YS Jagan On CM CBN : నియంతలా మా పార్టీ ఆఫీసును కూల్చివేయించారు - బెదిరింపులకు తలొగ్గేది లేదన్న జగన్
YS Jagan On CM Chandrababu : వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదన్నారు.
YS Jagan On CM Chandrababu : తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేటంపై ఆ పార్టీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు.
ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయన్న జగన్... ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో చంద్రబాబు రక్తాన్ని పారిస్తున్నారని ఆరోపించారు.
ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని జగన్ ఆక్షేపించారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని, వెన్నుచూపేది అంతకన్నా లేదన్నారు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తామని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరారు.
అనుమతులు లేవంటున్న ప్రభుత్వం….!
వైసీపీ ఆఫీస్ నిర్మాణానికి అనుమతులు లేవని ప్రభుత్వం చెబుతోంది. తాడేపల్లి సమీపంలోని సీతానగరం పరిధిలో బోట్ యార్డ్ లో సుమారు రూ.50 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల స్థలంలో ఆఫీస్ నిర్మాణం చేపట్టారని పేర్కొంది. వైసీపీ ఆఫీస్ నిర్మాణం కోసం లీజుకు 2023లో రహస్యంగా జీఓ నెం.52 జారీ చేశారని గుర్తించింది.
జీఓని అడ్డం పెట్టుకుని నిర్మాణాలు చేస్తుందని… నిర్మాణాలకు ప్లానింగ్, కార్పొరేషన్ పూర్తిస్థాయి అనుమతులు లేవని వాదిస్తోంది. వైసీపీ ఆఫీస్ నిర్మాణంతో సీడ్ యాక్సిస్ రోడ్డు పొడిగింపును అడ్డుకునే ప్రయత్నం ఉంటుందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అమరావతి నిర్మాణానికి ఇదే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావించిన సర్కార్… భారీ పోలీస్ బందోబస్తు నిర్మాణాలను కూల్చివేసింది.
తెల్లవారు జామున 5.30 గంటల నుంచి భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చి వేతలు ప్రారంభమయ్యాయి. బుల్డోజర్లు, పొక్లెయినర్లను ఉపయోగించి భవన కూల్చివేత పనులు మొదలు పెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించారు. అయితే నిర్మాణం అక్రమం అంటూ ఇటీవలి సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూల్చివేతకు సీఆర్‌డీఏ తయారు చేసిన ప్రాథమిక ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వం ఏకపక్షంగా తమ పార్టీ ఆఫీస్ ను కూల్చివేసిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వాన్నా టార్గెట్ చేస్తూ… మాజీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. విధ్వంసక పాలన ఎవరిదంటూ ప్రశ్నిస్తున్నారు.