AP Private Universities: ఏపీలొ ప్రైవేట్ వర్శిటీల కష్టాలు తీరుతాయా? ప్రభుత్వ కోటా నిబంధనలపై అసంతృప్తి..
AP Private Universities: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఐదేళ్లుగా తాము ఎదుర్కొన్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని ప్రైవేట్ యూనివర్శిటీలు ఎదురు చూస్తున్నాయి. అమరావతిలో పెట్టుబడులు పెట్టిన విశ్వవిద్యాలయాలు కనీసం రోడ్డు రవాణాకు కూడా నోచుకోలేదు.
AP Private Universities: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ ఆహ్వానంతో ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతి భూసమీకరణ చేసిన ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలు అమరావతిలో క్యాంపస్‌లో ఏర్పాటు చేశాయి.
రాజధాని నిర్మాణం ప్రారంభించిన రెండేళ్ళలోపే సొంత క్యాంపస్‌లను నిర్మించి తరగతులు ప్రారంభించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాల్లో ముందున్న వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం, అమృత వంటి సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశాయి. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు కనీస ధరతో భూ కేటాయింపులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో సొంత క్యాంపస్‌లు ఏర్పాటుకు అయా విద్యా సంస్థలు కూడా ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టాయి. లయోలాకు చెందిన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి మరికొన్ని సంస్థలు మేనేజ్మెంట్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని భూములు తీసుకున్నాయి. 2019లో ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో ఈ విద్యా సంస్థలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ విధానాల్లో భాగంగా మూడు రాజధానుల ప్రతిపాదనలతో కొన్ని సంస్థలు భూ కేటాయింపులు రద్దు చేసుకున్నాయి. అప్పటికే తరగతులు ప్రారంభించిన సంస్థలు వెనక్కి వెళ్లలేక, కొనసాగలేక ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి రకరకాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునే సమయంలో ఒక్కో విద్యా సంస్థకు 200ఎకరాలను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొలి విడతలో ఒక్కో సంస్థకు 100ఎకరాలను కేటాయించారు. ప్రభుత్వం మారడంతో భూ కేటాయింపులు నిలిచిపోవడంతో పాటు వాటిపై కక్ష సాధింపులు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. రోడ్లు పూర్తిగా ధ్వంసమై పోవడంతో విద్యార్ధులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాలేజీ బస్సుల రాకపోకల కోసం రోడ్లను నిర్మించాలని కోరితే వెక్కిరింతలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అయా సంస్థలు గుర్తు చేసుకుంటున్నాయి.
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను అయా వర్శిటీలే సొంతంగా నిర్వహించుకునేవి. ఈ క్రమంలో ప్రభుత్వం భూములు కేటాయించినందున ప్రతి కాలేజీలో 25శాతం సీట్లను తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ యూనివర్శిటీ, స్టేట్ యూనివర్శిటీల్లో ఉన్న సీట్లలో 25శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ కాలేజీల్లో చేరేందుకు మిగిలిన విద్యార్ధులు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణ ఉంది. ప్రభుత్వ కోటాలు అమలు చేస్తుండటంతో యూనివర్శిటీ స్టాండర్స్డ్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయని విశ్వవిద్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు.
కాలేజీలు నేరుగా అడ్మిషన్లు ఇచ్చే విద్యార్ధుల నుంచి వసూలు చేసే ఫీజులకు, ప్రభుత్వం ద్వారా చేరే విద్యార్ధులు చెల్లించే ఫీజుల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోయాయని చెబుతున్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వం అనుమతించిన ఫీజుల్ని మాత్రమే వారికి చెల్లించడం, మిగిలిన వారు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తోందనే వాదనలతో కాలేజీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నాయి. దీనికి అమోదయోగ్యమైన పరిష్కారం కొత్త ప్రభుత్వం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ యూనివర్శిటీల్లో ప్రభుత్వ కోటా సీట్లను ఖరారు చేసే విషయంలో కూడా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. మొదట 50శాతం సీట్లను ప్రభుత్వ కోటాకు ఇవ్వాలని మొదలుపెట్టి చివరకు 25శాతానికి ఖరారు చేసే వరకు తాడేపల్లి కేంద్రంగా బేరసారాలు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు అడిగిన అయా సంస్థలు కప్పం కట్టి బయటపడినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా ఏర్పాటైన ప్రైవేట్ యూనివర్శిటీలన్నీ ఏపీలో కన్వీనర్ కోటాలో 25శాతం సీట్లను భర్తీ చేస్తున్నాయి.