Stock market holiday : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు- ఆ ఒక్క గంట మాత్రం ట్రేడింగ్..
Muhurat Trading 2024 : దీపావళి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే ముహురత్ ట్రేడింగ్ కోసం సాయంత్రం 1 గంట పాటు స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి. పూర్తి వివరాలు..
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. దీపావళి పండుగ నేపథ్యంలో, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. అందువల్ల, ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లో ఈ రోజు ఎటువంటి యాక్టివిటీలు ఉండవు. దీపాల పండుగ సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది. అయితే, శుక్రవారం సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల వరకు ఒక గంట ముహూర్త ట్రేడింగ్ 2024 సెషన్ ఉంటుంది.
కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) సెగ్మెంట్లో ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ట్రేడింగ్‌ని నిలిపివేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తిరిగి ప్రారంభిస్తారు. ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్), ఎన్సీడీఈఎక్స్ (నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగవు.
2024లో స్టాక్ మార్కెట్ సెలవులు..
2024 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. భారతీయ స్టాక్ మార్కెట్ నవంబర్‌లో రెండు పనిదినాల్లో మూసివేసి ఉంటాయి. అవి.. దీపావళి కోసం 1 నవంబర్ 2024, గురు నానక్ జయంతి కోసం 15 నవంబర్ 2024.
ఆ తర్వాత ఇక డిసెంబర్లో ఒక సెలవు ఉండనుంది. 2024 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది.
ముహురత్ ట్రేడింగ్..
స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు నవంబర్ 1, శుక్రవారం సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు ముహూర్త ట్రేడింగ్ సెషన్‌ను షెడ్యూల్ చేశాయి. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే పొజిషన్ లు ఆటోమేటిక్‌గా స్క్వేర్ ఆఫ్ అవుతాయి. ట్రేడ్ మోడిఫికేషన్ సమయం రాత్రి 7:10 గంటలకు ముగుస్తుంది.
స్టాక్ బ్రోకర్లు దీపావళిని తమ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా చూస్తారు. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ కాలంలో స్టాక్స్ కొనుగోలును రాబోయే సంవత్సరానికి శ్రేయస్సును ఆహ్వానించే మార్గంగా చూస్తారు. ట్రేడర్లు తమ పోర్ట్ ఫోలియోలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేయడానికి, కొత్త సెటిల్మెంట్ ఖాతాలను తెరవడానికి దీపావళి సమయాన్ని ఎన్నుకుంటారు. అందుకే ముహురత్ ట్రేడింగ్‌ని నిర్వహిస్తారు.
స్టాక్ మార్కెట్లు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్లో నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 24,205 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 79,389 వద్ద, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 251 పాయింట్ల నష్టంతో 51,555 వద్ద ముగిశాయి.
వచ్చే మంగళవారం అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితితో సతమతమవడంతో గురువారం గ్లోబల్ షేర్లు భారీగా క్షీణించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చులను పెంచుతామని ఫేస్బుక్ యజమాని మెటా ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్ హెచ్చరించడంతో సెంటిమెంట్లు క్షీణించాయి.
సంబంధిత కథనం