YS Sharmila : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ - బీజేపీ బానిసలంటూ షర్మిల ఫైర్-ys sharmila slams chandrababu and pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ - బీజేపీ బానిసలంటూ షర్మిల ఫైర్

YS Sharmila : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్ - బీజేపీ బానిసలంటూ షర్మిల ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 26, 2024 09:51 PM IST

YS Sharmila Comments: వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ మూడు పార్టీలు కూడా బీజేపీకి బానిసలుగా మారాయంటూ విమర్శలు గుప్పించారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల (Twitter)

YS Sharmila : బీజేపీకి రాష్ట్రంలోని మూడు పార్టీలు బానిసలుగా మారాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. శుక్రవారం గుంటూరులో మాట్లాడిన ఆమె… B అంటే బాబు J అంటే జగన్, P అంటే పవన్ అంటూ సరికొత్త అర్థం చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే ఒక్క మాట ఎదురు మాట్లాడకుండా ఓటు వేస్తారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన ఎక్కడా లేదని విమర్శించారు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్ఆర్ పాలన కాదని హితవు పలికారు.

“రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా మరిచారు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు.గుంటలూరు గుంటూరు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి.దేశంలో రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే పోలవరం పూర్తి అవుతుంది.కాంగ్రెస్ కి ఓటు వేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది” అని వైఎస్ షర్మిల అన్నారు.

వైఎస్ షర్మిలా రెడ్డినే….

పులి కడుపున పులే పుడుతుందన్నారు వైఎస్ షర్మిల. తాను వైఎస్ఆర్ రక్తమని.. ఎవరు అవునన్నా కాదన్నా తాను YS షర్మిలా రెడ్డినే అని స్పష్టం చేశారు. “విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కానే కాదు. వైఎస్ఆర్ పాలనకు జగన్ అన్న గారి పాలనకు చాలా వ్యత్యాసం ఉంది.YSR కి,జగన్ అన్నకు ఆకాశం,భూమికి ఉన్నంత తేడా ఉంది. YSR జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు జలమయం చేశారు. పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడేసారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చినా,జగన్ అన్న గారు వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇక ప్రత్యేక హోదా పై బాబు,జగన్ అన్న మాట్లాడింది లేదు.బీజేపీతో దోస్తీ కోసం బాబు,జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. హోదా గురించి రాగం తీసి ,నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ కి బానిసలుగా మారారు. హోదా కాదు కదా... కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు.రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే వీళ్ళతో కాదు .. రాష్ట్రంలో ,కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది”అని వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు.

Whats_app_banner