Union Budget 2024 in Telugu Live Updates : ‘పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’-union budget 2024 25 india live nirmala sitharaman interim budget speech income tax news updates in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Union Budget 2024 In Telugu Live Updates : ‘పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లైవ్ అప్‌డేట్స్

Union Budget 2024 in Telugu Live Updates : ‘పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’

11:11 AM ISTFeb 01, 2024 04:41 PM HT Telugu Desk
  • Share on Facebook
11:11 AM IST

  • Union Budget 2024 in Telugu : కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు, ఆదాయ పన్ను సంస్కరణలు ఉంటాయి. ఆ విశేషాల లైవ్ కవరేజ్ ఎప్పటికప్పుడు ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ అందిస్తోంది.

Thu, 01 Feb 202411:11 AM IST

Budget 2024: ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని విస్తృతపరిచి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ ఆరోగ్య భద్రతను వర్తింపజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

2023-24 బడ్జెట్ అంచనాల్లో రూ. 7200 కోట్లుగా ఉన్న ఈ పథకానికి కేటాయింపులను 2024-25లో రూ.7,500 కోట్లకు స్వల్పంగా పెంచారు.

ఈ పథకంలో ఆస్పత్రుల్లో చేరేవారికి ఏడాదికి రూ. 5 లక్షల నగదు రహిత కవరేజీ లభిస్తుంది. కేంద్రం 2011 సామాజిక ఆర్థిక కుల గణన ఆధారంగా పేద, బలహీన వర్గాల నుంచి గుర్తించి ప్రాథమిక లబ్ధిదారుల డేటాబేస్ క్రోడీకరించింది. గత ఏడాది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సాధారణ చికిత్స, లింగమార్పిడి శస్త్రచికిత్సల కోసం ఈ పథకం కింద ప్రయోజనాలను చేర్చడానికి డేటాబేస్ విస్తరించింది.

Thu, 01 Feb 202411:02 AM IST

Budget 2024: నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ రోజు నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 21,658.75 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 28 పాయింట్లు క్షీణించి 21,697.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 177 పాయింట్లు నష్టపోయి 71,574.89 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ చివరకు 107 పాయింట్లు క్షీణించి 71,645.30 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం క్షీణించాయి.

Thu, 01 Feb 202410:58 AM IST

Union Budget 2024-25: నష్టపోయిన రియల్ ఎస్టేట్ షేర్లు

2024 మధ్యంతర బడ్జెట్లో ఆకర్షణీయ ప్రకటనలు లేకపోవడంతో గురువారం రియల్ ఎస్టేట్ షేర్లు నష్టపోయాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ లిమిటెడ్ షేర్లు 2.24 శాతం క్షీణించాయి. బిఎస్‌ఇలో శోభా లిమిటెడ్ (1.88%), ఒబెరాయ్ రియల్టీ (1.59%), గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా 0.80% నష్టపోయాయి.

అందుబాటు గృహాలపై దృష్టి సారించే రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ షేర్లు 2.08 శాతం పెరిగాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం గృహాలను నిర్మించే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గురువారం బిఎస్ఇలో 19.62% పెరిగింది. ఎన్బీసీసీ కూడా 9.78 శాతం పెరిగింది.

మధ్యతరగతి ప్రజలు సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న తన బడ్జెట్ 2024 ప్రసంగంలో చెప్పారు.

Thu, 01 Feb 202408:55 AM IST

Union Budget 2024-25: అతి తక్కువ సమయంలో ముగింపు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం మధ్యాహ్నం 12 లోపే ముగిసింది. తన బడ్జెట్ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం చేసిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది. 1977లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన ప్రసంగం అతి తక్కువ సమయంలో ముగిసింది. నాడు ఆయన చేసిన ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.

Thu, 01 Feb 202408:32 AM IST

Union Budget 2024-25: 'లఖ్ పతి దీదీ' కార్యక్రమం వివరాలు ఇవీ

దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 'లఖ్ పతి దీదీ' పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఏడాదికి కనీసం లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'లఖ్ పతి దీదీ' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బు తయారీ, డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో 2 కోట్ల మంది గ్రామీణ మహిళలను లఖ్ పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

Thu, 01 Feb 202407:25 AM IST

Union Budget 2024-25 India live: సొంతింటి కల నెరవేరనుందా?

మధ్యతరగతి ప్రజలు సొంత ఇళ్లు కొనడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న తన బడ్జెట్ 2024 ప్రసంగంలో చెప్పారు. మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇళ్లు కొనుక్కోవడానికి లేదా నిర్మించుకోవడానికి వీలుగా ప్రభుత్వం నూతన గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

Thu, 01 Feb 202407:05 AM IST

స్టాక్​ మార్కెట్​లో ఊగిసలాట..

Union Budget 2024 in Telugu : నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగం నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​లలో ఊగిసలాట కనిపించింది. బడ్జెట్​ ప్రసంగం మొదలైన ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్​ 72,092 వద్ద ఉంది. ప్రసంగం ముగిసిన సమయానికి 71, 711 వద్దకు పడిపోయింది. ప్రస్తుతం 71, 744 వద్ద కొనసాగుతోంది.

Thu, 01 Feb 202406:56 AM IST

బడ్జెట్​పై నేతల స్పందనలు..

నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​పై ఎన్​డీఏ పక్ష నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అంటున్నారు. మరోవైపు.. ఈ దఫా బడ్జెట్​పై విపక్షాల విమర్శలు మొదలయ్యాయి. దేశంలో బడ్జెట్​ లోటు నెలకొందని, ఖర్చులు చేసేందుకు దేశం అధికంగా అప్పులు చేస్తోందని విపక్ష నేతలు అంటున్నారు. ఇలా లోటు పెరగడం అనేది దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202406:54 AM IST

ముగిసిన బడ్జెట్​ ప్రసంగం..

Union Budget 2024 in Telugu : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగం ముగిసింది. ఇది మధ్యంతర బడ్జెట్​ కావడంతో ఈసారి కాస్త తొందరగానే ప్రసంగం ముగిసిందని చెప్పుకోవాలి. లోక్​సభ ఎన్నికల అనంతరం ఏర్పాడే నూతన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్​ని ప్రవేశపెడుతుంది.

Thu, 01 Feb 202406:54 AM IST

ద్రవ్యలోటు అంచనాలు..

Union Budget 2024 in Telugu : 2024-25 ఆర్థిక ఏడాదిలో భారత దేశ ద్రవ్యలోటు జీడీపీలో 5.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు.

Thu, 01 Feb 202406:54 AM IST

‘పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’

Union Budget 2024 in Telugu : ‘పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’ అని నిర్మల స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202406:22 AM IST

వికాస్​ భారత్​..

Union Budget 2024 in Telugu : “జులైలో అధికారంలోకి వచ్చాక.. వికాస్​ భారత లక్ష్యాన్ని వేగవంతం చేసి విధంగా మా ప్రభుత్వం రోడ్​మ్యాప్​ని ప్రకటిస్తుంది,” అని నిర్మల స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202406:12 AM IST

రూ. 1 లక్ష కోటి కార్పస్​

Union Buget 2024 in Telugu : “టెక్​ రంగంలో ఉన్న యువతకు ఇది బంగారు సమయం. 50ఏళ్ల ఉచిత వడ్డీతో రూ. 1లక్ష కోట్ల కార్పస్​ని ఏర్పాటు చేస్తాము. ఇన్నోవేషన్​కి ఇది ఉపయోగపడుతుంది,” అని నిర్మల స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202406:10 AM IST

ఉచిత విద్యుత్​..

Union Budget 2024 in Telugu "రూఫ్​ టాప్​ సోలరైజేషన్​ ద్వారా 1 కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్​ల వరకు ఉచిత విద్యుత్​ సరఫరాను అందిస్తాము. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత.. మోదీ తీసుకున్న నిర్ణయం ఇది," అని నిర్మల అన్నారు.

Thu, 01 Feb 202406:07 AM IST

టెక్​ రంగానికి ఊతం..

Union Budget 2024 in Telugu : “జై జవాన్​ జై కిసాన్​ జై విజ్ఞాన్​ జై అనుసంధాన్​ అని మోదీ అన్నారు. ఇన్నోవేషన్​.. అభివృద్ధికి చాలా ముఖ్యం. డిఫెన్స్​ రంగంలో డీప్​ టెక్​ సంస్థలను ఏర్పాటు చేస్తాము. టెక్​ రంగం కోసం కార్పస్​ని ఏర్పాటు చేసి, అవకాశాలను కల్పిస్తాము,” అని నిర్మల స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202406:02 AM IST

జీడీపీ అంటే..

Union Budget in Telugu : “జీడీపీ అర్థాన్ని ఈ ప్రభుత్వం మార్చింది. జీడీపీ అంటే ఇప్పుడు.. గవర్నెన్స్​, డెవలప్​మెంట్​, పర్ఫార్మెన్స్​,” అని నిర్మల అన్నారు.

Thu, 01 Feb 202405:58 AM IST

దేశంలో మరిన్ని వైద్య కళాశాలలు..

Union Budget 2024 in Telugu : దేశంలో మరిన్ని వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్​ అన్నారు. ఇందుకోసం మెడికల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202405:55 AM IST

ఈశాన్య భారతం అభివృద్ధి..

Union Budget in 2024 in Telugu : “ఈశాన్య భారతం, అక్కడి ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టిబడి ఉన్నాము. దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలు, బ్లాక్​ల అభివృద్ధికి రాష్ట్రాలకు సాయం చేస్తాము,” అని నిర్మల స్పష్టం చేశారు.

Thu, 01 Feb 202405:53 AM IST

రానున్న ఐదేళ్లు చాలా కీలకం..

Union Budget 2024 in Telugu : “రానున్న ఐదేళ్లు చాలా కీలకం. మునుపెన్నడు లేని విధంగా ఇండియా అభివృద్ధి చెందుతుంది. 2047 నాటికి ఇండియాను వికసిత్​ భారత్​గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాము. ఆర్థిక వ్యవస్థలో సానుకూల ట్రెండ్స్​ కనిపిస్తున్నాయి. ప్రజల సేవింగ్స్​, ఇన్​వెస్ట్​మెంట్స్​ పెరిగే విధంగా చర్యలు తీసుకున్నాము, ఎంఎస్​ఎంలు వేగంగా అభివృద్ధి చెంది, ప్రపంచ సంస్థలకు పోటీనిచ్చే విధంగా చర్యలు చేపట్టాము,” అని నిర్మల అన్నారు.

Thu, 01 Feb 202405:49 AM IST

యువతకు శిక్షణపై ఫోకస్​..

Union Budget 2024 in Telugu : "స్కిల్​ ఇండియా మిషన్​లో భాగంగా 1.4 కోట్ల మంది యువతను ట్రైన్​ చేశాము. 54లక్షల మందికి పునశిక్షణ కల్పించాము. 3వేల కొత్త ఐటీఐలను ప్రారంభించాము. 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్​, 390 వర్సిటీలు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి,"

Thu, 01 Feb 202405:47 AM IST

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం..

Union Budget 2024 in Telugu : “అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాము. వనరుల పంపిణీలో లోపం లేకుండా చూసుకుంటున్నాము. మేము చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి,” అని నిర్మల అన్నారు.

Thu, 01 Feb 202405:41 AM IST

సబ్​కా సాత్​- సబ్​కా వికాస్​- సబ్​కా విశ్వాస్​..

Union Budget 2024 in Telugu : ‘2047 నాటికి దేశం.. వికసిత్​ భారత్​గా ఆవిర్భవించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​, సబ్​కా వికాస్​ నినాదంతో ముందుకెళుతున్నాము. పేదలు, రైతులు, మహిళలు, యువతను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాము,’ అని నిర్మలా సీతారామన్​ అన్నారు.

అనంతరం.. బీజేపీ పాలనలో సాధించిన ప్రగతి, పురోగతిని వివరించారు ఆర్థిక మంత్రి.

Thu, 01 Feb 202405:37 AM IST

నిర్మలా సీతారామన్​ వ్యాఖ్యలు..

Union Budget 2024 in Telugu : “2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాము. రెండో దఫా గెలిచినప్పుడు.. అభివృద్ధిపై ఫోకస్​ చేశాము. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము. అమృత కాలానికి బలమైన పునాదులు వేశాము,” అని నిర్మలా సీతారామన్​ అన్నారు.

Thu, 01 Feb 202405:32 AM IST

బడ్జెట్​ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​..

Union Budget 2024 in Telugu : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. 2024 బడ్జెట్​ని లోక్​సభలో ప్రవేశపెట్టారు.

Thu, 01 Feb 202405:37 AM IST

పార్లమెంట్​కు సోనియా గాంధీ

Union Budget 2024 in Telugu : కాంగ్రెస్​ సీనియర్​ నేత సోనియా గాంధీ.. బడ్జెట్​ నేపథ్యంలో పార్లమెంట్​కు వెళ్లారు. రాహుల్​ గాంధీ మాత్రం.. బడ్జెట్​ సెషన్​కి దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన.. బంగాల్​లో భారత్​ జోడో న్యాయ యాత్ర నిర్వహిస్తున్నారు.

Thu, 01 Feb 202405:26 AM IST

బడ్జెట్​కి కేబినెట్​ ఆమోదం..

Union Budget in Telugu : బడ్జెట్​కి కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్​లో బడ్జెట్​ని ప్రవేశపెడతారు నిర్మల

Thu, 01 Feb 202405:06 AM IST

మహిళలు, రైతులపై ఫోకస్​..?

Union Budget 2024 in Telugu : ఈ దఫా బడ్జెట్​లో మహిళలు, రైతులపై నిర్మలా సీతారామన్​ ఫోకస్​ చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Thu, 01 Feb 202404:47 AM IST

పార్లమెంట్​లో హడావుడు..

Union Budget 2024 in Telugu : బడ్జెట్​ నేపథ్యంలో పార్లమెంట్​లో హడావుడి నెలకొంది. ఎంపీలు ఒక్కొక్కరుగా పార్లమెంట్​కు చేరుకుంటున్నారు. ఎన్​డీఏ బృందం.. బడ్జెట్​పై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. 2024 బడ్జెట ప్రోగ్రెసివ్​గా ఉంటుందని అంటున్నారు. మరోవైపు.. విపక్షాలు మాత్రం బడ్జెట్​పై ఇప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. ప్రజలను మోసం చేసే విధంగా ఈ బడ్జెట్​ ఉంటుందని అంటున్నాయి.

Thu, 01 Feb 202404:35 AM IST

కేబినెట్​ సమావేశం..

Union Budget 2024 in Telugu : బడ్జెట్​ నేపథ్యంలో కేంద్ర కేబినెట్​ సమావేశమైంది. ఇంకొన్ని నిమిషాల్లో.. బడ్జెట్​కి కేబినెట్​ ఆమెదం తెలుపుతుంది. అప్పుడు.. పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రసంగాన్ని మొదలుపెడతారు నిర్మలా సీతారామన్​.

Thu, 01 Feb 202404:28 AM IST

పార్లమెంట్​కు నిర్మలా సీతారామన్​

Union Budget 2024 in Telugu : నిర్మాలా సీతారామన్​.. పార్లమెంట్​కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన ఫొటో సెషన్​లో పాల్గొన్నారు. మరికొంత సేపట్లో బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు.

Thu, 01 Feb 202404:16 AM IST

పార్లమెంట్​కు బడ్జెట్​ కాపీలు..

Union Budget 2024 in Telugu : బడ్జెట్​ ప్రతులు పార్లమెంట్​కు చేరుకున్నాయి. వాటిని లోక్​సభలోకి తరలిస్తున్నారు అధికారులు.

మరోవైపు దిల్లీలో వర్షం పడుతోంది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి.

Thu, 01 Feb 202404:16 AM IST

ఆదాయపు పన్ను రూల్స్​లో మార్పులు ఉంటాయా?

Union Budget 2024 in Telugu : మరికొన్ని గంటల్లో బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్​. అయితే.. ఈ బడ్జెట్​పై మధ్యతరగతి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా.. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ వంటి వివిధ సెక్షన్ల కింద లభించే కొన్ని పన్ను మినహాయింపు పరిమితులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్​ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

Thu, 01 Feb 202403:51 AM IST

లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు..

Union Budget 2024 : 2024 బడ్జెట్​ నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 242 పాయింట్లు పెరిగి 71994 వద్ద ప్రారంభమైంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ఓపెన్​ అయ్యింది. బడ్జెట్​ కారణంగా.. సూచీల్లో తీవ్ర ఒడుదొడుకులు కనిపించే అవాశం ఉందని స్టాక్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Thu, 01 Feb 202403:36 AM IST

నార్త్​ బ్లాక్​కి నిర్మలా సీతారామన్​..

బడ్జెట్​ 2024ని మరికొన్ని గంటల్లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. కొన్ని నిమిషాల ముందు.. నార్త్​ బ్లాక్​లోని ఫైనాన్స్​ మినిస్ట్రీ వద్దకు చేరుకున్నారు నిర్మల.

Thu, 01 Feb 202403:30 AM IST

Budget 2024 in Telugu: మధ్యంతర బడ్జెట్ దేనిపై దృష్టి పెట్టవచ్చు?

మధ్యంతర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన, ఓట్లను రాబట్టే చర్యలపై భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.9 శాతం ద్రవ్యలోటు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఇది కేంద్ర ప్రభుత్వ జీడీపీ లక్ష్యమైన 3 శాతానికి దాదాపు రెట్టింపు అని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

Thu, 01 Feb 202403:22 AM IST

Budget 2024 in Telugu: గత ఏడాది బడ్జెట్‌‌లో ముఖ్యమైన అంశాలు ఇవే

2023-24లో మూలధన వ్యయ వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.

పశుసంవర్థక, పాడి పరిశ్రమ, చేపల పెంపకంపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.

అంతకుముందు రెండు కేంద్ర బడ్జెట్ల మాదిరిగానే 2023-24 కేంద్ర బడ్జెట్ కూడా కాగిత రహిత రూపంలో ప్రవేశపెట్టారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 5.9 శాతంగా నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.

Thu, 01 Feb 202403:10 AM IST

Budget 2024 in Telugu: మన్మోహన్ సింగ్ పేరిట ఈ బడ్జెట్ రికార్డ్

పదాల పరంగా చూస్తే 1991లో ఆర్థిక పత్రాన్ని సమర్పించే సమయంలో 18,604 పదాలను ఉపయోగించిన రికార్డు మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 2018లో ప్రసంగించిన అరుణ్ జైట్లీ పదాల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్నారు. 2020 లో నిర్మలా సీతారామన్ భారతదేశ చరిత్రలో సుదీర్ఘ సమయం బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది.

Thu, 01 Feb 202402:55 AM IST

Budget 2024 in Telugu: బడ్జెట్ డాక్యుమెంట్లను ఎక్కడ పొందవచ్చు?

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, యూనియన్ బడ్జెట్ పత్రాలు అధికారిక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి, ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Thu, 01 Feb 202402:49 AM IST

Budget 2024 in Telugu: భారతదేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్ ప్రతిపాదనలను ఎవరు సమర్పించారు?

మాజీ ప్రధాని మొరాజీ దేశాయ్ భారతదేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 1962 నుంచి 1969 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 10 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చిదంబరం (9), ప్రణబ్ ముఖర్జీ (8), యశ్వంత్ సిన్హా (8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Thu, 01 Feb 202402:31 AM IST

Budget 2024 in Telugu: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఎక్కడ చూడొచ్చు?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈ ఉదయం 11 గంటలకు చేసే బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి సంసద్ టీవీ, డీడీ న్యూస్‌లో చూడొచ్చు. అలాగే అన్ని అప్డేట్స్ కోసం మీరు ఈ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు లైవ్ బ్లాగ్ చదువొచ్చు. ఎప్పటికప్పుడు మీకు అన్ని అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తాం. ప్రత్యక్ష పన్నుల మినహాయింపులు, రంగాల వారీగా కేటాయింపులు, ప్రజాకర్షక పథకాలు, నగదు బదిలీ పెంపు వంటి విశేషాలన్నీ ఈ లైవ్ బ్లాగ్‌లో చదవొచ్చు.

Thu, 01 Feb 202402:15 AM IST

Budget 2024 in Telugu: బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా స్పందించనుంది?

Budget 2024 in Telugu: నేడు కేంద్ర బడ్జెట్ 2024 ప్రకటనకు ముందు, బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ గురువారం ఆచితూచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఫలితాల అనంతరం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ కాగా, అమెరికా స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఫెడ్ తన కీలక పాలసీ రేటును 5.25 శాతం-5.50 శాతం వద్ద యథాతథంగా ఉంచింది.

2024 మధ్యంతర బడ్జెట్‌కు ముందు బుధవారం భారత బెంచ్మార్క్ సూచీలు ఆరోగ్యకరమైన లాభాలను నమోదు చేశాయి.

Thu, 01 Feb 202402:10 AM IST

Budget 2024 in Telugu: మీరు తెలుసుకోవాల్సిన 2 కీలక వ్యయాలు

Capital Expenditure: మౌలిక సదుపాయాలు, భవనాలు మరియు యంత్రాలు వంటి భౌతిక ఆస్తులను సృష్టించడానికి చేసే మూలధన వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు.

Revenue expenditure: జీతభత్యాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి రోజువారీ కార్యకలాపాలపై చేసే రెవెన్యూ వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు.

Thu, 01 Feb 202401:57 AM IST

Budget 2024 in Telugu: మీరు తెలుసుకోవాల్సిన 3 కీలక బడ్జెట్ పదాలు

మీరు తెలుసుకోవలసిన మూడు బడ్జెట్ పదాలు ఇక్కడ ఉన్నాయి.

వార్షిక ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ (ఏఎఫ్)- ఈ డాక్యుమెంట్ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రాబడులు, వ్యయాలను తెలియజేస్తుంది.

కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వం సమీకరించే మొత్తం ఆదాయం, మార్కెట్ రుణాలు, రుణాల ద్వారా వచ్చే రాబడులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం.

కంటింజెన్సీ ఫండ్: ఏదైనా అనుకోని సంఘటనల కోసం కేటాయిస్తారు. ఇది రాష్ట్రపతి చేతిలో ఉంటుంది.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget 2024: ఈ ఏడాది ఎకనమిక్ సర్వే ఎందుకు ప్రవేశపెట్టలేదు?

మరికొద్ది నెలల్లో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టలేదు.

Thu, 01 Feb 202402:47 AM IST

Budget Live: కొత్త పన్ను విధానం

కొత్త పన్ను విధానాన్ని 2020 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానం తరహాలో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయలేరు. హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, 80సీ, 80డీ వంటి మినహాయింపులు పొందలేరు. పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించడానికి బడ్జెట్ 2023 లో ప్రభుత్వం పలు ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది.

Thu, 01 Feb 202401:20 AM IST

Budget 2024 Live: గృహ రుణాలకు ప్రోత్సాహకాలు ఉంటాయా?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి యొక్క ప్రస్తుత నిబంధనల ప్రకారం నివాస గృహం కోసం తీసుకున్న గృహ రుణం యొక్క అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి రూ .1.5 లక్షల వరకు మినహాయింపు పొందడానికి మీకు అనుమతి ఉంది. జీవిత బీమా ప్రీమియం, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్ మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇపిఎఫ్ కంట్రిబ్యూషన్లు, ఇఎల్ఎస్ఎస్ పెట్టుబడులు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లు, టాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్డిలు వంటి ఇతర అర్హత కలిగిన ఖర్చులతో పాటు ఈ మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా జీవిత బీమా, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఈపీఎఫ్‌తోనే ఈ 80సీ నిండిపోతుంది. గృహ రుణాలు తీసుకున్న వారికి ఈ సెక్షన్ ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదు. గృహ రుణాల అసలు మొత్తం చెల్లింపులకు ఊరట కలిగించేలా ఈ 80సీ మినహాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని మధ్య తరగతి ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక సెక్షన్ 24బీ కింద గృహ రుణాలపై వడ్డీ ద్వారా రూ. 2 లక్షల మినహాయింపు పొందవచ్చు. అయితే కేంద్రం ప్రతిపాదించిన కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులేవీ లేకపోయినా చెల్లించాల్సిన పన్ను పాతన పన్ను విధానం మాదిరిగానే ఉంటుంది. అందువల్ల గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఈ సెక్షన్ కింద మినహాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget 2024 Live: సెక్షన్ 80 సీ పరిమితి పెంచుతారా?

సెక్షన్ 80 సి కింద పెట్టుబడి మినహాయింపులకు ప్రస్తుత పరిమితి రూ .1.5 లక్షలు ఉంది. దశాబ్దకాలంగా ఇదే కొనసాగుతోంది. 2014 లో 50% మాత్రమే పెరిగింది. ఇది వార్షికంగా 3% కంటే తక్కువ. ఈ వార్షిక సగటు పెరుగుదల ఇదే కాలంలో సగటు ద్రవ్యోల్బణంతో సమానంగా లేదు. కనీసం రూ.2.50 లక్షలకు పెంచాలని వేతన జీవులు ఆరాటపడుతున్నారు.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget 2024 Live: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల గురించి తెలుసా?

Budget 2024 Live: దేశ పౌరులు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నులు చెల్లిస్తారు. ప్రత్యక్ష పన్నులు అంటే పౌరులు లేదా సంస్థలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు. ఆదాయ పన్ను ఈ కోవలోకి వస్తుంది. అంటే నిర్ధిష్టస్థాయిలో ఆదాయం ఉన్న వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. గిఫ్ట్ టాక్స్, వెల్త్ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, డివిడెండ్‌పై పన్ను, కార్పొరేట్ టాక్స్ వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఇక వస్తు సేవల పన్ను, ఎక్సైజ్ సుంకం, అమ్మకపు పన్ను, సర్వీస్ టాక్స్ వంటివి పరోక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget Tax Proposals: ఆదాయ పన్ను రాయితీలు ఉంటాయా?

Budget Tax Proposals: మధ్యంతర బడ్జెట్‌లో పన్ను రాయితీలను ప్రతిపాదించిన సందర్భాలు ఉన్నాయి. 2019 మధ్యంతర బడ్జెట్లో, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 40,000 నుండి రూ. 50,000 లకు పెంచడం, మొత్తం ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులకు పన్ను రిబేటును రూ. 2,500 నుండి రూ. 12,500 కు పెంచడం వంటి అనుకూలమైన పన్ను ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించడానికి ఆస్కారం ఉంది.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget live updates 2024: ప్రజాకర్షక పథకాలు ఉంటాయా?

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా భారీ విజయంపై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు రానున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు ఏవీ ఉండకపోవచ్చని, ఒకవేళ ఉన్నా అది రైతుల వరకు పరిమితం కావచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో పెద్ద విధానపరమైన ప్రకటనలేవీ చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ, గత సంప్రదాయాలను బట్టి చూస్తే 2019 మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ‘రైతులకు నగదు సాయం’ వంటి భారీ ప్రకటనలు చేయకుండా ప్రభుత్వాలు ఆపలేదు.

Thu, 01 Feb 202401:48 AM IST

Budget Live: బడ్జెట్ ఏ సమయంలో ప్రవేశపెడతారు?

Budget Time: బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు. బ్రిటీష్ వలస పాలనలో ఫిబ్రవరి చివరి తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. స్వతంత్రం వచ్చిన తరువాత కాలక్రమంలో ఈ సమయం మారిపోయింది.

Thu, 01 Feb 202412:20 AM IST

Budget 2024: ఈ బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్ అని ఎందుకు అంటున్నారు?

Budget 2024: నేటి బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. అయితే ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్నందున ఇది 'మధ్యంతరం'గా ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం జూలైలో ప్రవేశపెడుతుంది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆదాయ అంచనాలు, ఖర్చు అంచనాలు తాజా మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిబింబిస్తాయి.

Thu, 01 Feb 202412:22 AM IST

Budget 2024: బడ్జెట్ ప్రసంగం ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

Budget 2024: ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయి ప్రాతిపదికన ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న తొలి మహిళ నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు. ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.

Thu, 01 Feb 202412:06 AM IST

Budget Live: స్వతంత్ర భారత దేశంలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు?

Budget Live: స్వతంత్ర భారత దేశంలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి 1947 నవంబరు 26న ప్రవేశపెట్టారు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన 3 నెలలకు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Thu, 01 Feb 202402:49 AM IST

Budget Live: మొదటి బడ్జెట్ ఎప్పుడొచ్చిందో తెలుసా?

బ్రిటీష్ వలస పాలనలో భారత దేశం కోసం మొదటి బడ్జెట్‌ను 1860లో స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను వసూలు విధానాన్ని ప్రవేశపెట్టారు.

Thu, 01 Feb 202411:50 PM IST

Budget Live: ఇప్పటి వరకు ఎన్ని బడ్జెట్లు వచ్చాయో తెలుసా?

Budget Live: ఇప్పటివరకు భారతదేశం 77 సాధారణ బడ్జెట్లను, 14 మధ్యంతర బడ్జెట్లను చూసింది. మొత్తంగా ఇప్పటి వరకు 91 కేంద్ర బడ్జెట్లను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 92వ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Thu, 01 Feb 202411:55 PM IST

Railway Budget Live: రైల్వే బడ్జెట్ ఉంటుందా?

Railway Budget Live: రైల్వే బడ్జెట్ గతంలో విడిగా ఉండేది. అయితే 2016లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వేలకు విడిగా కాకుండా కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో భాగంగానే ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అదే ఆనవాయితీగా వస్తోంది. 2017-18 నుంచి ఎనిమిదేళ్లుగా ఉమ్మడి బడ్జెట్ కొనసాగుతోంది.

Thu, 01 Feb 202411:55 PM IST

Budget live 2024: ఆర్థిక మంత్రిగా ఆరో బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్. ప్రధాని మోదీ నేతృత్వంలో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.

Thu, 01 Feb 202411:55 PM IST

Budget live updates 2024: ప్రధాన మంత్రి మాట ఇదీ

Budget live updates 2024: బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. '2024 సంవత్సరానికి స్వాగతం. ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించబోము. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుంది. ఈ మధ్యంతర బడ్జెట్ మాకు మార్గదర్శకం. దేశం సుభిక్షంగా కొత్త శిఖరాలను చేరుకుంటుంది. మీ ఆశీస్సులతో ఈ ప్రయాణం కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు.

Thu, 01 Feb 202411:55 PM IST

Interim Budget 2024: వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని మధ్యంతర బడ్జెట్ ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో స్పష్టం చేశారు. "ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందిన 2023 సంవత్సరం భారతదేశానికి చారిత్రాత్మక సంవత్సరం. భారత్ వరుసగా రెండు త్రైమాసికాల్లో 7.5 శాతం వృద్ధిని సాధించింది..’ అని వివరించారు.

Thu, 01 Feb 202402:48 AM IST

Interim Budget 2024: ఇది మధ్యంతర బడ్జెట్

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మాత్రమే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. మధ్యంతర బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఖర్చులు, ఆదాయాలను వివరిస్తుంది. ఇది ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి సహాయపడుతుంది.