Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మంచి రోజులు.. సెయిల్‌లో విలీనం చేసేందుకు అడుగులు!
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని వందల రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయబోతున్నారని సమాచారం.
విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడకు ఇదే సరైన నిర్ణయం అని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతపడి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేలా ప్లాన్ చేస్తున్నారు.
1300 రోజుల పోరాటం..
దాదాపు 1300 రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 'విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఎన్‌ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా.. పరిష్కారం ఆలోచిస్తున్నాం' అని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి భరోసా..
ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కూడా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నులకు పెంచాలని ఆలోచిస్తోంది. సెయిల్‌కు సంబంధించి ఒక మిలియన్ ఉక్కు ఉత్పత్తి అదనంగా చేయాలంటే.. ఏడేళ్ల సమయం పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేసుకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో.. 27.5 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడి అవసరం లేదు..
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ విలీనంతో కనీసం రూ. 30 వేల కోట్లు ఆదా ఆవుతాయని.. వెంటనే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి పెంచడం ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
స్టీల్ ప్లాంట్‌కు ఆదాయం..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టే అంశాలపైనా కేంద్రం ఫోకస్ పెట్టింది. బ్యాంకు రుణం సమకూర్చడం, స్టీల్ ప్లాంట్ భూముల విక్రయం వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎస్‌బీఐతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. రుణాలు అందించడంపై చర్చించారు. అటు ఉక్కు పరిశ్రమ భూములను ఇతర సంస్థలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఆదాయం వస్తే.. స్టీల్ ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయొచ్చని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.