YS Sharmila: వాళ్లు బ్రతిమాలితేనే పాదయాత్ర చేశా.. కాదని విజయమ్మతో చెప్పించాలన్న షర్మిల..-sharmila says that she did the padayatra for jagan on family members request ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila: వాళ్లు బ్రతిమాలితేనే పాదయాత్ర చేశా.. కాదని విజయమ్మతో చెప్పించాలన్న షర్మిల..

YS Sharmila: వాళ్లు బ్రతిమాలితేనే పాదయాత్ర చేశా.. కాదని విజయమ్మతో చెప్పించాలన్న షర్మిల..

Sarath chandra.B HT Telugu
Jan 26, 2024 01:12 PM IST

YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుందని షర్మిల ప్రశ్నించారు. మనవడు రాజారెడ్డికి ఆపేరు పెట్టింది YSR అని అన్నారు. నిజం ఎప్పుడు నిలకడగా తెలుస్తుందన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.

పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YS Sharmila: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పిసిసి అధ్యక్షురాలు షర్మిల జెండా ఎగురవేశారు. రాష్ట్ర అధ్యక్షురాలి తొలిసారి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి, జెడి శీలం తదితరులు పాల్గొన్నారు.

yearly horoscope entry point

తన దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారని, తన గురించి విచిత్రంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర తాను చేశానని, స్వార్థం కోసం పాదయాత్ర చేశానని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జైల్లో అధికారి చెప్పాడంటున్నారని, దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా ? అని షర్మిల ప్రశ్నించారు. ఆ విషయంపై దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? అని నిలదీశారు. ఆ రోజు ఏం జరిగిందో తాను ప్రమాణం చేసి చెప్పగలనని, తనకు తానుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదన్నారు.

నన్ను అడిగితే మాత్రమే పాదయాత్ర చేశానన్నారు. అక్రమ సంపాదన కోసం స్కెచ్ వేశామని చెబుతున్నారని, జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మతో కలిసి ఆయన దగ్గరకు వెళ్ళానని చెప్పారు. తన భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదన్నారు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నానని, దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించాలన్నారు.

వైఎస్సార్‌కు జగన్‌కు పోలిక లేదు…

వైఎస్సార్‌ను అభిమానించే వాళ్ళు ఆయన ఆశయాలను కూడా కాపాడాలని, విమర్శలు చ చేయడం తన ఉద్దేశ్యం కాదని, వైఎస్సార్ పాలనకు, జగనన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.

వైఎస్సార్ జలయజ్ఞంపై ఎంతో దృష్టి పెట్టారని, వైఎస్సార్ కాలంలో బడ్జెట్ లో దాదాపు 15 శాతం నిధులు కేటాయించారని, అందుకే ఆనాడు ప్రాజెక్ట్ లు నిజ రూపం దాల్చాయన్నారు. వైఎస్సార్ హయాంలో పోలవరం పనులు 32 శాతం పనులు పూర్తి చేశారని, కుడి కాల్వ మొత్తం పూర్తి చేశారని, ప్రాజెక్టు మీద రూ. 5 వేలకోట్లు ఖర్చు చేశారన్నారు.

వైఎస్సార్ మరణం తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పక్కన పడిందన్నారు. చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

వైఎస్సార్ పోలవరానికి 17 శాతం నిధులు కేటాయిస్తే జగనన్న గారు కేవలం 2.5శాతం ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు పొంతన లేదు.. పోలిక లేదన్నారు. వైఎస్సార్‌కి, జగన్‌కి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉందన్నారు.

వైఎస్సార్ హయాంలో రైతు రారాజుగా ఎన్నో పథకాలు పెట్టాడని, జగన్ హయాంలో వ్యవసాయం అంటే దండుగగా మారిందన్నారు. పంట వేసుకోవడం దండుగ అన్నట్లు తయారయ్యిందన్నారు.

ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుందని వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టారని, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పత్తాకు లేదన్నారు.

ఆంధ్రాలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై బాబు, జగన్ మాట్లాడింది లేదని ఆరోపించారు.

బీజేపీతో దోస్తీ కోసం బాబు, జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని, హోదా గురించి రాగం పాడి,నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు కూడా బీజేపీ కి బానిసగా మారారని ఆరోపించారు.

25 మంది ఎంపీలను ఇస్తే...హోదా తెస్తా అన్నారని, నిజమే అనుకొని అధికారం ఇస్తే...ఒక్కరోజు హోదా పై మాట్లాడింది లేదన్నారు. హోదా కాదు కదా... కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని ఆరోపించారు.

ఒకరు ఒక రాజధాని, మరొకరు మూడు రాజధానులు అని కాలం గడిపారని, ఇప్పుడు మనకు ఎన్ని రాజధానులు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పోలవరం, హోదా , రాజధాని ఏమి లేవని ఉన్నవన్నీ అప్పులు మాత్రమే అన్నారు. విజయవాడలో, విశాఖలో కనీసం మెట్రో రైల్ కూడా లేదన్నారు.

25 మంది ఎంపీలు ఉన్నా .. 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారు అంటే..గుండు సున్నా అన్నారు. స్వలాభం కోసం ..రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, బీజేపీ కి బి టీమ్ లా మారారని షర్మిల ఆరోపించారు. ఏపీలో ఒక్క సీట్ లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుందని, వీళ్ళు బానిసలు కాదు..కట్టు బానిసలని మండిపడ్డారు.

వైసీపీ వాళ్లు బానిసలయ్యింది చాలక రాష్ట్ర ప్రజలను బానిసలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే వీళ్ళతో కాదని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పోలవరం పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ రావాలని, హోదా కోసం ఇప్పటికే రాహుల్ గాంధీ తొలి సంతకం హామీ ఇచ్చారని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తా మన్నారు.

కాంగ్రెస్‌లోకి దుట్టా….

APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా హనుమాన్ జంక్షన్ లో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్ర రావుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. దుట్టా రామచంద్ర రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

దుట్టా రామచంద్ర రావు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని షర్మిల ప్రకటించారు. దుట్టా నాన్నకి అత్యంత సన్నిహితుడని, తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో హనుమాన్‌ జంక్షన్‌లో దుట్టా ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.

పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల.. వైఎస్‌ఆర్‌ సన్నిహితులు, గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన నాయకులను కలుస్తున్నారు. s

Whats_app_banner