Mla Partha saradhi: టీడీపీ గూటికి పార్థసారథి..! నూజివీడు నుంచి పోటీ చేసే అవకాశం!
Mla Partha saradhi: వైసీపీలో టిక్కెట్ దక్కదనే ప్రచారంతో అలకబూనిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి సారథికి స్పష్టమైన హామీ లభించినట్టు తెలుస్తోంది.
Mla Partha saradhi: కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ వైపు చూస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్థసారధిని తప్పించాలని భావిస్తున్నట్లు పార్టీ సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. గత వారం సామాజిక సాధికార యాత్రలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత పార్థసారధికి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయి.
టిక్కెట్ కేటాయించే పరిస్థితులు లేవని తేలిపోవడంతో పార్థసారథి తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి సారథికి ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. పెనమలూరు సీటును వదులుకుని నూజివీడుకు వెళితే ఎన్నికల బాధ్యత మొత్తం టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజక వర్గం నుంచి నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేయించే యోచనలో ఆ టీడీపీ ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి బాలకృష్ణ పోటీ చేయడం ముఖ్యమని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీకి తిరుగులేని పట్టుఉంది. అక్కడ ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు స్థానంపై టీడీపీ కన్నేసింది.
రగిలిపోతున్న పార్థసారథి…
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథి వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారు. 2014లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన సారథి, 2019లో పెనమలూరు నుంచి పోటీ చేశారు. గత వారం పదిరోజులుగా పార్టీతో అంటిముట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో సారథిని బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత కూడా ఆయన అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత రాలేదు. పెనమలూరు టిక్కెట్‌పై గ్యారంటీ లేక పోవడంతో నిరాశకు గురయ్యారు. అదే సమయంలో టీడీపీ కూడా ఆయన్ని ఒప్పించడంలో విజయం సాధించింది.
మంగళవారం రాత్రి టీడీపీ నేతలు సారథితో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలతో పార్టీ నేతలు హుటాహుటిన ఆయన వద్దకు తరలి వచ్చారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డితో జరిగిన భేటీలో సమస్య కొలిక్కి రాలేదు. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సారథి వెనక్కి తగ్గకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఆ తర్వాత కొద్ది సేపటికే పార్థసారథి తో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడిపి నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. టీడీపీ నుంచి పోటీకి ఒప్పించేందుకు మంతనాలు సాగించారు. టీడిపి నేతలు వైసీపీ ముఖ్య నాయకుడితో చర్చలు జరుపుతున్నారనే సమాచారంతో వైసీపీ నేతలు మళ్లీ ఆయన కార్యాలయానికి వచ్చారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి, ఇతర నేతలు సారథితో చర్చలు జరిపారు. వారికి సైతం సారథి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది.
ఈ నెల18వ తేదీన గుడివాడలో జరిగే టీడీపీ రా కదలిరా సమావేశంలో పార్థసారధి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ నేతలకు సారధి సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు.