YS Jagan : మళ్లీ జనంలోకి జగన్ - 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!-ys jagan key meeting with ysrcp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : మళ్లీ జనంలోకి జగన్ - 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!

YS Jagan : మళ్లీ జనంలోకి జగన్ - 'ఓదార్పు యాత్ర' చేసే ఆలోచన, ప్లాన్ ఇదే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 20, 2024 03:27 PM IST

YS Jagan Latest News: వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ రాష్ట్రంలో మెజార్టీతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడూ చూడని విధంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారని.. వారికి భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

Jagan Meeting with YSRCP Leaders : జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మాట్లాడిన జగన్… నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులపై చర్చించారు. అయితే వారందరికీ భరోసా ఇచ్చేలా స్వయంగా జగనే ఓదార్పు యాత్ర చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..!

yearly horoscope entry point

రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర డిసెంబర్ నుంచి ఉండొచ్చని సమాచారం. ఈ యాత్రతో కిందిస్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వటంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా ధైర్యం నింపాలని యోచిస్తోంది. అయితే జగన్ యాత్రపై పార్టీ తరపున అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!

మళ్లీ మనమే వస్తాం - వైఎస్ జగన్

ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన… జగన్‌కు వయసుతోపాటు సత్తువ కూడా ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారని అన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవారి పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి… నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయన్నారు. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయని కామెంట్స్ చేశారు.

ఓటమి భావనను మరిచిపోవాలని నేతలకు జగన్ సూచించారు. మంచి చేశామని… ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలమన్నారు. కాలం గడిచే కొద్దీ మన పట్ట మళ్లీ అభిమానం వ్యక్తమవుతుందని… మళ్లీ మనం రికార్డు మెజార్టీతో గెలుస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మన కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారని, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని అన్నారు. వారందరికీ నేతలు భరోసా ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంటుందని గుర్తు చేశారు.

ఈ భేటీకి పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు నేతలు తోడుగా ఉండాలని జగన్ దిశానిర్దేశం చేశారు. రాజకీయదాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని… వారిలో ఆత్మస్థైర్యం నింపాలని సూచించారు. రాబోయే రోజుల్లో తాను కూడా నేరుగా వచ్చి కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పుకొచ్చారు.

మన పార్టీ కోసం కష్టపడుతూ…. జెండాలు మోసిన కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి ప్రలోభాలు ఉంటాయని…. వాటి ఎదుర్కొనే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు తోడుగా ఉండాలని చెప్పారు. కార్యకర్తలను, నేతలను పిలిచి మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని…. ఓటమిని మరిచిపోయి పని చేసుకోవాలన్నారు.

Whats_app_banner