Raksha bandhan 2024: రక్షా బంధన్ విశిష్టతను తెలియజేసే ఆలయాలు ఇవి, ఇక్కడ అన్నాచెల్లెళ్ళు దేవుళ్ళు
Raksha bandhan 2024: అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య అపురూపమైన విడదీయరాని బంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. దేవ దేవుళ్ళు కూడా రక్షా బంధన్ వేడుకను జరుపుకున్నారు. రక్షా బంధన్ విశిష్టతను తెలియజేసే కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అన్నా చెల్లెళ్ళు దేవదేవుళ్ళుగా కలిసి పూజలు అందుకుంటారు.
Raksha bandhan 2024: భారతదేశం అనేక దేవాలయాలకు నిలయం. వాటిలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయంలో సతీసమేతంగా స్వాముల వారు కొలువై భక్తులకు దర్శనం ఇస్తుంటారు. కానీ కొన్ని ఆలయాలు మాత్రం అన్నాచెల్లెళ్ళు దేవదేవుళ్లుగా కొలువై పూజలు అందుకుంటారు.
అన్నాచెల్లెళ్ళు ఉన్న ఆలయం అనగానే అందరికీ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథుడి దేవాలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు బలభద్రుడితో పాటు సోదరి సుభద్రను కూడా పూజిస్తారు. ఈ ఆలయం మాత్రమే కాదు అన్నా చెల్లెళ్లను పూజించే మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని రక్షా బంధన్ తో ముడి పడి ఉన్నాయి. ఈ ఆలయాలను దర్శించుకుంటే ఆ అన్నాచెల్లెళ్ళు జీవితం ఆనందంగా ఎటువంటి కష్టం లేకుండా సాగిపోతుంది. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ ఆలయం
ఒడిశాలోని పూరీ తీరంలో ఉన్న జగన్నాథుడి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో సుభద్ర మధ్యలో ఉండగా కుడి, ఎడమ వైపున శ్రీకృష్ణుడు, బలభద్రుడు ఉంటారు. ఆలయమ లోపలి గర్భగుడిలో ఈ ముగ్గురి దేవతల విగ్రహాలు ఉంటాయి. ఏటా ఆషాడ మాసంలో పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ముగ్గురు దేవతలు తన మేనత్త గుండిచా ఆలయానికి వెళతారు. కన్నుల పండుగగా ఈ యాత్ర జరుగుతుంది.
యమునా, యముడి దేవాలయం
మధురలోని యమునా నది ఒడ్డున పురాతన దేవాలయాలలో ఇదీ ఒకటి. ఈ ఆలయం ద్వారకాధీష్ ఆలయానికి సమీపంలోని విశ్రం ఘాట్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ యమునా దేవి, యముడిని పూజిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని ధర్మరాజు ఆలయమ అని కూడా పిలుస్తారు. ఇక్కడ యమునా, యముడి విగ్రహాలు నల్ల రాతితో ఉంటాయి. దాదాపు 4900 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభ ఈ దేవతలను ప్రతిష్టించాడని చెబుతారు. సోదరి సోదరుడికి అంకితం చేసిన ఆలయం ఇది.
భాయ్ ధూజ్ రోజున యమునా తన సోదరుడు యముడిని భోజనానికి పిలిచినట్టు చెబుతారు. భోజనానంతరం హిందూ సంప్రదాయం ప్రకారం యముడు యమూనాని ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడట. తనకు భౌతిక కోరికలు ఏవి లేనందున ఒక కోరిక కోరింది. భాయ్ ధూజ్ రోజున తమ సోదరులతో కలిసి ఆలయాన్ని సందర్శించి యమునా నదిలో స్నానం చేసిన సోదరీమనులందరిని తమ పాపాల నుంచి శిక్షల నుంచి విముక్తి కలిగించమని యముడిని వేడుకుంది. ఆమె కోరికను యముడి సంతోషంగా అంగీకరించాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకుని యమునా నదిలో పుణ్య స్నానం ఆచరించిన వారికి యముడి నుంచి శిక్షలు తప్పుతాయని నమ్ముతారు.
సంతోషి మాత దేవాలయం
ఉజ్జయిని నగరం దేవాలయాల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే సంతోషి మాత, శుభ్ లాభ్ ఆలయం ఉంది. ఈ ఆలయమ ఆస్తా తోట వెనుక ఉన్న జీవన్ ఖేడి గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం వినాయకుడికి శుభ్ లాభ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరోజు రక్షాబంధన్ రోజున వినాయకుడికి రాఖీ కట్టేందుకు తన సోదరి మానస వచ్చింది. తమకు కూడా రాఖీలు కట్టే సోదరి కావాలని ఆకాంక్షించారు. వారి కోరికను మన్నించిన వినాయకుడు సంతోషి మాతను సృష్టించాడు. అప్పటి నుంచి సంతోషి మాత శుభ్, లాభ్ సోదరిగా ఉంది. ఈ ఆలయం వీరికి అంకితం చేసింది.