New electric scooters : బజాజ్ ఆటో నుంచి కేటీఎం వరకు.. అందరి ఫోకస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపైనే!
New electric scooters : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
New electric scooters in India : ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. 2 వీలర్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు సైతం ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు ప్రముఖ ఆటోసంస్థలు దృష్టిసారించాయి. బజాజ్ ఆటో నుంచి కేటీఎం వరకు.. అనేక సంస్థలు ఈవీలపై ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
బజాజ్ ఆటో నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..
బజాజ్ ఆటో నుంచి స్వింగర్, జీనీ పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబోతున్నట్టు మార్కెట్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రైడ్మార్క్స్ వెబ్సైట్లో స్వింగర్, జీనీ పేర్లు మే నెలలో కనిపించాయి. వీటిని బజాజ్ ఆటో ట్రైడ్మార్క్ చేసుకున్నట్టు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ ఇవి ఎలక్ట్రిక్ స్కూటర్లని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి.
బజాజ్ ఆటోకు ప్రస్తుతం చేతక్ ఈవీ ఉంది. ఇక స్వింగర్, జీనీ కూడా చేతక్ సరసన చేరే అవకాశం ఉంది.
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఓలా ఎలక్ట్రిక్. ఈ సంస్థ నుంచి త్వరలోనే ఓ ఈవీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్‌పై అందరిలో ఆసక్తి పెరిగింది. జులైలో కొత్త ప్రాడక్ట్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో.. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ప్రాడక్ట్స్ ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 1.30లక్షలు, రూ. 1.40లక్షలు, రూ. 99,999. మరి జులైలో కొత్త ప్రాడక్ట్‌ను చూపిస్తారా.. లేక ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? అన్న విషయాన్ని వచ్చే నెలలో చెబుతారా? అన్నది వేచిచూడాలి.
సింపుల్ ఎనర్జీ నుంచి ఈవీలు..
ఇండియా మార్కెట్లోకి త్వరలోనే 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది సింపుల్ ఎనర్జీ సంస్థ. ఇవి.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ 1 కన్నా తక్కువ ధరలో ఉంటాయని వెల్లడించింది. ప్రస్తుతం సింపుల్ 1 ఎక్స్‌షోరూం ధర రూ. 1.45లక్షలు- రూ. 1.5లక్షల మధ్యలో ఉంది.
ఈ కొత్త ఈవీల్లో బ్యాటరీ ప్యాక్ చిన్నగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా రేంజ్ కూడా తగ్గొచ్చు. తక్కువ ధరతో వస్తుండటంతో ఈ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫీచర్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. లుక్ అట్రాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంది.
హోండా నుంచి కూడా..!
హోండా సంస్థ ఇండియా 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు స్కూటర్లకు పేటెంట్లు ఫైల్ చేసింది. వీటి పేర్లు డాక్స్ ఈ, జూమర్ ఈ అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల వర్షెన్లు మాడెర్న్గా ఉంటాయని సమాచారం. సైజు పరంగా రెండు చిన్నవే! అయితే వీటిల్లో బాష్ హబ్ మోటార్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80కి.మీల రేంజ్ రావొచ్చు. 25కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ఉండొచ్చు.
కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్..
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం.. ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటలీ మిలాన్‌లో ఈ ఏడాదిలో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీనిని.. సంస్థ ప్రదర్శిస్తుందని తెలుస్తోంది. ఇది జరిగిన కొన్ని నెలలకే.. కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇండియాలో దీనిని బజాజ్ ఆటో రూపొందిస్తుందని తెలుస్తోంది. ఇండియాలో తయారు చేసి అంతర్జాతీయ విపణిలోకి ఎగుమతి చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు సమాచారం
సంబంధిత కథనం