Top 10 SUVs sold in February: ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడు పోయిన ఎస్ యూ వీ ఏదో తెలుసా?
Top 10 SUVs sold in February: ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్ యూ వీల హవా కొనసాగుతోంది. కొనుగోలు దారులు తమ ఫస్ట్ చాయిస్ గా ఎస్ యూ వీ లనే పెట్టుకుంటున్నారు. దాంతో, వివిధ కంపెనీలు ఎస్ యూ వీ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, లేటెస్ట్ మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెడ్తున్నాయి.
టాటా మోటార్స్ ఎస్ యూవీ లు ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ సెల్లర్స్ గా ఈ సెగ్మెంట్ ను శాసిస్తున్నాయి. భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ యూ వీగా టాటా నెక్సాన్ సుదీర్ఘ కాలం కొనసాగింది. ఇప్పుడు ఆ స్థానంలోకి టాటా పంచ్ చేరింది. ఫిబ్రవరి నెలలో భారతదేశంలో విక్రయించిన టాప్ 10 ఎస్ యూవీల జాబితాలో టాటా పంచ్ తొలి స్థానంలో నిలిచింది. భారత్ లో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీగా పంచ్ నిలవడం ఇది వరుసగా రెండో నెల. జనవరిలో లాంచ్ అయినప్పటి నుండి పంచ్ ఎస్ యూవీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫిబ్రవరిలో భారతదేశంలో విక్రయించిన టాప్ 10 ఎస్ యూవీలు ఇవే..
టాటా పంచ్
గత రెండు నెలలుగా పంచ్ (Tata Punch) ఎస్ యూవీ టాప్ సెల్లింగ్ ఎస్ యూ వీ గా నిలుస్తోంది. టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ అతి చిన్న ఎస్ యూవీ వరుసగా రెండవ నెల భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీగా కొనసాగుతోంది. పంచ్ ఈవీ సహా ఫిబ్రవరిలో టాటా పంచ్ మోడల్స్ రికార్డు స్థాయిలో 18,438 యూనిట్లు అమ్ముడుపోయాయి. పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ రావడంతో ఫిబ్రవరి 2023 నుండి టాటా పంచ్ మోడల్ అమ్మకాలు 65 శాతం పెరిగాయి. జనవరిలో టాటా 17,978 యూనిట్ల పంచ్ ఎస్ యూవీలను విక్రయించింది.
మారుతి బ్రెజా
బ్రెజా (Maruti Brezza) ఎస్యూవీ సెగ్మెంట్లో బలమైన పోటీదారుల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో ఎస్యూవీ సెగ్మెంట్లో ఫిబ్రవరిలో మారుతి సుజుకి బ్రెజా 15,765 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో బ్రెజా సాధించిన సేల్స్ తో సమానం. ఈ ఏడాది జనవరితో పోలిస్తే బ్రెజ్జా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. మారుతి ఈ ఏడాది జనవరిలో 15,303 యూనిట్ల బ్రెజా లను విక్రయించింది.
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఫిబ్రవరిలో భారతదేశంలో విక్రయించిన టాప్ 10 ఎస్ యూవీల జాబితాలో మూడవ స్థానానికి ఎగబాకింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి వాటికి పోటీగా కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్.. ఫిబ్రవరిలో 15,276 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్ యూవీ లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే క్రెటా సేల్స్ 47 శాతం పెరిగాయి. జనవరిలో, హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసినప్పుడు, ఈ ఎస్ యూవీకి 13,212 మంది వినియోగదారులు కొత్తగా వచ్చారు.
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా నుండి ఫ్లాగ్ షిప్ కార్లలో ఒకటైన స్కార్పియో (Mahindra Scorpio) మోడల్ ఫిబ్రవరితో నాల్గవ స్థానంలో నిలిచింది. మహీంద్రా స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ ఎస్ యూవీల సేల్స్ భారీగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే, ఈ ఫిబ్రవరిలో స్కార్పియో అమ్మకాల్లో 110 శాతానికి పైగా పెరిగాయి. మహీంద్రా గత నెలలో భారతదేశం అంతటా 15,051 యూనిట్ల స్కార్పియోలను డెలివరీ చేసింది. ఫేస్ లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేసినప్పటి నుండి మహీంద్రా ఒకే నెలలో 15,000 యూనిట్లకు పైగా ఎస్ యూవీని విక్రయించడం ఇదే మొదటిసారి. జనవరిలో మహీంద్రా 14,293 యూనిట్ల ఎస్యూవీలని విక్రయించింది.
టాటా నెక్సాన్
అమ్మకాల పరంగా నెక్సాన్ (Tata Nexon) ఎస్ యూవీ ఐదో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ, ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో ఒకటిగా ఉంది. దాదాపు ఏడాది పాటు ఎస్ యూవీ రేసులో నిలకడగా ముందంజలో ఉన్న ఈ ఎస్ యూవీ అమ్మకాల సంఖ్య ఇటీవలి నెలల్లో స్వల్పంగా తగ్గింది. ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 14,395 యూనిట్ల నెక్సాన్ లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఈ ఏడాది జనవరిలో డెలివరీ చేసిన 17,182 యూనిట్లతో పోలిస్తే తగ్గాయి.
మారుతి ఫ్రాంక్స్
మారుతి నుండి వచ్చిన అతిచిన్న ఎస్ యూవీ అయిన మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) ఫిబ్రవరిలో విక్రయించిన టాప్ 10 మోడళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరిలో 13,643 యూనిట్ల ఫ్రాంక్స్ ను మారుతి విక్రయించగా, ఫిబ్రవరిలో 14,168 యూనిట్లను విక్రయించగలిగింది. వెలాసిటీ ఎడిషన్ పేరుతో ఫ్రాంక్స్ క్రాసోవర్ ప్రత్యేక ఎడిషన్ ను ఇటీవల ప్రవేశపెట్టింది.
మారుతి గ్రాండ్ విటారా
కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో హ్యుందాయ్ క్రెటాకు సమీప ప్రత్యర్థి అయిన గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) ఫిబ్రవరిలో మొత్తం జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. గత నెలలో గ్రాండ్ విటారా 11,002 యూనిట్లు అమ్ముడుపోయాయి. గ్రాండ్ విటారా ఎస్ యూవీ సేల్స్ గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 20 శాతం పెరిగాయి. అయితే, ఈ ఏడాది జనవరితో పోలిస్తే గ్రాండ్ విటారా అమ్మకాలు కొంత మేర తగ్గాయి. విటారా సేల్స్ 2024 మొదటి నెలలో 13,438 యూనిట్లుగా ఉంది.
మహీంద్రా బొలెరో
మహీంద్రా యొక్క ఐకానిక్ మరియు పురాతన మోడళ్లలో ఒకటి బొలెరో (Mahindra Bolero). గత నెలలో ఇది 10,113 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. గో-ఎనీవేర్ క్యారెక్టర్ కు ప్రసిద్ధి చెందిన ఈ ఎస్యూవీ అమ్మకాలు స్వల్పంగా మూడు శాతం పెరుగుదలతో కొనసాగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మహీంద్రా 9,782 యూనిట్ల బొలెరోలను విక్రయించింది. ఇందులో బొలెరో నియో ఎస్యూవీ కూడా ఉంది.
కియా సోనెట్
కొరియా ఆటో దిగ్గజానికి చెందిన సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ కియా సోనెట్ (Kia Sonet) ఫిబ్రవరిలో తన ప్రధాన ప్రత్యర్థి హ్యుందాయ్ వెన్యూను ఓడించగలిగింది. కియా గత నెలలో 9,102 యూనిట్ల సోనెట్ మోడల్స్ ను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏడు శాతం తగ్గింది. జనవరిలో కియా సోనెట్ ఎస్ యూవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. లాంచ్ నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో అమ్మకాలు తగ్గాయి. జనవరిలో కియా 11,530 యూనిట్ల సోనెట్ లను విక్రయించింది.
హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) ఎస్ యూవీ ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీల జాబితాలో 8,993 యూనిట్లతో 10వ స్థానంలో నిలిచింది. జనవరిలో హ్యుందాయ్ 11,831 యూనిట్ల వెన్యూలను విక్రయించింది.