Rice Price Control: బాబూ..కాస్త బియ్యం ధరల్ని నియంత్రిస్తారా? జనం అల్లాడిపోతున్నారు..
Rice Price Control: చుక్కలనంటుతున్న బియ్యం ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. రిటైల్ మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ.65 దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. సంక్షేమ పథకాల కంటే ముందు ధరల నియంత్రణపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
Rice Price Control: మిలర్లు, వ్యాపారుల గుప్పెట్లో గత ఐదేళ్లుగా సాగుతున్న దోపిడీకి కొత్త ప్రభుత్వం అడ్డు కట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఏడాది కాలంలో బియ్యం ధరల్లో 26కేజీల బస్తాపై రూ.400-500 వ్యత్యాసం వచ్చింది. ప్రభుత్వానికి తెలిసే ధరల దోపిడీ జరిగిన ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మిల్లర్లు, దళారులు కుమ్మక్కై సాగించిన నాటకంలో సామాన్య ప్రజలు విలవిల్లాడిపోయారు. రాష్ట్రంలో 87శాతం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించామని 90శాతం ప్రజలకు నేరుగా చౌక బియ్యం పంపిణీ చేశామని గొప్పలు చెప్పుకున్నా మార్కెట్ దోపిడీకి గురి కాని వర్గమంటూ లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఏటా వరిదిగుబడి ఉన్నా బియ్యం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వరదలు, తుఫాన్లతో పంట నష్టం జరిగిందంటూ మిల్లర్లు యథేచ్ఛగా దోపిడీ సాగించారు. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. గత మూడేళ్లుగా దిగుబడులు తక్కువగా ఉండటంతో పాటు గత ఏడాది మిగ్‌జాం తుఫాను దెబ్బకు పంటలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో గత ఆర్నెల్లుగా బియ్యం ధరలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి.
గత ఏడాది మిగ్‌జాం తుఫాను సృష్టించిన విధ్వంసంతో తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది. అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరలపై గణనీయమైన ప్రభావం చూపనుంది.పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలను తుఫాను ముంచెత్తింది. నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారమంతా ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురిశాయి. మిగ్‌జాం ప్రభావానికి కోతలకు వచ్చిన పంట పూర్తిగా వాలిపోయింది. కొన్ని చోట్ల నీటిలో నాని పోయింది. రోజుల తరబడి నీటిలో నాని పోవడంతో పనికి రాకుండా పోయింది. ఏపీలో ఒక్క కృష్ణా డెల్టా పరిధిలో 13లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా డెల్టా విస్తరించింది. మిగ్ జామ్ తుఫాను మొదట తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది.
జనవరి వరకు రూ.1300గా 26కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ.1550-1600కు చేరింది.ఫిబ్రవరి, మార్చి నెలల్లో రబీ పంటతో ధరలు తగ్గాల్సి ఉన్నా అలా జరగలేదు. ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెండ్ రకం సన్న బియ్యం ధరలు కిలో రూ.60-65వరకు ధర పలుకుతున్నాయి.బ్రాండెడ్ బియ్యం ధరలు రూ.70కు చేరాయి. ఇక వంట నూనెలు, పప్పు ధాన్యాలు, తప్పనిసరి ఆహార ఉత్పత్తుల ధరలకు అడ్డు అదుపు లేదు.
ధరల నియంత్రణే అత్యుత్తమ సంక్షేమ పథకం...
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టడానికి ధరల దోపిడీ కూడా ఓ కారణమైంది. ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు ఎడాపెడా పెరిగిన ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేదు. ప్రతి ఇంటికి డబ్బులిస్తున్నామంటూ నిత్యావసర వస్తువుల ధరలు నింగికి చేరినా పట్టించుకోలేదు.
రైస్‌మార్ట్‌ల అవసరం…
వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు బియ్యం ధరల్ని నియంత్రించాలని బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మార్ట్‌లను ఏర్పాటు చేసి అందరికి అందుబాటు ధరల్లో బియ్యాన్ని విక్రయించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రైతుల నుంచి సేకరించి చౌకధరల దుకాణాల ద్వారా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40ఖర్చు చేస్తోంది.
దానినే కనీస విక్రయ ధరగా నిర్ణయించి, దళారుల దోపిడీకి అడ్డు కట్ట వేస్తే ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. ప్రభుత్వమే నేరుగా బియ్యాన్ని విక్రయించాల్సిన అవసరం ఉంది. రోజువారీ ఆహారంలో వినియోగించే వంట నూనెలు, పప్పు ధాన్యలు, రవ్వలు వంటి పదార్ధాలపై కూడా గరిష్ట ధరల్ని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలపై భారం కొంతైనా తగ్గుతుంది. ఈ దిశగా టీడీపీ ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం కనీస ధరకు విక్రయించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టడానికి అవసరమైన డేటా బేస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంది.
ప్రస్తుతం చౌక ధరల దుకణాల ద్వారా మొబైల్ డెలివరి యూనిట్లతో పంపిణీ చేస్తున్న బియ్యంలో మూడొంతులు అదే వాహనాల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. వాటిని రీ సైకల్ చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం లక్షిత వర్గాలకు చేరకుండా పోతోంది. లబ్దిదారుల నుంచి రూ.10కు బియ్యాన్ని కొని అక్రమంగా అమ్మేస్తున్నారు. రూ.40ఖర్చుతో ప్రభుత్వం అందించే బియ్యాన్ని పది రుపాయలకు అమ్మేసి మార్కెట్లో రూ.60రుపాయలకు సన్న బియ్యాన్ని కొనడానికి పేదలు కూడా అలవాటు పడ్డారు. ఆ మొత్తం ఛైన్‌ను సరైన నియంత్రణలోకి తీసుకువస్తే ప్రజలపై భారం తగ్గడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై భారం కూడా తగ్గుతుంది.
సంబంధిత కథనం