YS Jagan : మీది రెడ్ బుక్ అయితే మాది గుడ్ బుక్- వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. అయితే రెడ్‌బుక్ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారన్నారు. అయితే తాము గుడ్ బుక్ పెట్టామని, పార్టీ కోసం కష్టపడిన వాళ్ల పేర్లు అందులో రాస్తామన్నారు.
ఏపీలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు, అధికారుల కోసం రంగు రంగుల బుక్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేశ్... గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్రత్యర్థుల కోసం 'రెడ్ బుక్' పెట్టుకున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అధికారులను, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా ఓ బుక్ పెడతామని ప్రకటించారు.
మాది గుడ్ బుక్
బుధవారం మంగళగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ... గ్రామ, వార్డు స్థాయిలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉండాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారన్నారు. రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదని, మనం గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
రెడ్‌బుక్ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అన్యాయంగా వ్యవహరించే వారి పేర్లను, అధికారుల పేర్లను రాసుకుంటున్నారన్నారు. అయితే తాము గుడ్‌బుక్ రాసుకోవడం మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను అందులో రాసుకుంటున్నామన్నారు. వారికి తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మంగళగిరి ఇన్ ఛార్జ్ గా వేమారెడ్డి
మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, వైసీపీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నేతలకు వైఎస్ జగన్ సూచించారు. అధికార దుర్వినియోగంతో వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారికి భరోసా ఇచ్చి, పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు. అన్నింటికీ తట్టుకుని కార్యకర్తలకు అండగా నిలబడే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇన్‌ఛార్జ్ గా నియమించామన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని జగన్ ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రతి ఇంటికీ మనం మంచిచేశామని, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలండర్ విడుదల చేసేవాళ్లమన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందించే వాళ్లామన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందించామన్నారు.
కోవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఏ రోజు కూడా సాకులు చెప్పకుండా పథకాలు అమలు చేశామన్నారు. గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపర్చామన్నారు. స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చామని జగన్ తెలిపారు. వివక్ష చూపకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు.
సంబంధిత కథనం