World AIDS Day : కండోమ్స్ వాడకనేనా.. ఏపీలో ఇన్ని HIV కేసులు?-world aids day 13815 hiv cases reported in andhra pradesh in this year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  World Aids Day : కండోమ్స్ వాడకనేనా.. ఏపీలో ఇన్ని Hiv కేసులు?

World AIDS Day : కండోమ్స్ వాడకనేనా.. ఏపీలో ఇన్ని HIV కేసులు?

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 02:59 PM IST

Andhra Pradesh Aids Cases : డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రభుత్వాలు ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు చేస్తున్నా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2022లో ఏపీలో 13,815 హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) కేసులు నమోదయ్యాయి. కండోమ్స్ వాడకపోవడం వల్లేనా.. ఇన్ని కేసులు నమోదయ్యేది?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

HIV కేసుల్లో దేశంలోనే ఏపీ ముందు వరుసలో ఉంది. సుమారు మూడు లక్షలకు పైగా బాధితులు ఉన్నారు. ప్రభుత్వం అనేక ఎయిడ్స్(AIDS) నియంత్రణ కార్యక్రమాలు చేపడుతోంది. కేసులు మాత్రం తగ్గడం లేదు. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 13,815 కొత్త హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త కేసులతో, రాష్ట్రంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ రోగుల సంఖ్య దాదాపు 3.21 లక్షలకు చేరుకుంది. అయితే ఎయిడ్స్ బారిన పడిన వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

2010లో రాష్ట్రంలో సానుకూలత రేటు 6.74 శాతం కాగా ఇప్పుడు సాధారణ జనాభాలో 0.87 శాతానికి తగ్గింది. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ పాజిటివ్‌(HIV Positive) కేసులను నిరోధించేందుకు రాష్ట్రం అనేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరికొన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. మరికొన్నాళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2022లో రాష్ట్రంలో మరో 13,815 కొత్త హెచ్‌ఐవి కేసులు(HIV Cases) నమోదయ్యాయి. అధికారులు 23,57,260 మంది రోగులను పరీక్షించి 13,815 మంది హెచ్‌ఐవి బారిన పడ్డారని గుర్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,926 కేసులు నమోదయ్యాయి. అలాగే గుంటూరు-1878, కృష్ణా-1,697, పశ్చిమగోదావరి-1,218, విశాఖపట్నం-1,221, ప్రకాశం-1,182, కర్నూలులో 918, అనంతపురం-848, చిత్తూరు-775, చిత్తూరు-775 కేసులు నమోదయ్యాయి. కడపలో 588, శ్రీకాకుళంలో 432, విజయనగరంలో 424 హెచ్‌ఐవి కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,21,028 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉంది.

దేశంలో నమోదైన హెచ్ఐవీ కేసుల్లో ఏపీ మెుదటిస్థానంలో ఉందని ఇటీవలే.. జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెప్పింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. భారతదేశంలో గడిచిన పదేళ్ల (2011- 21)లో అసురక్షిత సంభోగంతో దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా హెచ్ఐవీ వస్తే.. ఇందులో ఏపీలో అత్యధికంగా 3.18 లక్షల మందికి ఈ మహమ్మారి బారిన పడ్డారు. రాష్ట్రాల పరంగా అసురక్షిత సంభోగంతో దేశంలో అత్యధిక హెచ్ఐవీ కేసులు ఏపీలోనే ఉన్నాయి.

హెచ్ఐవీ(HIV)పై అందరికీ అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం, కలుషిత రక్తమార్పిడి, కలుషిత సిరింజిలను వాడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇమ్యునోడెఫిసియెన్సీ వైరస్ (HIV) కారణంగా ఈ వ్యాధి వస్తుంది. అక్వైర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్ (AIDS)గా రూపాంతరం అవుతుంది. ఎయిడ్స్ తో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.., మనిషి క్రమంగా క్షీణించి చనిపోతారు.

Whats_app_banner