Australia vs South Africa: ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు? ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండో సెమీఫైనల్ ఇవాళే
Australia vs South Africa: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో గురువారం (నవంబర్ 16) తేలిపోనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో సెమీఫైనల్ జరగనుంది.
Australia vs South Africa: వరల్డ్ కప్ 2023లో ఫైనల్ చేరిన తొలి టీమ్ గా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైనల్లో రోహిత్ సేన ఎవరితో తలపడనుందో మరికొన్ని గంటల్లో తేలబోతోంది. లీగ్ స్టేజ్ పాయింట్ల టేబుల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో సెమీఫైనల్ జరగనుంది.
వరల్డ్ కప్ లలో నాకౌట్ ఫోబియాను సౌతాఫ్రికా అధిగమిస్తుందా? తొలిసారి ఫైనల్ చేరుతుందా? ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? మరోసారి ఫైనల్ చేరి ఇండియాతో ఫైట్ కు సిద్ధమవుతుందా? రెండో సెమీఫైనల్ ముందు ఈ ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. ఈ ఇద్దరూ తలపడబోతుంటే.. క్రికెట్ అభిమానులు మరోసారి 1999, 2007 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ను గుర్తు చేసుకుంటున్నారు.
సౌతాఫ్రికా సెమీస్ గండం గట్టెక్కుతుందా?
20 ఏళ్ల నిషేధం తర్వాత తొలిసారి 1992 వరల్డ్ కప్ లోనే ఆడిన సౌతాఫ్రికా ఏకంగా సెమీఫైనల్ చేరింది. అయితే అక్కడ వర్షం వాళ్ల కొంప ముంచింది. ఒక దశలో 13 బంతుల్లో 22 రన్స్ అవసరం అయిన సమయంలో వర్షం కురిసింది. తిరిగి మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి నిబంధనల ప్రకారం సౌతాఫ్రికా ఒకే బంతిలో 21 రన్స్ చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత 1996లో క్వార్టర్ ఫైనల్లోనే వెస్టిండీస్ చేతుల్లో ఓడింది. 2011లో మరోసారి క్వార్టర్స్ లోనే వెనుదిరగగా.. 2015లో సెమీఫైనల్లో ఓడింది. 1999 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ టై కావడం, లీగ్ స్టేజ్ లో సఫారీలను చిత్తు చేసిన కంగారూలు ఫైనల్ చేరడం ఎవరూ అంత త్వరగా మరచిపోరు. 2007 సెమీఫైనల్లోనూ అదే రిపీటైంది. నాకౌట్స్ లో ఓటములతో చోకర్స్ అనే పేరు సంపాదించిన సౌతాఫ్రికా.. ఈసారి సెమీఫైనల్లో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈసారి పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి అనూహ్య విజయాలతో సెమీస్ చేరింది. లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియాను కూడా చిత్తు చేసింది. అదే ఊపు కొనసాగించి ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరాలన్న పట్టుదలతో ఆ టీమ్ ఉంది.
ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుందా?
ఇప్పటికే సెమీఫైనల్స్ లో తమతో ఫైట్ ఎలా ఉంటుందో సౌతాఫ్రికాకు రెండుసార్లు రుచి చూపించింది ఆస్ట్రేలియా. నాకౌట్ గేమ్స్ లో ఆ టీమ్ స్పీడు అడ్డుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పటికే ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన కంగారూలు.. మూడోసారీ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ చేరాలని చూస్తోంది. మొదట్లోనే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడితే ఇక వాళ్ల పనైపోయిందని అనుకున్నారు.
కానీ వరుసగా ఏడు విజయాలతో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. వార్నర్, మార్ష్, మ్యాక్స్‌వెల్ లతో కూడిన బ్యాటింగ్.. హేజిల్‌వుడ్, జంపాలతో కూడిన బౌలింగ్ ఈ సెమీఫైనల్ కూ ఆస్ట్రేలియాను ఫేవరెట్ గా మార్చింది. మరి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలలో ఇండియాతో ఫైనల్లో తలపడేది ఎవరు? ఇది మరికొన్ని గంటల్లోనే తేలనుంది.