India vs Bangladesh Asian Games: బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా కొట్టిన టీమిండియా.. ఏషియన్ గేమ్స్‌లో మెడల్ ఖాయం
India vs Bangladesh Asian Games: బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా కొట్టేంది టీమిండియా. ఏషియన్ గేమ్స్‌లో మెడల్ ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో 9 వికెట్లతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
India vs Bangladesh Asian Games: ఏషియన్ గేమ్స్ క్రికెట్ లో టీమిండియా మెడల్ ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ తో శుక్రవారం (అక్టోబర్ 6) జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్లతో విజయం సాధించింది. 97 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేజ్ చేసింది. తిలక్ వర్మ కేవలం 26 బంతుల్లోనే 6 సిక్స్ లు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 40 రన్స్ చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరూ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్ల మోత మోగించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌటైనా కూడా తర్వాత ఈ ఇద్దరూ మరో అవకాశం ఇవ్వలేదు. శనివారం (అక్టోబర్ 7) జరగబోయే ఫైనల్లో ఇండియా.. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్ విజేతతో తలపడుతుంది.
సెమీస్ లో విజయంతో మెడల్ ఖాయమైంది. అయితే అది గోల్డ్ మెడలా లేక సిల్వర్ మెడలా అన్నది శనివారం తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ టీమ్ బ్రాంజ్ మెడల్ కోసం రెండో సెమీఫైనల్లో ఓడిన టీమ్ తో తలపడుతుంది.
స్పిన్ ధాటికి కుదేలు
బంగ్లాదేశ్ ను 96 పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. స్పిన్నర్లు సాయి కిశోర్, వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో బంగ్లా టీమ్ కుదేలైంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 రన్స్ మాత్రమే చేసింది. సాయి కిశోర్ 3, సుందర్ 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, తిలక్ వర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్ టీమ్. పిచ్ అంతగా బ్యాటింగ్ కు సహకరించకపోవడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఐదో ఓవర్లో 18 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. మళ్లీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 21 పరుగుల దగ్గర వరుసగా రెండు వికెట్లు పడటంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది.
ఆ తర్వాత 36, 45, 58, 65, 81, 96 పరుగుల దగ్గర వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు బంగ్లా టీమ్ ను కట్టడి చేశారు. సాయి కిశోర్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తిలక్ వర్మ 2 ఓవర్లలో కేవలం 5 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ జాకర్ అలీ మాత్రమే 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ 23 రన్స్ చేశాడు. ఏషియన్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్లో నేపాల్ పై కాస్త కష్టమ్మీద గెలిచిన ఇండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్లో అడుగుపెడుతుంది. అప్పుడు కనీసం సిల్వర్ మెడల్ ఖాయమవుతుంది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తలపడనున్నాయి.