AP Liquor Shop : తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు.. కారణం ఇదే-women blocked liquor shop in tadepalli of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Shop : తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు.. కారణం ఇదే

AP Liquor Shop : తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు.. కారణం ఇదే

Basani Shiva Kumar HT Telugu
Oct 15, 2024 01:04 PM IST

AP Liquor Shop : ఏపీలో రేపటి నుంచి కొత్త వైన్ షాప్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం మద్యం దుకాణాలను దక్కించుకున్నవారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాడేపల్లిలో మద్యం వ్యాపారులకు చుక్కెదురైంది. ఆశ్రమం రోడ్డులో ఏర్పాటు చేయబోయే వైన్ షాపును అక్కడి మహిళలు అడ్డుకున్నారు.

తాడేపల్లిలో ఆందోళన చేస్తున్న మహిళలు
తాడేపల్లిలో ఆందోళన చేస్తున్న మహిళలు

తాడేపల్లిలో ఏర్పాటు చేయబోయే మద్యం షాపును మహిళలు అడ్డుకున్నారు. ఆశ్రమం రోడ్డులో అపార్ట్‌మెంట్‌ల పక్కనే నూతన మద్యం షాపును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఇళ్ల మధ్యలో షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. అక్కడి మహిళలు రోడ్డెక్కారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు, స్థానికుల నినాదాలు చేశారు.

'రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాపు పెడుతున్నారని తెలిసింది. ఇక్కడ వద్దని చెప్పాం. పిల్లలు, మహిళలు తిరిగే దారిలో వైన్ షాపు పెడితే.. ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పాం. అయినా వినకుండా ఇక్కడ మద్యం దుకాణం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు' అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్ అయ్యారు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుని బంధువులు నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకొని సర్దిచెప్పారు.

ఏపీలో మద్యం షాపులను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని 3396 మద్యం షాపుల్లో 345 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. విశాఖలో అత్యధికంగా 155 షాపుల్లో 31 మహిళలకు లక్కీ డ్రా రాగా, అనకాపల్లిలో 25 షాపులు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున షాపులు మహిళలకు దక్కాయి. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక షాపు మహిళకు దక్కింది.

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ, షాపుల కేటాయింపు అంతా సజావుగా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. 16వ తేదీ నుంచి అమలయ్యే నూతన మద్యం పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయన్నారు. కొత్త బ్రాండ్ల టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటామని చెప్పారు.

మద్యం షాపుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎవరినీ వదిలేది లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాలు, పాఠశాలలకు 100 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదని చెప్పారు. ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువకు అమ్మకాలు, బెల్టు, కల్తీ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలుంటాయన్నారు.

Whats_app_banner