Electricity Charges: విద్యుత్ ఛార్జీలు పెంచనని నేనెప్పుడన్నా.. చంద్రబాబు వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్న వైసీపీ
Electricity Charges: విద్యుత్ ఛార్జీలపై సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ వైరల్ చేస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు వ్యవహారంపై ఇటీవల శ్వేత పత్రం విడుదల సందర్భంగా బాబు కామెంట్లను వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.
Electricity Charges: విద్యుత్ ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల సందర్భంగా చేసిన వాఖ్యల్ని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనని తానెప్పుడు అన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారు. విపక్ష పార్టీల సానుభూతి పరులు సోషల్ మీడియాలో నాడు-నేడు అంటూ గతంలో విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
నాడు...
ఏపీలో వైసీపీ ప్రజల ఆగ్రహానికి గురవ్వటంలో విద్యుత్ ఛార్జీలు పెంపుదల కూడా ఒక కారణం. ఐదేళ్లలో దాదాపు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీంతో ప్రజలపై విద్యుత్ భారాలు పెరిగాయి. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, వీలైతే తగ్గిస్తామని టీడీపీ నేతలు ప్రకటనలు చేశారు.
అనేక ఎన్నికల సభల్లోనూ, అంతకు ముందు జరిగిన అనేక బహిరంగ సభల్లోనూ స్వయాన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు వేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు.
2023 ఆగస్టు 15న విశాఖపట్నంలో విజన్-2047 డాక్యూమెంట్‌పై ప్రెజెంటేషన్ సందర్భంగా ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, వీలైతే తగ్గిస్తామని అన్నారు. 2024 జనవరి 10న కృష్ణా జిల్లాలోని తిరువూరులో జరిగిన రా...కదలి రా బహిరంగ సభలో కూడా తాము అధికారంలోకి వస్తు విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు ప్రకటించారు. ఇవి ఉదాహరణలు మాత్రమే అనేక బహిరంగ సభల్లో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై మాట్లాడారు.
ఎన్నికల సభల్లో కూడా నాణ్యమైన విద్యుత్ రావాలంటే, విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని, వైసీపీ పోవాలని పిలుపు ఇచ్చారు. అలాగే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా విద్యుత్ రంగానికి సంబంధించిన విభాగంలో సోలర్ పవర్ ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆ రకంగానే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓటమి చెందింది. భారీ మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో గత వైసీపీ పాలనలోని వివిధ అంశాలపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఈనెల 9వ తేదీ (మంగళవారం)నవిద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసిందని విమర్శించారు. పేదవాడు...పెత్తందారుడు అనే జగన్ అనే పెత్తందారుడు పేదలపై తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారాలు వేశాడని విమర్శించారు. గత ప్రభుత్వంలో రూ. 47,741 కోట్ల నష్టం జరిగిందని, విద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇస్తూ తానెప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని అన్నానంటూఎదురు ప్రశ్న వేశారు. ఎన్నికల సమయంలో మీరు ట్రూఅఫ్ ఛార్జీలు, అదనపు ఛార్జీలు రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆ ఛార్జీలను రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది ఎక్కడికి పోతుందో తెలియదని, అప్పులే అంత ఉంటే విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతే, బొగ్గు (కోల్) కొనుగోలు చేయలేకపోతే మళ్లీ ఎక్కడికి పోతాం. పవర్ ఇవ్వలేమని అన్నారు. బాబు వ్యాఖ్యలపై వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. సోషల్ మీడియాలో అప్పటి వ్యాఖ్యలు, ప్రస్తుత వ్యాఖ్యలతో కూడిన వీడియోను వైరల్ చేస్తుంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)