YSRCP : ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై దిశానిర్దేశం..! రేపు 'వైసీపీ ప్రతినిధుల సభ
YSRCP News: ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే కీలక భేటీలను నిర్వహించిన ఆయన.. పార్టీ అభ్యర్థుల విషయంలోనూ పలు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో…ఈనెల 9వ తేదీన పార్టీ ప్రతినిధుల సభను తలపెట్టింది. నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడటంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు.
YSRCP : గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలు ఉంటాయనే చర్చ జోరుగా జరిగినప్పటికీ… అలాంటి పరిస్థితులు ఏం లేవంటూ అధికార వైసీపీ చెప్పుకుంటూ వస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత… ఏపీలో సమీకరణాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదిపే పనిలో పడింది. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. దీనిపై పార్టీ అధినేత జగన్… స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే… సదరు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్లపై కూడా కసరత్తు ప్రారంభించిన వైసీపీ అధినాయకత్వం…. మరో కీలకమైన భేటీని తలపెట్టింది.
8 వేల మందితో పార్టీ ప్రతినిధుల సభ..!
అక్టోబరు 9వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పార్టీ ప్రతినిధుల సభను నిర్వహిస్తోంది వైసీపీ. ఇందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ హాజరుకానున్నారు. దాదాపు 8 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఉద్దేశించి… జగన్ మాట్లాడటంతో పాటు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నేతలతో పాటు కేడర్ ను సిద్ధం చేసేలా ప్రసగించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో "వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్' కార్యక్రమంపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.
ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి చేరుకోనున్నారు వైెఎస్ జగన్. మధ్యాహ్నం వరకు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉండగా….మధ్యాహ్నం తర్వాత జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు.