YSR Kalyanamastu: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల చేసిన సిఎం… తల్లుల ఖాతాల్లోకి నగదు..-ysr kalyanamastu shaditofa fund release today cash into mothers accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Kalyanamastu: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల చేసిన సిఎం… తల్లుల ఖాతాల్లోకి నగదు..

YSR Kalyanamastu: వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల చేసిన సిఎం… తల్లుల ఖాతాల్లోకి నగదు..

Sarath chandra.B HT Telugu
Feb 20, 2024 12:54 PM IST

YSR Kalyanamastu: నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అందిస్తోన్న వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాల్లో ఆరో విడత నిధులను నేడు సిఎం జగన్ విడుదల చేశారు.

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన సిఎం జగన్
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు విడుదల చేసిన సిఎం జగన్

YSR Kalyanamastu: పేద కుటుంబాల్లో పిల్లల్ని చదువలకు మరింత ఊతమిచ్చేలా అమలు చేస్తున్న.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా Shadithofa పథకాల్లో భాగంగా నిధులను నేడు విడుదల చేశారు.

2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం YS jagan క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

దేవుడి దయతో ఈరోజు మరో మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 10,132 మంది జంటలకు మంచి చేసే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు సిఎం జగన్ చెప్పారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా కార్యక్రమంలో... పిల్లలను చదవించే విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, ఆ చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన పెట్టామని తెలిపారు.

ఈ స్కీంలో అర్హత రావాలంటే, ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి కాబట్టి పిల్లలను చదివించడానికి ఈ కార్యక్రమం ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంటుందన్నారు. రెండో నిబంధన ప్రకారం.... కచ్చితంగా వధువుకు 18సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు వయస్సు ఉండాలన్నారు.

15,16 సంవత్సరాలకే పదోతరగతి పూర్తయిన, 18 సంవత్సరాల కంటే ముందు పెళ్లి జరిగితే ఈ స్కీంకు అర్హత రాదు. మరోవైపు ఇంటర్‌మీడియట్‌ చదువుకు ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద సాయం చేస్తుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారు. ఇంటర్‌ పూర్తయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.

పిల్లల బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులకోసం వసతి దీవెన కార్యక్రమం కింద డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి కోర్సులు చదివే వారికి ఆ విద్యాసంవత్సరంలో ప్రతి ఏప్రిల్‌లో ఒక్కోక్కరికి రూ.20వేల వరకు ఇస్తున్నాం. ఈ రెండు స్కీంలు ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి అమ్మాయి, అబ్బాయి గ్రాడ్యుయేట్స్‌ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతున్నామని చెప్పారు.

కుటుంబంలో తల్లి చదువుకుని ఉంటే ఆ తర్వాత తరంలో వచ్చే పిల్లలు ఆటోమేటిక్‌గా చదువుల బాటపడతారు. భవిష్యత్‌లో కుటుంబాల తలరాతలు మారాలన్నా, మంచి జీతాలతో ఉద్యోగాలు రావాలన్నా.. మంచి చదువులు మన చేతుల్లో ఉంటే, మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ.. గత ప్రభుత్వ హయాంలో వలె ఈ పథకాన్ని ఏదో నామ్‌కే వాస్త్‌ ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా... ప్రతి క్వార్టర్‌ పూర్తయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్‌ చేసి తర్వాత ఇస్తున్నామని జగన్ చెప్పారు.

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో సర్టిఫికేట్‌ తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. నేరుగా మన గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేటట్టు మార్పు చేశాం. ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ... ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించేలా సచివాలయం వరకూ తీసుకునిపోయామన్నారు.

కళ్యాణమస్తు, షాదీతోఫా నిధుల విడుదల…

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేలా వారికి అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా ఆర్ధిక సాయం అందిస్తున్నారు. మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు "వైఎస్సార్ షాదీ తోఫా" ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళుగా వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించారు. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. ప్రభుత్వం 1 వ తరగతి నుండి అప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి ammavodi సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుందని అంచనా వేశామని సిఎం జగన్ చెప్పారు. .

కళ్యాణమస్తు, షాదీ తోఫాలలో వధువుకు 18 ఏళ్ళు, వరునికి 21 ఏళ్ళ వయో పరిమితి ఉండటంతో ఇంటర్‌ తర్వాత పెళ్లి చేయకుండా ప్రభుత్వం ఇచ్చే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా ఏటా రూ. 20,000 వరకు ఆర్ధిక సాయం ఎలాగూ అందిస్తుండడంతో పాటు కళ్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలు కూడా ఉండడంతో వారు గ్రాడ్యుయేషన్ లో చేరుతారని కనీసం డిగ్రీ పూర్తి చేస్తారన్న నమ్మకంతో పాటు బాల్య వివాహాలకు కూడా అడ్డుకట్ట వేయగలుగుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.

వైఎస్సార్ కళ్యాణమస్తు/ వైఎస్సార్ షాదీ తోఫాపథకం ప్రారంభించినప్పటి నుంచి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి క్రింద ఇప్పటి వరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 427.27 కోట్లు జమ చేశారు.

ఎస్సీలకు గత ప్రభుత్వంలో రూ. 40,000 అందిస్తే ఇప్పుడు రూ. 1,00,000కు పెంచారు. ఎస్సీలలో (కులాంతర వివాహం) గత ప్రభుత్వంలో రూ. 75,000 సాయం ఉంటే ఇప్పుడు ఇప్పుడు రూ. 1,20,000 అందిస్తున్నారు. ఎస్టీలకు గత ప్రభుత్వం రూ. 50,000 అందిస్తే వారికి కళ్యాణమస్తులోరూ.1,00,000 చెల్లిస్తున్నారు.

ఎస్టీలలో కులాంతర వివాహాలకు సాయం రూ. 75,000 ఉంటే ఇప్పడు దానిని రూ. 1,20,000 పెంచారు. బీసీలకు గత ప్రభుత్వంలో రూ. 35,000 సాయం చేస్తే ఇప్పుడు అది రూ. 50,000కు చేరింది. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం రూ. 50,000ను రూ. 75,000కు పెంచారు.

మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషా గత ప్రభుత్వంలో రూ.50,000గా సాయం ఉంటే దానిని లక్షకు పెంచారు. విభిన్న ప్రతిభావంతులకు రూ. 1,50,000 అందిస్తున్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 40,000 చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు విడతల్లో 56,194 లబ్దిదారులకు మొత్తం రూ. రూ.427.27 కోట్లు చెల్లించారు.

Whats_app_banner