఫత్ మిన్హాస్ (13), అమీర్ జమాల్ (14) నిలకడగా ఆడడంతో పాకిస్థాన్ కనీసం 115 పరుగులైనా చేయగలిగింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ మూడు, ఖాయిస్, జహీర్ చెరో రెండు, కరీమ్ జన్నత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ పడగొట్టారు.

రాణించిన నూర్, నైబ్

స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ కూడా ఓ దశలో తడబడింది. ఓపెనర్లు షెదీఖల్ అటల్ (5), మహమ్మద్ షెహజాద్ (9)తో పాటు షహీదుల్లా (0) విఫలమయ్యారు. అయితే, మరో ఎండ్‍లో నూల్ అలీ జర్దాన్ (39) అదరగొట్టాడు. వేగంగా ఆడాడు. ఆ తర్వాత అఫ్సర్ జజాయ్ (13), జర్దాన్, కరీమ్ జన్నత్ (3) వెనువెంటనే ఔటవటంతో టెన్షన్ రేగింది. అయితే చివర్లో కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ (26 నాటౌట్) అదరగొట్టి.. అఫ్గానిస్థాన్‍ను గెలిపించాడు. పాక్ బౌలర్లలో అరాఫత్ మిన్హాస్, ఉస్మాన్ ఖాదిర్ చెరో రెండు వికెట్లు తీశారు.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఏషియన్ గేమ్స్ పురుషుల ఫైనల్ రేపు (అక్టోబర్ 7) జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టుకు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడిన టీమ్‍కు రజతం వస్తుంది. ఇక, కాంస్యం కోసం బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య రేపే ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా జరగనుంది.

Whats_app_banner