Avanigadda Ycp Candidate: వైసీపీ అవనిగడ్డ అభ్యర్ధి మార్పు.. తీవ్రం కానున్న పోటీ
Avanigadda Ycp Candidate: అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో గతంలో ప్రకటించిన అభ్యర్థి స్థానంలో ఆయన కుమారుడితో పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు జనసేన కూడా అవనిగడ్డను సవాలుగా భావిస్తోంది.
Avanigadda Ycp Candidate: అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గంలో గెలుపు కోసం అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గం సమన్వయకర్తగా నియమించడంతో ఆయన స్థానం మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడు డాక్టర్ చంద్రశేఖరరావును ప్రకటించారు. అయితే పోటీకి ఆయన నిరాకరించి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరడంతో సిఎం జగన్ అందుకు సమ్మతించారు.
మాజీ మంత్రిగా రెండుసార్లు పనిచేసిన సింహాద్రి సత్యనారాయణకు దివిసీమ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది. కాపు సామాజిక వర్గంలో బలమైన పట్టున్న నాయకుడైనా ఆయన కుమారుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైద్యుడిగా గుర్తింపు పొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో సింహాద్రి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకు రావాలని వైసీపీ గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో సైతం ఆయన పేరు వినిపించింది. చివరి నిమిషంలో సింహాద్రి రమేష్‌ను ఎంపిక చేశారు.
ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఉంటుందనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌ను బందరు పార్లమెంటు నియోజక వర్గానికి సమన్వయకర్తగా పంపారు. డాక్టర్ చంద్రశేఖర్‌రావును ఒప్పించి పోటీ చేయించాలని భావించారు. వైసీపీ ఐదో జాబితాలో ఆయన పేరు ప్రకటించినా ఆయన పోటీ చేసే విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
అవనిగడ్డ ఇంఛార్జిగా డాక్టర్ చంద్రశేఖర్‌రావు పేరును ప్రకటించిన తర్వాత కూడా ఆయన పార్టీ వర్గాలకు అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు. సోమవారం జగన్మోహన్ రెడ్డితో కుమారుడితో కలిసి భేటీ అయ్యారు. వయసురీత్యా ఆ బాధ్యతల్ని తన కుమారుడు రామ్‌చరణ్‌ను సమన్వయకర్తగా ఎంపిక చేయాలని కోరినట్లు చెప్పారు.
''అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన చంద్రశేఖర్ వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరణ్‌కు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.
ఇకనుంచి రామ్‌చరణ్ అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జిగా ప్రతి గడపకూ తిరుగుతాడని సీఎం జగన్ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాడని చెప్పారు.
తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. అవనిగడ్డ ప్రజలకు సుదీర్ఘ కాలం తన తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారని, ఆ వారసత్వాన్ని నా కుమారుడు రామ్‌చరణ్ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి సిద్దంగా ఉన్నాడన్నారు. తమ కుటుంబాన్ని ఆదరించి కుమారుడిని ఆశీర్వదించాలని విన్నవించుకుంటున్నానని చెప్పారు.
జనసేన నుంచి బాలసౌరి కుమారుడు?
మరోవైపు అవనిగడ్డ నియోజక వర్గం నుంచి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి కుమారుడు అనుదీప్ పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బాలశౌరికి జనసేన అధినేత నుంచి భరోసా లభించినట్టు తెలుస్తోంది. బాలశౌరి గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు టిక్కెట్ కేటాయించకపోవచ్చని తెలుస్తోంది.
దీంతో మచిలీపట్నం పార్లమెంటు స్థానంతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వల్లభనేని కుటుంబానికి చెందిన అనుదీప్‌ను పోటీ చేయించాలని భావిస్తున్నారు.