YS Sharmila : వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళులు.. పార్టీ విలీనంపై ఏమన్నారంటే?-ys sharmila pays tribute to his late father rajasekhara reddy on his 14th death anniversary ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళులు.. పార్టీ విలీనంపై ఏమన్నారంటే?

YS Sharmila : వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళులు.. పార్టీ విలీనంపై ఏమన్నారంటే?

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 02, 2023 01:55 PM IST

YSR 14th Death Anniversary : వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై కూడా స్పందించారు.

వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల
వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల

YS Rajasekhara Reddy Death Anniversary : వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చారు వైఎస్ షర్మిల. శనివారం ఉదయమే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల... వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు తండ్రి జ్ఞాపకలను గుర్తు చేసుకున్నారు.

మహానేత వైఎస్ఆర్ మన వద్ద నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు గడిచిపోయిందని అన్నారు వైఎస్ షర్మిల. అయినప్పటికీ ఆయన తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారని చెప్పారు. "అద్భుతైన పథకాలు ప్రతి ఇంటికి అందటంతో కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసి రైతుల కష్టాలను తీర్చాడు. రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. కేవలం ఒక్కవర్గానికి కాదు వడ్డీలేని రుణాలతో మహిళల వెలుగులు నింపారు. విద్యార్థుల ఉన్నత విద్యకోసం ఫీజు రియంబర్స్ మెంట్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి జీవం పోశారు. 46 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మింపజేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మంచి చేసిన నేత వైఎస్ఆర్. అలాంటి నేత మరణం తట్టుకోలేక ఎంతో 700 మంది ప్రాణాలు వదిలారు. ఆ కుటుంబాలకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఎప్పుడూ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

ఇది సరైన వేదిక కాదు -వైఎస్ షర్మిల

ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన షర్మిల... కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీను కలిశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే చర్చ జోరుగా వినిపించింది. రేపోమాపో ప్రకటన ఉంటుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై మీడియా మిత్రులు ప్రశ్నలు అడగ్గా... వైఎస్ షర్మిల ఆచితూచి స్పందించారు. విలీనంపై స్పందించేందుకు ఇది సరైన వేదిక కాదని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఫలితాల తర్వాత డీకే శివ కుమార్ తో భేటీ అయ్యారు షర్మిల. అప్పట్నుంచి వైఎస్ఆర్టీపీ విలీనంపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు వైఎస్ షర్మిల. విలీనం చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే గత కొంతకాలంగా కాంగ్రెస్ లోని కీలక నేతలతో షర్మిల టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆగష్టు 11న రాహుల్‌ గాంధీతో కూడా షర్మిల భేటీ అయ్యారు. అంతకు ముందు రెండు సార్లు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె.శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ప్రచారం మొదలైంది. వాటిని ఆమె తోసిపుచ్చినా ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. రెండు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన షర్మిల… సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల… చాలా విస్తృతంగా తమ చర్చలు జరిగినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైందని కామెంట్స్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ విలీనంపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

Whats_app_banner