PAK vs ENG 1st Test Highlights: పాకిస్థాన్‌కి శాపంగా మారిన బాబర్ తప్పిదం, పండగ చేసుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్
Babar Azam Trolls: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన తప్పిదం కారణంగా ఇంగ్లాండ్ బ్యాటర్లకి పాక్ బౌలర్లు బలైపోయారు. చేతుల్లో పడిన క్యాచ్‌ని వదిలేసి బాబర్ అజామ్ బిత్తర చూపులు చూశాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే ఫామ్ కోసం గత కొన్ని నెలల నుంచి తంటాలు పడుతున్న బాబర్ అజామ్.. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పెద్ద తప్పిదం చేశాడు. చివరికి ఆ తప్పిదం పాకిస్థాన్ టీమ్‌కి పెద్ద శాపంగా మారిపోయింది.
బ్యాటింగ్‌కి స్వర్గధామంగా ఉన్న ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెప్టెన్ జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) భారీ స్కోర్లు నమోదు చేసి రికార్డుల మోత మోగించేశారు. తొలుత జో రూట్ డబుల్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ సాధించి పాక్ బౌలర్లని ఉతికారేశాడు.
వాస్తవానికి జో రూట్ డబుల్ సెంచరీకి ముందు బాబర్ అజామ్‌కి సింపుల్‌గా క్యాచ్ ఇచ్చాడు. కానీ.. తత్తరపాటులో బాబర్ ఆ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఒకవేళ ఆ సమయంలో రూట్ వికెట్ పడి ఉంటే.. ఇంగ్లాండ్ టీమ్ జోరుకి కళ్లెం పడేది. కానీ.. లైఫ్ తర్వాత జోరూట్ రెచ్చిపోగా.. బ్రూక్ కూడా గేర్ మార్చాడు. చివరికి ఇంగ్లాండ్ టీమ్ 823/7తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
జో రూట్ 186 పరుగుల వద్ద ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ.. షాట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో మిడిల్ వికెట్‌లోని బాబర్ ఆజమ్ చేతుల్లోకి బంతి వెళ్లింది. నిజానికి అది సులువుగా అందుకోవాల్సిన క్యాచ్. కానీ.. బాబర్ అజామ్ చేతుల్లో బంతి పడినా ఒడిసి పట్టుకోవడంలో విఫలమై నేలపాలు చేశాడు. దాంతో మైదానంలోనే నసీమ్ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సింపుల్ క్యాచ్ వదిలిన బాబర్ అజామ్‌ను సోషల్ మీడియాలో పాకిస్థాన్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. 'బ్యాటింగ్ లేదు, ఫీల్డింగ్ లేదు, సిగ్గు లేదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. టీమ్‌కి భారంగా మారిన బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
లైఫ్ తర్వాత జో రూట్ 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్ నిలిచాడు. మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను కూడా అధిగమించాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ లో 20 వేల పరుగుల మైలురాయిని కూడా జో రూట్ అందుకున్నాడు. రూట్ కెరీర్‌లో రూట్‌కి ఇది ఆరో డబుల్ సెంచరీ కాగా, ఇంగ్లాండ్ నుంచి టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
ముల్తాన్ టెస్టులో శుక్రవారం ఆఖరి రోజుకాగా.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 152/6తో పోరాడుతోంది. ఇంకా ఆ జట్టు 115 పరుగులు వెనకబడి ఉంది. దాంతో పాక్ ఓటమిని తప్పించుకోవాలంటే ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. కానీ.. అది సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. క్రీజులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ లేదరు. బౌలర్లు సల్మాన్ (41 బ్యాటింగ్), జమాల్ (27) మాత్రమే ఉన్నారు.