JioHotstar domain: ‘రూ.1 కోటి ఇస్తే జియో హాట్ స్టార్ డొమైన్ ఇస్తా’: రిలయన్స్ కు టెక్కీ ఆఫర్
జియో, హాట్ స్టార్ ల విలీనం వార్తలు బయటకు రాగానే ఆ డొమైన్ ను కొనుగోలు చేసిన ఒక గుర్తు తెలియని టెక్కీ.. ఆ డొమైన్ ను ఇవ్వడానికి రూ. 1 కోటి డిమాండ్ చేస్తున్నాడు. అయితే, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. ఆ యాప్ డెవలపర్ పై కేసు పెడతామని హెచ్చరించింది.
జియోసినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతిపాదిత విలీనాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ జియో హాట్ స్టార్ అనే డొమైన్ నేమ్ ను కొనుగోలు చేశాడు. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఆ డొమైన్ ను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ టెక్కీ సందేశం పంపారు. అయితే, ఇప్పుడు ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిలయన్స్ బెదిరించినట్లు తెలుస్తోంది.
కేంబ్రిడ్జ్ లో చదువుకోవాలి..
గత ఏడాది జియోహోట్ స్టార్ ల విలీనం గురించి మొదట విన్నప్పుడు జియో (jio)హోట్ స్టార్ డొమైన్ నేమ్ ను కొనుగోలు చేసినట్లు సదరు డెవలపర్ నుంచి వచ్చిన సందేశంతో కూడిన సాధారణ ల్యాండింగ్ పేజీ ఉంది. ‘‘ఈ డొమైన్ అందుబాటులోకి రావడం చూసినప్పుడు, నా పరిస్థితులు చక్కబడతాయని నేను భావించాను. ఈ డొమైన్ కొనాలనే నా ఉద్దేశానికి చాలా చిన్న కారణముంది. ఈ విలీనం జరిగితే, ఈ డొమైన్ ను అమ్మి నేను కేంబ్రిడ్జ్ లో చదువుకోవాలనే నా కలను నెరవేర్చుకోగలను" అని ఆ టెక్కీ సందేశంలో పేర్కొన్నారు.
రూ. 1 కోటి ధర ట్యాగ్
ఆ డెవలపర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేయాలనుకుంటున్న కోర్సుకు 93,345 పౌండ్లు (రూ.1.01 కోట్లు) ఖర్చు అవుతుందని, అందుకనే అతడు ఆ మొత్తాన్ని డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఆ డొమైన్ పేజీలో అక్టోబర్ 24న మరో అప్ డేట్ చేశారు. ‘‘రిలయన్స్ సంస్థలో ఏవీపీ, కమర్షియల్స్ గా ఉన్న అంబుజేష్ యాదవ్ ను 93,345 పౌండ్ల కోసం అభ్యర్థన చేయడమైంది. ఇది కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం ట్యూషన్ ఫీజు’’ అని ఆ అప్ డేట్ లో ఉంది.
రిలయన్స్ ఆగ్రహం
అయితే, ఆ యాప్ డెవలపర్ పై కోర్టులో కేసు వేస్తామని రిలయన్స్ హెచ్చరించింది. రూ. 1 కోటి ఇవ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా ఆ టెక్కీ వెల్లడించారు. ‘‘రిలయన్స్ చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుంది. నా దయగల అభ్యర్థనను వారు పునఃపరిశీలిస్తారని నేను ఆశిస్తున్నాను. వారు నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి మాటలు పంపిన వారందరికీ ధన్యవాదాలు. రిలయన్స్ కు వ్యతిరేకంగా నిలబడే శక్తి నాకు లేదు’’ అని ఆ డెవలపర్ పేర్కొన్నారు.
అన్నీ న్యాయంగానే..
అయితే, తాను ఎలాంటి ట్రేడ్ మార్క్ లేదా కాపీరైట్లను ఉల్లంఘించలేదని ఆ డెవలపర్ పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయవాదులు తనకు సాయం చేయాలన్నారు. ‘‘2023 లో నేను దీనిని కొనుగోలు చేశాను. అందులో ఎంటువంటి ట్రేడ్ మార్క్ ఉల్లంఘన లేదు. ఎందుకంటే ఆ సమయంలో జియో హాట్ స్టార్ ఉనికిలోనే లేదు. నేను కొనుగోలు చేసినప్పుడు జియో హాట్ స్టార్ డొమైన్ ఏ సంస్థకు ట్రేడ్ మార్క్ గా లేదు. కొన్ని గంటల్లో నేను ఈ డొమైన్ ను కోల్పోవచ్చు. ఎవరైనా న్యాయనిపుణులు సహాయం చేయగలిగితే, నేను కృతజ్ఞుడిని’’ అని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ విషయంపై రిలయన్స్ (reliance)నుంచి ఎటువంటి స్పందన రాలేదు.