Isha Ambani: ‘‘ అవును.. అమ్మ లాగే నేను కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చాను’’- ఇషా అంబానీ
Isha Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ తన సంతానం గురించి ఆసక్తికర విశేషాలను ప్రముఖ మేగజీన్ ‘వోగ్’ తో పంచుకున్నారు. తన తల్లి నీతా అంబానీ తరహాలోనే తాను కూడా ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చానని ఆమె వెల్లడించారు.
Isha Ambani: కృత్రిమ గర్భధారణ ద్వారా తాను కవలలకు జన్మనిచ్చానని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ వెల్లడించారు. స్వయంగా వ్యాపారవేత్త అయిన ఇషా అంబానీ తన పిల్లలను గర్భం ధరించడానికి ఐవిఎఫ్ ను ఎంచుకోవడంపై తొలిసారి నోరు విప్పారు. తన తల్లి నీతా అంబానీ కూడా ఐవీఎఫ్ ద్వారానే కవలలకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నీతా అంబానీకి కూడా ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ కవలలుగా ఐవీఎఫ్ ద్వారానే జన్మించారు.
అపోహలు తొలగాలి..
ఐవీఎఫ్ చాలా సాధారణ విషయమని ఇషా అంబానీ వ్యాఖ్యానించారు. దాని గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నా కవల పిల్లలు ఐవిఎఫ్ ద్వారా జన్మించారు. అది చాలా సాధారణ విషయం. ఆ విషయాన్ని వెల్లడించడానికి ఎవరూ సిగ్గు పడాల్సిన అవసరం, ఆ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కానీ లేదు. నిజానికి ఇది చాలా కష్టమైన ప్రక్రియ. మీరు దీన్ని ఫాలో అవుతున్నప్పుడు, మీరు శారీరకంగా అలసిపోతారు’’ అని ఇషా అంబానీ వివరించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉందని, దాన్ని పిల్లల్ని కనడానికి ఎందుకు ఉపయోగించకూడదని ఇషా ప్రశ్నించారు. అవసరమైనప్పుడు ఐవీఎఫ్ ను ఉపయోగించాలని ప్రోత్సహించాలి. దీనిపై మహిళల్లో అవగాహన పెంపొందించాలి’ అన్నారు. ఇషాకు ఆనంద్ పిరమల్ తో డిసెంబర్ 12, 2018న ముంబైలో వివాహం జరిగింది. ఈ జంటకు కవల పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు కుమార్తె, మరొకరు కుమారుడు.
ఐవిఎఫ్ అంటే ఏమిటి?
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది ఒక వైద్య విధానం. ఈ విధానంలో ఫలదీకరణం మహిళ శరీరంలో కాకుండా ప్రయోగ శాలలో జరుగుతుంది. ఇది సంతానోత్పత్తి సమస్యలు ఉన్న జంటలకు ఎంతో సహాయపడే ప్రక్రియ. రాధికా మర్చంట్ తో తన తమ్ముడు అనంత్ అంబానీ వివాహం కోసం ఇషా మరియు ఆమె కుటుంబం ఇప్పటివరకు సంవత్సరం పొడవునా వార్తల్లో నిలిచింది. జులైలో ముంబైలో వీరి వివాహం జరగనుంది.