India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు భారత్.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలుపు-india vs new zealand world cup 2023 semi final live score updates ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు భారత్.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలుపు

India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు భారత్.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2023 11:10 PM IST

India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లో టీమిండియా సత్తాచాటింది. న్యూజిలాండ్‍ను చిత్తు చేసింది భారత్. దీంతో ప్రపంచకప్ ఫైనల్‍కు చేరుకుంది. టైటిల్‍కు ఒక్క అడుగు దూరంలో ఉంది. వివరాలు ఇక్కడ చూడండి.

India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు భారత్.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలుపు
India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ ఫైనల్‍కు భారత్.. సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలుపు (ANI)

India vs New Zealand World Cup 2023 Highlights: వన్డే ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో టీమిండియా జోరు కొనసాగించింది. న్యూజిలాండ్‍పై సెమీస్‍లో గెలిచిన భారత్.. వరల్డ్ కప్ ఫైనల్‍కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు (నవంబర్ 15) జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‍లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‍పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‍ను 48.5 ఓవర్లలో 327 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్‍పై 2019 పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అలాగే, సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍కు చేరి టైటిల్‍కు ఒక్క అడుగుదూరంలో ఉంది టీమిండియా. ఈ మ్యాచ్ అప్‍డేట్లు, హైలైట్లు ఇక్కడ చూడండి.

India vs New Zealand World Cup 2023 Semi Final Live Score

11.00 PM: India vs New Zealand Live Score: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍కు భారత్ చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ కోల్‍కతా వేదికగా గురువారం (నవంబర్ 16) జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ తుదిపోరులో గెలిచి.. 12ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంటుందని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

10.29 PM: India vs New Zealand Live Score: ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‍పై 70 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. భారత పేసర్ మహమ్మద్ షమీ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. లూకీ ఫెర్గ్యూసన్ (9)ను ఔట్ చేసి ఏడో వికెట్ దక్కించుకున్నాడు షమీ. దీంతో 48.5 ఓవర్లలో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది.

10.24 PM: India vs New Zealand Live Score: భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరో వికెట్ కైవసం చేసుకున్నాడు. టిమ్ సౌథీ (9)ని షమీ ఔట్ చేశాడు. 321 పరుగుల వద్ద కివీస్ 9 వికెట్ డౌన్ అయింది. గెలుపుకు ఒక వికెట్ దూరంలో భారత్ ఉంది.

10.23 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ (8)ను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 47.5 ఓవర్లలో 319 పరుగుల వద్ద 8 వికెట్ చేజార్చుకొని.. ఓటమికి సమీపించింది కివీస్.

10.20 PM: India vs New Zealand Live Score: 47 ఓవర్లలో 7 వికెట్లకు 313 పరుగులు చేసింది న్యూజిలాండ్. సాంట్నర్ (7 నాటౌట్), సౌథీ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. గెలుపు ముంగిట భారత్ ఉంది.

10.10 PM: India vs New Zealand Live Score: భారత బౌలర్ మహమ్మద్ షమీ ఈ మ్యాచ్‍లో ఐదో వికెట్ తీసుకున్నాడు. ఒంటరి పోరాటం చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ డారెల్ మిచెల్ (134)ను షమీ ఔట్ చేశాడు. దీంతో 45.2 ఓవర్లలో 306 రన్స్ వద్ద ఏడో వికెట్ కోల్పోయింది కివీస్. గెలుపునకు భారత్ సమీపించింది.

10.04 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. మార్క్ చాంప్‍మ్యాన్ (2)ను భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దీంతో 43.5 ఓవర్లలో 299 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది కివీస్.

9.55 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ (41)ను భారత బౌలర్ బుమ్రా ఔట్ చేశాడు. బౌండరీ వద్ద జడేజా మంచి క్యాచ్ పట్టాడు. దీంతో 42.5 ఓవర్లలో 295 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది కివీస్.

9.45 PM: India vs New Zealand Live Score: 41 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్లకు 286 రన్స్ చేసింది. డారిల్ మిచెల్ (127 నాటౌట్), గ్లెన్ ఫిలిప్ (36 నాటౌట్) క్రీజులో ఉన్నారు. గెలవాలంటే 54 బంతుల్లో 112 రన్స్ చేయాలి కివీస్.

9.32 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (118 నాటౌట్) పోరాటం కొనసాగిస్తున్నాడు. దీంతో 39 ఓవర్లలో కివీస్ 4 వికెట్లకు 257 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (20 నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు. గెలుపు కోసం న్యూజిలాండ్‍కు 66 బంతుల్లో 141 రన్స్ కావాలి.

9.22 PM: India vs New Zealand Live Score: 37 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్లకు 236 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (106 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. గెలవాలంటే 78 బంతుల్లో 162 రన్స్ చేయాలి కివీస్.

9.08 PM: India vs New Zealand Live Score: 35 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లకు 224 పరుగులు చేసింది న్యూజిలాండ్. డారెల్ మిచెల్ (103 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (1 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

8.58 PM: India vs New Zealand Live Score: భారత పేసర్ మహమ్మద్ షమీ 33వ ఓవర్లో మరో వికెట్ తీశాడు. టామ్ లాథమ్ (0)ను ఎల్‍బీడబ్ల్యూ చేశాడు. దీంతో 32.4 ఓవర్లలో కివీస్ 220 పరుగుల వద్ద నాలుగో వికెట్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్‍లో షమీకి ఇది నాలుగో వికెట్.

8.52 PM: India vs New Zealand Live Score: టీమిండియాకు భారత పేసర్ మహమ్మద్ షమీ బ్రేక్‍త్రూ ఇచ్చాడు. కేన్ విలియమ్సన్ (69)ను షమీ ఔట్ చేశాడు. దీంతో కేన్, మిచెల్ 181 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో 32.2 ఓవర్లలో 220 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోంది న్యూజిలాండ్. మిచెల్ శతకం పూర్తి చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

8.50 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ శతకానికి చేరాడు. 85 బంతుల్లో సెంచరీ చేశాడు.

8.40 PM: India vs New Zealand Live Score: 30 ఓవర్లలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 199 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (98 నాటౌట్), కేన్ విలియమ్సన్ (58 నాటౌట్) జోరు పెంచారు.

8.30 PM: India vs New Zealand Live Score: 28 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు చేసింది న్యూజిలాండ్. డారిల్ మిచెల్ (78 నాటౌట్), కేన్ విలియమ్సన్ (51 నాటౌట్) దూకుడు పెంచారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. గెలవాలంటే 22 ఓవర్లలో ఇంకా 218 పరుగులు చేయాలి న్యూజిలాండ్.

8.20 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా అర్ధ శతకం చేశాడు. 58 బంతుల్లో హాఫ్ సెంచరీకి చేరాడు.

8.18 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లలో న్యూజిలాండ్ 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62 నాటౌట్), కేన్ విలియమ్సన్ (48 నాటౌట్) అదరగొడుతున్నారు.

8.00 PM: India vs New Zealand Live Score: కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32 నాటౌట్), డారిల్ మిచెల్ (41 నాటౌట్) దూకుడు పెంచారు. దీంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 124 పరుగులు చేసింది న్యూజిలాండ్.

7.50 PM: India vs New Zealand Live Score: 18 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 114 పరుగులు చేసింది న్యూజిలాండ్. కేన్ విలియమ్సన్ (30 నాటౌట్), డారిల్ మిచెల్ (33 నాటౌట్) జట్టును నిలబెడుతున్నారు. వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు.

7.40 PM: India vs New Zealand Live Score: కేన్ విలియమ్సన్ (25 నాటౌట్), డారిల్ మిచెల్ (21 నాటౌట్) క్రమంగా పరుగులు చేస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేసింది.

7.29 PM: India vs New Zealand Live Score: 14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లకు 74 పరుగులకు చేరుకుంది.

7.20 PM: India vs New Zealand Live Score: 12 ఓవర్లలో 2 వికెట్లకు 67 రన్స్ చేసింది న్యూజిలాండ్. విలియమ్సన్ (5 నాటౌట్), డారిల్ మిచెల్ (14 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు.

7.10 PM: India vs New Zealand Live Score: 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (4 నాటౌట్), డారిల్ మిచెల్ (1 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

7.00 PM: India vs New Zealand Live Score: భారత పేసర్ మహమ్మద్ షమీ రెండో వికెట్ తీశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (13)ను షమీ ఔట్ చేశాడు. దీంతో 7.4 ఓవర్లలో 39 రన్స్ వద్ద కివీస్ రెండో వికెట్ చేజార్చుకుంది.

6.49 PM: India vs New Zealand Live Score: ఈ మ్యాచ్‍లో తన తొలి బంతికే భారత పేసర్ మహమ్మద్ షమీ వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే (13)ను షమీ పెవిలియన్‍కు పంపాడు. ఈ క్యాచ్‍ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ డైవ్ చేసి అద్భుతంగా పట్టాడు. దీంతో 5.1 ఓవర్లలో 30 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది.

6.45 PM: India vs New Zealand Live Score: 5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు డెవోన్ కాన్వే (13 నాటౌట్), రచిన్ రవీంద్ర (8 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.

6.30 PM: India vs New Zealand Live Score: 2 ఓవర్లలో 12 పరుగులు చేసింది న్యూజిలాండ్. డెవోన్ కాన్వే (8 నాటౌట్), రచిన్ రవీంద్ర (4 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.

6.23 PM: India vs New Zealand Live Score: 398 పరుగుల లక్ష్యఛేదనను న్యూజిలాండ్ మొదలుపెట్టింది. కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెవోన్ కాన్వే ఓపెనింగ్‍కు దిగారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తున్నాడు.

5.50 PM: India vs New Zealand Live Score: ఇండియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 రన్స్ చేసింది. కోహ్లి, శ్రేయస్ సెంచరీలకు తోడు గిల్ (80 నాటౌట్) హాఫ్ సెంచరీ.. చివర్లో రాహుల్ కేవలం 20 బంతుల్లోనే 39 రన్స్ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లి రికార్డు 50వ సెంచరీ చేశాడు. శ్రేయస్ వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు.

విరాట్ 113 బంతుల్లో 117, అయ్యర్ 70 బంతుల్లో 105, గిల్ 66 బంతుల్లో 80 రన్స్ చేశారు. ఇండియా బ్యాటర్ల ధాటికి న్యూజిలాండ్ స్టార్ బౌలర్లు సౌథీ 10 ఓవర్లలో 100, బౌల్ట్ 10 ఓవర్లలో 86 రన్స్ సమర్పించుకున్నారు. ఇండియా చివరి 10 ఓవర్లలో 110 రన్స్ చేసింది.

5.42 PM: India vs New Zealand Live Score: శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లోనే 105 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇండియా 3 వికెట్లకు 381రన్స్ చేసింది.

5.35 PM: India vs New Zealand Live Score: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అతడు కేవలం 67 బంతుల్లోనే 8 సిక్స్ లు, 3 ఫోర్లతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ద్రవిడ్, రోహిత్ తర్వాత వరల్డ్ కప్ లలో వరుసగా రెండు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.

5.23 PM: India vs New Zealand Live Score: శ్రేయస్ అయ్యర్ మరో సెంచరీకి చేరువవుతున్నాడు. అతడు ప్రస్తుతం 62 బంతుల్లోనే 90 పరుగులతో ఉన్నాడు. 45వ ఓవర్లో రెండు సిక్స్ లు బాదాడు. దీంతో ఇండియా 2 వికెట్లకు 341 రన్స్ చేసింది. ఇప్పుడు 400 స్కోరుపై కన్నేసింది.

5.19 PM: India vs New Zealand Live Score: వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కాసేపటికే విరాట్ కోహ్లి ఔటయ్యాడు. అతడు 113 బంతుల్లో 117 పరుగులు చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి.

5.09 PM: India vs New Zealand Live Score: కోహ్లి రికార్డు 50వ సెంచరీతో ఇండియా 42 ఓవర్లలో వికెట్ నష్టానికి 303 రన్స్ చేసింది. కోహ్లి సెంచరీ తర్వాత భార్య అనుష్క శర్మ గాల్లో ముద్దుల వర్షం కురిపించింది. సచిన్ 49 సెంచరీలు చేసిన సమయంలో ఎవరూ తన దరిదాపుల్లోకి కూడా రారని అనుకున్నారు. కానీ కింగ్ కోహ్లి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అతినికిది 80వ సెంచరీ కావడం విశేషం.

5.06 PM: India vs New Zealand Live Score: విరాట్ కోహ్లి వన్డే క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును అతడు బ్రేక్ చేశాడు. కోహ్లి 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో ఈ 50వ సెంచరీ చేశాడు.

4.49 PM: India vs New Zealand Live Score: వన్డేల్లో రికార్డు 50వ సెంచరీకి చేరువవుతున్నాడు విరాట్ కోహ్లి. ప్రస్తుతం 92 పరుగులతో ఆడుతున్నాడు. ఇండియా 38 ఓవర్లలో వికెట్ నష్టానికి 275 రన్స్ చేసింది.

4.42 PM: India vs New Zealand Live Score: శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 37 బంతుల్లోనే 4 సిక్స్ లు, 2 ఫోర్లు కొట్టాడు. కోహ్లితో కలిసి ఇప్పటికే 80 బంతుల్లో సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో ఇండియా 37 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 270 రన్స్ చేసింది.

4.32 PM: India vs New Zealand Live Score: వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఒక వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా 20 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ (673) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. కోహ్లి 80 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఈ ఘనత సాధించాడు.

4.12 PM: India vs New Zealand Live Score: ఇండియా 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 214 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి 65, శ్రేయస్ అయ్యర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

4.00 PM: India vs New Zealand Live Score: విరాట్ కోహ్లి మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో అతనికిది 6వ హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్ గా 72వ హాఫ్ సెంచరీ. కోహ్లి 59 బంతుల్లో 4 ఫోర్లతో ఫిఫ్టీ చేశాడు. వరల్డ్ కప్ నాకౌట్స్ లో కోహ్లికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇంతకుముందు మూడు వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో అతడు 9, 1, 1 స్కోర్లు మాత్రమే చేశాడు.

3.52 PM: India vs New Zealand Live Score: ఇండియా ఇన్నింగ్స్ 25 ఓవర్లు ముగిశాయి. ఇండియా వికెట్ నష్టానికి 178 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ 47 రన్స్ చేసి ఔటవగా.. గిల్ 79 పరుగుల దగ్గర రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. కోహ్లి, శ్రేయస్ క్రీజులో ఉన్నారు.

3.42 PM: India vs New Zealand Live Score: ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. 65 బంతుల్లో 79 పరుగులు చేసిన సందర్భంలో గిల్ కాలి కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేకపోయాడు. రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.

3.37 PM: India vs New Zealand Live Score: ఇండియా 22 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 157 రన్స్ చేసింది.

3.29 PM: India vs New Zealand Live Score: ఇండియా ఇన్నింగ్స్ 20 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టానికి 150 రన్స్ చేసింది. సెంచరీపై కన్నేసిన గిల్ 20వ ఓవర్లో ఓ సిక్స్ బాదాడు.

3.18 PM: India vs New Zealand Live Score: శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి రెండో వికెట్ కు ఇప్పటికే ఫిఫ్టీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. ఇక 17వ ఓవర్లో గిల్ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఇండియా వికెట్ నష్టానికి 132 రన్స్ చేసింది.

3.07 PM: India vs New Zealand Live Score: ఇండియా ఇన్నింగ్స్ 15 ఓవర్లు ముగిశాయి. రోహిత్ హాఫ్ సెంచరీ మిస్సయినా.. గిల్ ఈ మార్క్ అందుకున్నాడు. దీంతో ఇండియా వికెట్ నష్టానికి 118 రన్స్ చేసింది.

3.02 PM: India vs New Zealand Live Score: టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడు కేవలం 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్ తో ఈ వరల్డ్ కప్ లో నాలుగో హాఫ్ సెంచరీ చేయడం విశేషం.

2.52 PM: India vs New Zealand Live Score: ఇండియా 11 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 89 రన్స్ చేసింది. గిల్, కోహ్లి క్రీజులో ఉన్నారు.

2.47 PM: India vs New Zealand Live Score: పదో ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టానికి 84 రన్స్ చేసింది.

2.44 PM: India vs New Zealand Live Score: 9వ ఓవర్లో రోహిత్ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి రెండో బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడనుకొని విలియమ్సన్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. అయితే బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. అది బౌండరీ వెళ్లడంతో కోహ్లి ఖాతా తెరిచాడు. ఇండియా వికెట్ నష్టానికి 75 రన్స్ చేసింది.

2.38 PM: India vs New Zealand Live Score: ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. మరో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి రోహిత్ శర్మ 47 పరుగుల దగ్గర ఔటయ్యాడు. 29 బంతుల్లోనే 4 సిక్స్ లు, 4 ఫోర్లు బాదాడు.

2.30 PM: India vs New Zealand Live Score: రోహిత్ శర్మ ఏడో ఓవర్లో కాస్త నెమ్మదించాడు. ఈ ఓవర్లో బౌండరీలు రాలేదు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది.

2.24 PM: India vs New Zealand Live Score: రోహిత్ అడ్డూ అదుపూ లేకుండా చెలరేగుతున్నాడు. ఆరో ఓవర్లో మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 58 రన్స్ చేసింది.

2.20 PM: India vs New Zealand Live Score:ఇండియా 5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 47 రన్స్ చేసింది. ఐదో ఓవర్లోనూ రోహిత్ ఓ సిక్స్ బాదాడు. అతడు ఇప్పటికే మూడు ఫోర్లు, మూడు సిక్స్ లుకొట్టడం విశేషం.

2.15 PM: India vs New Zealand Live Score: రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. నాలుగో ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 38 రన్స్ చేసింది.

2.10 PM: India vs New Zealand Live Score: ఇండియా మూడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 25 రన్స్ చేసింది. రోహిత్ మూడో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్ లో సిక్స్ బాదడం విశేషం.

2.06 PM: India vs New Zealand Live Score: రెండో ఓవర్లో శుభ్‌మన్ గిల్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 18 రన్స్ చేసింది.

2.02 PM: India vs New Zealand Live Score: తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఇండియా వికెట్ నష్టపోకుండా 10 రన్స్ చేసింది.

1.55 PM: India vs New Zealand Live Score: ముగిసిన జాతీయ గీతాలాపన. సెమీఫైనల్ చూడటానికి వచ్చిన మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్

1.35 PM: India vs New Zealand Live Score: ఇండియా తుది జట్టు ఇదే..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమి, సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..

కాన్వే, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మాన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

1.30 PM: India vs New Zealand Live Score: న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పుల్లేకుండా ఇండియా బరిలోకి దిగుతోంది. అటు న్యూజిలాండ్ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఆ టీమ్ కెప్టెన్ విలియమ్సన్ అన్నాడు.

1.20 PM: India vs New Zealand Live Score: తుది జట్టులో మార్పుల్లేవ్..

న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్లో తుది జట్టులో టీమిండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. గ్రూప్ స్టేజ్ లో చివరిసారి న్యూజిలాండ్ మ్యాచ్ లోనే ఇండియా తుది జట్టులో మార్పులు చేసింది. తర్వాత నాలుగు మ్యాచ్ లలోనూ ఒకే జట్టును కొనసాగించింది.

ఆ మ్యాచ్ లో పాండ్యా స్థానంలో సూర్య, శార్దూల్ స్థానంలో షమి వచ్చిన జట్టులో కుదురుకున్నారు. సెట్ అయిన టీమ్ లో మార్పులు చేయకూడదని నెదర్లాండ్స్ తో ప్రాధాన్యం లేని మ్యాచ్ లోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సెమీఫైనల్లోనూ అదే జట్టు ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

12.40 PM: India vs New Zealand Live Score: వాంఖడేలో కోహ్లి చెలరేగుతాడా?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లికి మంచి రికార్డు ఉంది. తన హీరో సచిన్ టెండూల్కర్ సొంత మైదానం అయిన వాంఖడేలో అతని తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లియే. ఇక్కడ ఇప్పటి వరకూ 7 వన్డేలు ఆడిన కోహ్లి 59.5 సగటుతో 357 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సచిన్ 11 మ్యాచ్ లలో 41.36 సగటుతో 455 రన్స్ చేశాడు. అతడు కూడా ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ తో సెంచరీ చేస్తే సచిన్ 49 సెంచరీల రికార్డుతోపాటు వాంఖడేలో అతని అత్యధిక స్కోరు రికార్డును కూడా కోహ్లి తుడిచి పెడతాడు.

12.05 PM: India vs New Zealand Live Score: కోహ్లి 50వ సెంచరీ చేస్తాడా?

ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లి తన 50వ సెంచరీ చేస్తాడా? ఇప్పుడు అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో 49వ సెంచరీతో సచిన్ ను సమం చేసిన అతడు.. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. 594 రన్స్ తో వరల్డ్ కప్ టాప్ స్కోరర్స్ లో నంబర్ వన్ లో ఉన్న కోహ్లి.. అదే ఫామ్ కొనసాగిస్తే వాంఖడేలోనే 50వ సెంచరీ చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

12.00 PM: India vs New Zealand Live Score: లీగ్ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది ఇలా..

వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ లోనూ ఇండియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. రెండు టీమ్స్ అప్పటికే నాలుగేసి మ్యాచ్ లలో గెలిచాయి. టాప్ ప్లేస్ కోసం జరిగిన ఈ ఫైట్ లో ఇండియా 4 వికెట్లతో గెలిచింది. ఆ మ్యాచ్ తోనే తుది జట్టులోకి మళ్లీ వచ్చిన షమి 5 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 273 రన్స్ మాత్రమే చేయగలిగింది. తర్వాత విరాట్ కోహ్లి 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ మిస్సయినా.. ఇండియా 4 వికెట్లతో విజయం సాధించింది.

11.40 AM: India vs New Zealand Live Score: వాంఖడే పిచ్ ఎలా ఉందంటే?

ముంబైలోని వాంఖడేలో ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ లకు సమంగా అనుకూలించనుంది. స్పిన్నర్లకు కాస్త ఎక్కువ అనుకూలిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకూ 27 వన్డేలు జరిగాయి. అందులో 14 మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్, 13 మ్యాచ్ లలో చేజింగ్ టీమ్ గెలవడం విశేషం.

11.10 AM: India vs New Zealand Live Score: ముంబైలో వాతావరణం ఎలా ఉందంటే?

ముంబైలో వాతావరణం పొడిగా ఉంది. మ్యాచ్ కు అసలు వర్షం అడ్డు తగిలే అవకాశమే లేదు. సాధారణంగా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లకు రిజర్వ్ డే కూడా ఉంటుంది. అయితే వర్షం పడే అవకాశం లేకపోవడంతో రిజర్వ్ డే అవసరం రాకపోవచ్చు.

10.20 AM: India vs New Zealand Live Score: కోహ్లి, రోహిత్ సెమీస్ రికార్డులను మెరుగుపరచుకుంటారా?

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్నారు. కోహ్లి 594 రన్స్ తో టాప్ లో ఉండగా.. రోహిత్ 503 రన్స్ చేశాడు. అయితే ఈ ఇద్దరూ సెమీఫైనల్స్ లో మాత్రం ఫెయిలవుతూ వస్తున్నారు. గత మూడు వరల్డ్ కప్ లలో కోహ్లి సెమీస్ ప్రదర్శన దారుణంగా ఉంది.

2011లో పాకిస్థాన్ తో సెమీస్ లో 9, 2015లో ఆస్ట్రేలియాతో సెమీస్ లో 1, 2019లో న్యూజిలాండ్ తో సెమీస్ లో 1 పరుగు చేశాడు. ఇక రోహిత్ 2015లో ఆస్ట్రేలియాతో 34, 2019లో న్యూజిలాండ్ తో ఒక పరుగు చేశాడు. ఈసారి సెమీస్ గండం గట్టెక్కాలంటే ఈ ఇద్దరూ చెలరేగడం చాలా అవసరం.

10.10 AM: India vs New Zealand Live Score: సెలబ్రిటీల క్యూ

ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ చూడటానికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కు కేంద్రమైన ముంబైలోనే మ్యాచ్ జరుగుతుండటంతో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు రానున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే చెన్నై నుంచి ముంబై వెళ్లాడు.

ఇక బీసీసీఐ గోల్డెన్ టికెట్ అందుకున్న అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ నుంచి వెంకటేశ్ లాంటి వాళ్లు ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడనున్నారు. వీళ్లందరితోపాటు స్పెషల్ అట్రాక్షన్ గా మాజీ ఫుట్‌బాల్ డేవిడ్ బెక్‌హామ్ కూడా రానుండటం విశేషం.

9.40 AM: India vs New Zealand Live Score: ఇండియా, న్యూజిలాండ్ లలో ఎవరిది పైచేయి?

ఓవరాల్ గా వన్డేల్లో న్యూజిలాండ్ పై ఇండియాదే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ 117 వన్డేల్లో తలపడ్డాయి. అందులో 59 విజయాలతో ఇండియా ఆధిపత్యం చెలాయించింది. అయితే ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి న్యూజిలాండ్ హవా కొనసాగుతోంది. మొత్తం పదిసార్లు ఈ రెండు టీమ్స్ ఐసీసీ టోర్నీల్లో తలపడగా.. అందులో 6సార్లు న్యూజిలాండ్ గెలిచింది.

2003 తర్వాత తొలిసారి ఈ వరల్డ్ కప్ లోనే న్యూజిలాండ్ పై ఇండియా గెలవడం విశేషం. ఈ గ్యాప్ లో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపిన్షిప్ ఫైనల్, 2021 టీ20 వరల్డ్ కప్ లలో న్యూజిలాండ్ విజయాలు సాధించింది. ఇప్పుడు లీగ్ స్టేజ్ లో కివీస్ ను ఇండియా చిత్తు చేసింది. సెమీఫైనల్లోనూ అదే రిపీట్ చేసి 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.

9.00 AM: India vs New Zealand Live Score: 2019 వరల్డ్ కప్ లోనూ ఇలాగే..

ఇండియా, న్యూజిలాండ్ టీమ్స్ 2019 వరల్డ్ కప్ లోనూ ఇలాగే తొలి, నాలుగు స్థానాల్లో సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. అయితే ఈసారి టీమిండియా ఆధిపత్యం మరో స్థాయిలో ఉంది. లీగ్ స్టేజ్ లో ఆడిన 9 మ్యాచ్ లలోనూ విజయం సాధించింది.

మరోవైపు న్యూజిలాండ్ మాత్రం 9 మ్యాచ్ లలో 5 గెలిచి, 4 ఓడిపోయింది. లీగ్ స్టేజ్ లో ఇండియా చేతుల్లోనూ ఓడింది. అయితే 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియాపై గెలిచిన ఆత్మవిశ్వాసం వాళ్లలో ఉంది. దానికి ప్రతీకారం కోసం ఇండియన్ టీమ్ చూస్తోంది.

 

Whats_app_banner