World Cup 2023: ‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్’ను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రోహిత్‍కు నో ప్లేస్.. కోహ్లీకి కెప్టెన్సీ
World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వివిధ జట్లు ఆటగాళ్లతో ‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్’ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే, అనూహ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ఇందులో లేదు.
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ లీగ్ దశ మ్యాచ్‍లు ముగిశాయి. తొమ్మిది మ్యాచ్‍ల్లో తొమ్మిది గెలిచిన టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ చేరుకున్నాయి. నవంబర్ 15న తొలి సెమీఫైనల్‍లో ముంబై వేదికగా న్యూజిలాండ్‍తో భారత్ తలపడనుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ నవంబర్ 16న కోల్‍కతాలో జరుగుతుంది. సెమీస్‍లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్‍లో టైటిల్ కోసం ఢీకొననున్నాయి. అయితే, ప్రపంచకప్ లీగ్ దశ ముగిసిన తరుణంలో ‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్-2023’ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు అదరగొట్టిన వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లతో ఈ బెస్ట్ టీమ్‍ను ఎంపిక చేసింది. ఆ వివరాలివే..
‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్’ కోసం టువల్త్ మెన్‍ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఈ టీమ్‍లో టీమిండియా నుంచి నలుగురు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి చెరో ముగ్గురు, శ్రీలంక, న్యూజిలాండ్ నుంచి చెరో ఆటగాడికి ప్లేస్ ఇచ్చింది.
ఈ ప్రపంచకప్‍లో అద్భుత హిట్టింగ్‍తో పాటు కెప్టెన్సీతోనూ అదరగొడుతున్న భారత స్టార్ రోహిత్ శర్మను క్రికెట్ ఆస్ట్రేలియా విస్మరించింది. బెస్ట్ టీమ్‍లో అతడి పేరును చేర్చలేదు. 9 మ్యాచ్‍ల్లో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలతో 503 పరుగులు చేసి హిట్‍మ్యాన్ అదరగొట్టాడు.
‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్’కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‍గా ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు 594 పన్స్ చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల (49) రికార్డును కూడా ఇదే టోర్నీలో విరాట్ కోహ్లీ సమం చేశాడు. దీంతో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీని బెస్ట్ టీమ్‍కు కెప్టెన్‍గా క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ఈ ప్రపంచకప్‍లో బౌలింగ్‍తో అదరగొడున్న భారత బౌలర్లు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాకు కూడా ‘టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్’లో చోటిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే, కేఎల్ రాహుల్‍కు ప్లేస్ ఇవ్వలేదు. బ్యాటింగ్‍లో దుమ్మురేపిన దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ యవ స్టార్ రచిన్ రవీంద్రకు కూడా ఈ బెస్ట్ టీమ్‍లో చోటిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టీమ్ ఆఫ్ ది వరల్డ్ కప్ 2023: క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), విరాట్ కోహ్లీ (భారత్ - కెప్టెన్), ఐడెన్ మార్క్‌రమ్(దక్షిణాఫ్రికా), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), మార్కో జాన్సెన్(దక్షిణాఫ్రికా), రవీంద్ర జడేజా (భారత్), మహమ్మద్ షమీ(భారత్), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జస్‍ప్రీత్ బుమ్రా (భారత్), దిల్షాన్ మధుశంక (టువెల్త్ మ్యాన్ - శ్రీలంక)